మద్యం మత్తు రాసిన మరణ శాసనం... డిఫరెంట్ గా డ్రైవర్ వెర్షన్!

మద్యం ఎన్నో కుటుంబాలను, మరెన్నో జీవితాలను ఛిద్రం చెస్తుందనేది తెలిసిన విషయమే.;

Update: 2025-10-26 05:51 GMT

మద్యం ఎన్నో కుటుంబాలను, మరెన్నో జీవితాలను ఛిద్రం చెస్తుందనేది తెలిసిన విషయమే. అయితే.. ఓ వ్యక్తి మద్యం మత్తు దేశం మొత్తం దిగ్భ్రాంతికి గురయ్యే ఘటనకు కారణమైన ఘటనే కర్నూలులో జరిగిన వి.కావేరీ బస్సులో జరిగిన ఘోర అగ్నిప్రమాదం. అలా అని బస్సు యాజమాన్యానిది తప్పు లేదని కాదు.. కానీ, ప్రాథమిక నేరం మాత్రం మద్యం మత్తు వ్యక్తిది అనే చెప్పుకోవాలి!

అవును... కర్నూలు శివారులో శుక్రవారం తెల్లవారుజామున వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు కాలిపోయి 19 మంది సజీవదహనమైన సంగతి తెలిసిందే. అయితే.. ఈ ఘటనకు ద్విచక్ర వాహనదారుడు శివశంకర్‌ మద్యం మత్తే ప్రధాన కారణమని వెలుగులోకి వచ్చింది. తాగిన మత్తులో ఉన్న శివశంకర్‌.. జాతీయరహదారిపై బైక్‌ తో డివైడర్‌ ను ఢీకొట్టి పడిపోయి మరణించాడు.

దీంతో.. అతడి బ్లాక్ కలర్ పల్సర్‌ బైక్‌ అక్కడే పడిపోయింది. దాన్ని ముందుగా ఒక బస్సు ఢీకొట్టిందని తెలుస్తోంది. మరో రెండు బస్సులు తప్పించుకుని వెళ్లినట్లు చెబుతున్నారు. అయితే.. వి.కావేరి బస్సు మాత్రం బైక్‌ మీదుగా వెళ్లడంతో.. అది బస్సు కింద ఇరుక్కుపోయింది. 200 మీటర్లు ఈడ్చుకెళ్లడంతో నిప్పురవ్వలు వచ్చి బస్సు మొత్తం కాలిపోయింది.

సీసీటీవీ ఫుటేజ్ తో ఒక క్లారిటీ..!:

పెట్రోల్‌ బంకులోకి బైక్‌ వచ్చేటప్పుడు దానిపై శివశంకర్‌ తో పాటు మరో యువకుడు కూడా ఉన్నట్లు సీసీటీవీ ఫుటేజీల్లో కనపడింది. ఆ సమయంలో శివశంకర్ మద్యం మత్తులో ఉన్నాడనే విషయాన్ని ఆ వీడియోలోని దృశ్యాలు చెప్పకనే చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో... ఆ రెండో యువకుడు ఎర్రిస్వామిని పోలీసులు విచారించగా.. పలు కీలక విషయాలు వెల్లడించాడు.

కీలకంగా మారిన ఎర్రిస్వామి స్టేట్ మెంట్!:

పెట్రోలు పోయించుకున్నాక శివశంకర్‌ మద్యం మత్తులోనే ఎర్రిస్వామిని ఎక్కించుకుని బయల్దేరాడు. పల్సర్‌ వాహనం హెడ్‌ లైట్‌ పనిచేయకపోవడంతో బ్లింకర్‌ వేసుకుని ముందుకెళ్లాడు. ఈ క్రమంలో డివైడర్‌ ను వేగంగా ఢీకొట్టాడని ఎర్రిస్వామి పోలీసులకు తెలిపాడు. ఆ దెబ్బకు శివశంకర్‌ రోడ్డుపై పడిపోగా తాను పక్కకు లాగి చూస్తే అతను చనిపోయినట్లు నిర్ధారణ అయ్యిందని వివరించాడు.

అనంతరం బైక్ ను పక్కకు లాగుదామని అనుకునేలోపే ఓ బస్సు దాన్ని ఢీకొట్టిందని, తర్వాత వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు వేగంగా వచ్చి బైక్ ను ఢీకొట్టి ఈడ్చుకుంటూ వెళ్లిందని, దాంతో మంటలు చెలరేగాయని వివరించాడు! తాను భయంతో అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులకు ఎర్రిస్వామి చెప్పాడు.

డ్రైవర్ వెర్షన్ ఇది..!:

రోడ్డుపై పడిన బైక్ బ్లాక్ కలర్ లో ఉండటంతో తాను సరిగా గుర్తించలేకపోయానని వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు డ్రైవర్‌ మిరియాల లక్ష్మయ్య పోలీసులకు చెబుతున్నాడు! ఆ సమయంలో వర్షం కూడా కురుస్తుండటంతో హఠాత్తుగా బ్రేక్‌ వేస్తే ప్రమాదం జరుగుతుందన్న ఉద్దేశంతో బైక్ పై నుంచి బస్సును పోనిచ్చినట్లు వెల్లడించాడు. అయితే... ప్రమాదానికి ముందు 3 బస్సులు ఆ బైక్ ను గుర్తించి, పక్కనుంచి వెళ్లినట్లు తెలుస్తోంది! అదే నిజమైతే.. లక్ష్మయ్య నిర్లక్ష్యం చర్చనీయాంశం అయినట్లే!

కాగా... ఈ ఏడాది మే 16న కాకినాడ జిల్లా కృష్ణవరం వద్ద.. అగ్నిమాపక పరికరాలు లేవని, హై వోల్ట్స్‌ ఉండే హెడ్‌ లైట్స్‌ వాడుతున్నారని రవాణాశాఖ అధికారుల తనిఖీల్లో తెలియడంతో జరిమానా విధించారు. మళ్లీ జూన్‌ 11న శ్రీకాకుళం జిల్లా కుశలపురంలో తనిఖీ చేయగా.. అప్పటికీ అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేయలేదని గుర్తించి మళ్లీ జరిమానా వేశారు!

Tags:    

Similar News