పెద్ద మాటే.. డ్రగ్స్ పరీక్షకు కోర్టు స్టే ఎందుకు కేటీఆర్?
కేటీఆర్ ద్వంద వైఖరిని తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ దులిపేశారు. తాను చర్చకు రమ్మని సవాలు విసిరి..;
అందుకే అంటారు.. వేలెత్తి చూపించే వేళ.. నాలుగు వేళ్లు మనవైపు చూపిస్తుంటాయని. అలాంటి విషయంలో చేసే తప్పులు.. కొత్త చిక్కులు తెచ్చి పెట్టేలా మారుస్తూ ఉంటాయి. ఎన్నికల్లో ఓటమి తర్వాత నుంచి అదే పనిగాసోషల్ మీడియాలో డైలీ బేసిస్ లో ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ప్రశ్నించటం.. అందులోని లోపాల్ని ఎత్తి చూపటం.. విమర్శలు చేయటం లాంటివి చేయటం ద్వారా కేటీఆర్ హైలెట్ అవుతున్నారు. అయితే..ఆయన్ను ట్విట్టర్ టిల్లుగా పేర్కొంటూ ముఖ్యమంత్రి రేవంత్ చేసే ఎటకారం అంతా ఇంతా కాదు.
ప్రజల మధ్య.. ప్రజల కోసం కాకుండా కేవలం తన ప్రచారం కోసమే అన్నట్లుగా కేటీఆర్ తీరు ఉందంటూ కౌంటర్లు పడుతున్నాయి. నిజానికి ఇలాంటి పరిస్థితికి కేటీఆరే కారణంగా చెప్పాలి. నిత్యం వివిధ దినపత్రికల్లో వచ్చే ప్రభుత్వ విధానాల్ని.. పని తీరును తప్పు పడుతూ వచ్చే నెగిటివ్ స్టోరీల్ని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేయటం.. దానిపై తనదైన వ్యాఖ్యానాన్ని జత చేస్తూ పోస్టు చేయటం తెలిసిందే.
మీడియాలో వచ్చిన వ్యతిరేక కథనాలకు ఇంతలా ప్రాధాన్యత ఇస్తున్న కేటీఆర్.. తాము అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో మీడియా కథనాలకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేదు? ప్రయారిటీ తర్వాత.. విమర్శలు చేస్తూ కథనాలు పబ్లిష్ చేసిన సంస్థలపై ఒంటికాలిపై విరుచుకుపడుతుండటం తెలిసిందే. ఇలాంటి ద్వంద వైఖరికి సమాధానం చెప్పలేక ఉక్కిరిబిక్కిరి అయ్యే పరిస్థితి.
కేటీఆర్ ద్వంద వైఖరిని తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ దులిపేశారు. తాను చర్చకు రమ్మని సవాలు విసిరి.. హైదరాబాద్ లోని సోమాజీ గూడ ప్రెస్ క్లబ్ కు రావాలని సవాలు విసిరితే రాకుండా పోయారంటూ వేలెత్తి చూపుతూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్న కేటీఆర్ కు ఒక కొత్త కౌంటర్ ను సంధించారు తెలంగాణ సీఎం.
తానెప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదని.. పరీక్షలకు సిద్దమని అప్పట్లో కేటీఆర్ సవాలు విసిరారని.. ఆ తర్వాత పిరికిపందలా కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ.. ‘‘నేను స్వయంగా అమరవీరుల స్తూపం దగ్గరకు వెళితే.. రాకుండా పారిపోయాడు. పరీక్షలకోసం రక్తం.. జుట్టు ఇస్తానని సవాలు విసిరి.. మాట మార్చి కోర్టుకు వెళ్లి ఆర్డర్ తెచ్చుకున్నాడు’’ అని పేర్కొనటం ద్వారా కేటీఆర్ కు భారీ కౌంటర్ ఎదురైనట్లు చెప్పాలి. ఇంతకూ డ్రగ్స్ కేసులో జుట్టు.. రక్తాన్ని శాంపిల్ గా ఇస్తే సరిపోయేది కదా? ఒక్క దెబ్బతో లెక్కలు సెట్ కావటమేకాదు..డ్రగ్స్ వినియోగంపై కేటీఆర్ తరచూ ఎదుర్కొంటున్న ఆరోపణలకు సైతం సమాధానం చెప్పినట్లు అయ్యేది.
కానీ.. అదేమీ చేయకుండా కోర్టు నుంచి స్టే తెచ్చుకోవటం.. ముఖ్యమంత్రికి తరచూ సవాలు విసురుతూ.. తాను సవాలు విసిరితే పారిపోయారంటూ ఎద్దేవా చేయటం చూస్తే.. కదిలించి తలనొప్పులు తెచ్చి పెట్టుకున్నట్లుగాచెప్పాలి. ఈ సందర్భంగా కేటీఆర్ అండ్ కోపై ముఖ్యమంత్రి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేటీఆర్ సన్నిహితుడు.. వ్యాపార భాగస్వామి కేదార్ రకరకాల డ్రగ్స్ ఒకేసారి తీసుకొని దుబాయ్ లో ఆత్మహత్య చేసుకున్నాడని.. దానికి సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్టును తెప్పించినట్లు చెప్పారు.
అసెంబ్లీ సాక్షిగా దాన్ని బయటపెడతామన్న సీఎం రేవంత్.. ‘‘కేటీఆర్ బావమరిది ఫాంహౌస్ లో గంజాయి.. డ్రగ్స్ తో దొరికాడు. కేటీఆర్ చుట్టూ ఉన్నోళ్లంతా గంజాయి బ్యాచేనా? అసలు కేటీఆర్ నాయకత్వాన్ని ఇంట్లోని వారే ఒప్పుకోవటం లేదు. ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని తండ్రి దగ్గరకు వెళ్లి అడగలేని కేటీఆర్..సవాళ్లు విసరటమా? కేటీఆర్ పనితనం తెలుసు కాబట్టే.. కేసీఆర్ ఆయనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వట్లేదు. పనికిమాలిన ఉచిత సలహాలు ఇవ్వటం మానేసి.. సవాళ్లు విసరటం వదిలేసిముందు ఇంటి సమస్యను పరిష్కరించుకోండి.
సాధ్యం కాకుంటే కనీసం ఇంటికే పరిమితం కావాలి. అప్పుడు కనీసం మర్యాద అయినా దక్కుతుంది’’ అంటూ ఒక రేంజ్ లో విరుచుకుపడ్డారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఢిల్లీలోని తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఇష్టాగోష్టిగా మాట్లాడిన సీఎం రేవంత్ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.