'ఫార్ములా' కేసు రాజకీయ దురుద్దేశం: కేటీఆర్
రాజకీయ దురుద్దేశంతోనే తనపై `ఫార్ములా ఈ-రేస్` కేసును బనాయించారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్ కోర్టుకు విన్నపించారు.
రాజకీయ దురుద్దేశంతోనే తనపై `ఫార్ములా ఈ-రేస్` కేసును బనాయించారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్ కోర్టుకు విన్నపించారు. తాజాగా ఆయన నాంపల్లిలోని కోర్టుకు వచ్చారు. ఈ సందర్భంగా గంటకుపైగా కోర్టులోనే ఉన్నారు. విచారణ సమయంలో ఆయనే స్వయంగా న్యాయాధికారికి వివరణ ఇచ్చారు. అంతా నిబంధనల మేరకే జరిగిందని.. అన్ని రికార్డులు బాగానే ఉన్నాయని.. అప్పట్లోనే దీనిపై ఆడిట్ కూడా నిర్వహించామని పేర్కొన్నారు. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే ఈ కేసు మోపారని తెలిపారు.
కాగా.. ఈ కేసులో మరిన్ని ఆధారాలను సమర్పించేందుకు సమయం ఇవ్వాలని కోరడంతో న్యాయాధికారి వచ్చే నెల 25కు ఈ కేసు విచారణను వాయిదా వేశారు. అయితే.. ఏసీబీ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాదులు.. అప్పట్లో మంత్రిగా ఉన్న కేటీఆర్ ఆదేశాలతోనే నిధులు దుర్వినియోగం అయ్యాయని తెలిపారు. 55 కోట్ల రూపాయలను విదేశీ సంస్థలకు అప్పనంగా అప్పగించారని.. మరో 8 కోట్ల రూపాయల వరకు రాష్ట్ర సర్కారుకు పన్నుల రూపంలో రావాలన్ని సొమ్ములకు కూడా నష్టం వాటిల్లిందన్నారు.
ఇరుపక్షాల వాదనలను రికార్డు చేసుకున్న న్యాయాధికారి.. విచారణను వచ్చే నెల 25కు వాయిదా వేశారు. తదిపరి విచారణకు తనను మినహాయించాలని.. రాజకీయ పరమైన కార్యక్రమాలు ఉన్నాయని కేటీఆర్ తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు. కాగా, కేటీఆర్ వెంట.. మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి సహా పలువురు నాయకులు భారీ సంఖ్యలో కోర్టుకు తరలి వచ్చారు. దీంతో నాంపల్లిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
ఏంటి కేసు?
బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్‌లో తొలిసారి ఫార్ములా ఈ-రేస్ నిర్వహించారు. దీనిని హైదరాబాద్ మెట్రో పాలిటన్ సిటీ నిర్వాహకులు నిర్వహించారు. అయితే.. దీనిని మూడు సార్లు నిర్వహించగా.. కేవ లం ఒకసారి మాత్రమే నిర్వహించారని ఈ మేరకు రికార్డులు ట్యాంపరింగ్ చేశారని ఏసీబీ అభియోగాలు నమోదు చేసింది. అంతేకాదు.. 55 కోట్ల రూపాయలను కేటీఆర్ ఆదేశాలతో విడుదల చేశారని.. ఈ నిధులు విదేశీ ఖాతాలకు.. అటు నుంచి వేరే వారి ఖాతాలకు జమయ్యాయని ఆరోపించింది. అలాగే.. ప్రభుత్వానికి పన్నుల రూపంలో రావాల్సిన నిధులను కూడా రాకుండా చేశారని పేర్కొంది. ఈ కేసు గత ఏడాదిన్నర నుంచి విచారణలో ఉండడం గమనార్హం.