కర్నూలు యాక్సిడెంట్.. ఇంకే డౌట్లు లేవు

ఎర్రిస్వామి కొంతమేర బైక్‌ను పక్కకు లాగగలిగాడు కానీ.. పూర్తిగా రోడ్డు మార్గం నుంచి దాన్ని తప్పించలేకపోయాడు.;

Update: 2025-11-13 18:16 GMT

20 రోజుల కిందట ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో.. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు ప్రయాణిస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఘోర ప్రమాదానికి గురై 20 మందికి పైగా సజీవ సమాధి కావడం ఎంత సంచలనం రేపిందో తెలిసిందే. మొదట్లో ఈ ప్రమాదం జరిగిన తీరుపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి. ఇందులో కుట్ర కోణం గురించి కూడా చర్చ జరిగింది. కానీ తర్వాత పోలీసులు అసలు విషయం బయటపెట్టారు.

శివ శంకర్, ఎర్రిస్వామి అనే ఇద్దరు స్నేహితులు హై వే మీద బైక్‌పై వెళ్తూ డివైడర్‌ను ఢీకొట్టడం.. శివశంకర్ చనిపోవడం.. వీళ్లిద్దరూ ప్రయాణిస్తున్న బైక్ రోడ్డు మీదే ఉండిపోవడం.. దాన్ని ఢీకొట్టే క్రమంలో ట్రావెల్ బస్సులో మంటలు చెలరేగడం.. నిమిషాల్లో మంటలు పెద్దవై బస్సులో ఉన్న వాళ్లు అగ్నికి ఆహుతి కావడం.. ఇదీ జరిగిందంటూ పోలీసులు వివరించారు.

కానీ చాలామంది దీని మీద సందేహాలు వ్యక్తం చేశారు. పోలీసులు ఏవో కట్టుకథలు అల్లుతున్నారంటూ విమర్శలు చేశారు. కానీ తాజాగా బయటికి వచ్చిన ఒక వీడియోతో పోలీసులు చెప్పిందంతా నిజమే అని తేలిపోయింది. ప్రమాదానికి గురైన బస్సు కంటే ముందు ఆ మార్గంలో వెళ్లిన ఒక బస్సు నుంచి బయటికి తీసిన సీసీ టీవీ ఫుటేజీతో ఈ యాక్సిడెంట్‌పై ఒక స్పష్టత వచ్చింది. డ్రైవర్ క్యాబిన్ నుంచి రికార్డ్ అయిన ఆ ఫుటేజీని పరిశీలిస్తే.. హైవేలో ఎడమ వైపు శివశంకర్ మృతదేహం వద్ద ఎర్రిస్వామి నిలబడి ఉన్న దృశ్యం కనిపిస్తోంది. కొంచెం ముందు బైక్ రోడ్డు మీద పడి ఉన్న దృశ్యమూ చూడొచ్చు.

ఎర్రిస్వామి కొంతమేర బైక్‌ను పక్కకు లాగగలిగాడు కానీ.. పూర్తిగా రోడ్డు మార్గం నుంచి దాన్ని తప్పించలేకపోయాడు. ఆ సమయంలో అక్కడ ప్రయాణించిన వాళ్లు మృతదేహాన్ని కానీ, బైక్‌ను కానీ పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోయారు. కాసేపటికి కావేరి బస్సు ఆ బైక్‌ను ఢీకొట్టి కొంత దూరం లాక్కెళ్లింది. బైక్ కింది భాగంలో ఇరుక్కుని మంటలు చెలరేగాయి. తర్వాత ఘోరం జరిగిపోయింది. ఎవరైనా ఆపి బైక్‌ను పక్కకు లాగి ఉంటే బస్సు ప్రమాదం జరిగేదే కాదన్నది స్పష్టం.

Tags:    

Similar News