తూతూ మంత్రం వద్దు... గుర్తుకొస్తున్న 45 మంది సజీవదహనం కేసు!

కర్నూలు జిల్లాలో వేమూరి కావేరి బస్సు ఘోర అగ్ని ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 19 మంది సజీవ దహనం అయ్యారు.;

Update: 2025-10-25 05:18 GMT

కర్నూలు జిల్లాలో వేమూరి కావేరి బస్సు ఘోర అగ్ని ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 19 మంది సజీవ దహనం అయ్యారు. ఈ ప్రమాదం నుంచి గాయాలతో బయటపడినవారు తమ తమ భయానక అనుభవాలను, బస్సు యాజమాన్యం నిర్లక్ష్యాలను, నిబంధనల ఉల్లంఘనలను వెల్లడిస్తున్నారు! ఈ సమయంలో రవాణా శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు!

అవును... సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగితే అప్పుడు పాలకుల స్టేట్ మెంట్లు, అధికారులు చర్యలు ఒక్కసారిగా తెరపైకి వస్తాయి! ఇందులో భాగంగా... నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని ప్రమాదం జరిగి, ప్రజల ప్రాణాలు పోయిన తర్వాత ప్రభుత్వ పెద్దలు స్పందిస్తుంటారు! అనంతరం.. అధికారులు వెంటనే రంగంలోకి దిగి తనిఖీలు చేపడుతుంటారు! మరి ఇంతకాలం ఏమయ్యారు?

తాజాగా కర్నూలు లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం అనంతరం తెలంగాణ రవాణా శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ సందర్భంగా ప్రైవేటు బస్సులను అధికారులు తనిఖీ చేస్తున్నారు. ఇందులో భాగంగా... విజయవాడ హైవే, బెంగళూరు హైవేపై ఆర్టీఏ బృందాలు విస్తృత తనిఖీలు చేపట్టాయి. ఇదే సమయంలో... రాజేంద్రనగర్‌ పరిధి గగన్‌ పహాడ్‌ వద్ద సోదాలు చేశారు.

ఇదే క్రమంలో.. ఏపీ నుంచి వస్తున్న ట్రావెల్స్‌ బస్సులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా... వాహనాల్లోని ఫైర్‌ సేఫ్టీ, మెడికల్ కిట్లను పరిశీలించారు. నిబంధనలు పాటించని 5 ట్రావెల్స్‌ బస్సులపై కేసులు నమోదు చేశారు. బస్సు అద్దం పగిలినప్పటికీ అలాగే నడుపుతున్న ట్రావెల్స్‌ బస్సును అధికారులు సీజ్‌ చేశారు.

తూతూ మంత్రంగా కాకూడదని..!:

కర్నూలులో జరిగిన ఘోర అగ్నిప్రమాదం అనంతరం తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం రాత్రి పలుచోట్ల ఆర్టీఏ అధికారులు, పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అయితే... ప్రమాదం జరిగిందని మాత్రమే కాకుండా, తూతూ మంత్రపు తనిఖీలుగా కాకుండా, తనిఖీలు నిత్యం ఇలాగే కొనసాగాలని ప్రయాణికులు కోరుతున్నారు! నిబంధనలు పాటించని బస్సులను సీజ్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు!

గుర్తుకొచ్చిన 45 మంది సజీవదహనం కేసు!:

కర్నూలులో జరిగిన తాజా ఘటన నేపథ్యంలో 2013 అక్టోబరు 30 తెల్లవారుజామున 5:10 గంటల సమయంలో బెంగళూరు-హైదరాబాద్‌ జాతీయ రహదారి 44 పై జరిగిన ఘోరాన్ని ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. మహబూబ్‌ నగర్‌ జిల్లా పాలెం మార్గంలో భీమా వంతెన రెయిలింగ్‌ ఇనుపచువ్వకు వోల్వో బస్సు డీజిల్‌ ట్యాంకు బలంగా తాకడంతో.. ఆ రాపిడికి బస్సువేగం తోడై మంటలు చెలరేగాయి.

దీంతో... బస్సులో ఉన్న 45 మంది నిద్రమత్తులోనే అగ్నికి ఆహుతయ్యారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసిన సీఐడీ.. బస్సు డ్రైవర్‌ ను ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ మొత్తం 10 మందిపై అభియోగాలు మోపింది. 2015 మార్చి 10న వనపర్తి జిల్లా జడ్జి కోర్టులో ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. ఇన్నేళ్లు గడిచినా న్యాయస్థానంలో సమర్థంగా వాదనలు వినిపించడంలో సీఐడీ సఫలం కాలేకపోతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News