బస్సు మంటలు.. 2 వారాల్లో 40 మంది మృతి.. రంగంలోకి సోనూసూద్!

అవును... కర్నూలులో జరిగిన ఘోర బస్సు ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అయిన వేళ సోనూసూద్ స్పందించారు.;

Update: 2025-10-25 11:47 GMT

హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వీ.కావేరీ బస్సుకు కర్నూలులో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఇద్దరు పిల్లలు సహా 19 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం మొత్తం దిగ్భ్రాంతికి గురైంది. సంఘటన స్థలం నుండి హృదయ విదారక చిత్రాలు, కథనాలు వ్యాపించడంతో.. ఈ విషాదం సోషల్ మీడియాలో మరింత వైరల్ గా మారింది. ఈ సమయంలో సోనూసూద్ స్పందించారు.

అవును... కర్నూలులో జరిగిన ఘోర బస్సు ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అయిన వేళ సోనూసూద్ స్పందించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి ఓ కీలక రిక్వస్ట్ చేశారు. ఇందులో భాగంగా... ప్రతి లగ్జరీ బస్సులో క్లిష్టమైన సమయాల్లో విఫలమయ్యే ఎలక్ట్రానిక్ తలుపులు మాత్రమే కాదు.. మాన్యువల్ ఎమర్జెన్సీ డోర్ ఉండాలని.. ప్రయాణీకుల భద్రత కోసం, దీనిని చట్టం ప్రకారం తప్పనిసరి చేయాలని అన్నారు.

ఈ నేపథ్యంలో... పర్మిట్లను పునరుద్ధరించే ముందు ఆపరేటర్లు ఫోటోలతో కూడిన రుజువును అప్‌ లోడ్ చేయాలని.. దీనికోసం ఒక నెల సమయం ఇవ్వండి.. ప్రయాణికుల భద్రత విషయంలో రాజీ పడోద్దు సర్ అంటూ కేంద్ర రోడ్డు రవాణ మంత్రి నితిన్ గడ్కరీకి ట్విట్టర్ లో రిక్వస్ట్ చేశారు

అంతకంటే ముందు ఇదే దుర్ఘటనపై స్పందిస్తూ.. బస్సుల్లో జరిగిన అగ్ని ప్రమాదాల్లో 2 వారాల్లో సుమారు 40 మంది ప్రాణాలు కోల్పోయారని.. ప్రజలు తమ కుటుంబాలను చూడటానికి ప్రయాణిస్తారు కానీ, వారి అంత్యక్రియలు తీర్చుకోవడానికి కాదని చెబుతూ... కఠినమైన భద్రతా నిబంధనలకు సమయం ఆసన్నమైందని సోనూసూద్ తెలిపారు. ఈ సందర్భంగా.. బస్సుల్లో సురక్షితమైన వైరింగ్, ఎమర్జెన్సీ ఎగ్జిట్ చాలని తెలిపారు!

కాగా... ఈ నెల రెండోవారంలో రాజస్థాన్‌ లో జరిగిన మరో ఘోర బస్సు అగ్నిప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. అక్టోబర్ 14న జైసల్మేర్ నుండి జోధ్‌ పూర్‌ కు వెళ్తున్న ప్రైవేట్ ఏసీ స్లీపర్ బస్సు అగోలై గ్రామం సమీపంలో మంటల్లో చిక్కుకుంది. దీంతో.. 19 మంది అక్కడికక్కడే మరణించారు. ఇలా.. రెండు వారాల్లోనే బస్సు మంటల్లో సుమారు 40 మంది ప్రాణాలు కోల్పోవడంతో, భద్రతా ఆందోళనలు కీలక స్థాయికి చేరుకున్నాయి.

స్పందించిన రష్మిక మందన్న:

ఈ ఘటనపై స్పందించిన రష్మిక... కర్నూలు నుండి వచ్చిన వార్త తన హృదయాన్ని తీవ్రంగా బాధపెడుతోందని.. ఆ మండుతున్న బస్సు లోపల ఆ ప్రయాణికులు ఏమి అనుభవించారో ఊహించుకోవడం భరించలేనిదిగా ఉందని అన్నారు. చిన్న పిల్లలతో సహా మొత్తం కుటుంబం, చాలా మంది నిమిషాల్లో ప్రాణాలు కోల్పోయారని ఆలోచించడం నిజంగా వినాశకరమైనదని చెబుతూ.. వారి ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.

స్పందించిన మంచు విష్ణు!:

ఇదే క్రమంలో నటుడు మంచు విష్ణు.. కర్నూలు దుర్ఘటనపై స్పందించారు. ఈ సందర్భంగా.. 'హైదరాబాద్-బెంగళూరు హైవేపై జరిగిన విషాదకరమైన బస్సు ప్రమాదంతో తీవ్ర కలత చెందాను. ఇంత భయంకరమైన రీతిలో చాలా మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. బాధితుల కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతి. గాయపడిన వారి కోసం ప్రార్థనలు చేస్తున్నాను.. దుఃఖిస్తున్న వారికి బలం చేకూరాలి!' అని ఎక్స్ లో రాశారు.

Tags:    

Similar News