షాకింగ్ వీడియో... సెల్ఫీ అని నమ్మించి భర్తను కృష్ణా నదిలోకి తోసేసింది!

అదృష్టవశాత్తూ ఆ వ్యక్తి ప్రవహించే నదిలో ఒక బండరాయిని పట్టుకుని అరవడంతో.. స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని తాడు ఉపయోగించి అతన్ని రక్షించారు.;

Update: 2025-07-12 09:46 GMT

ఇటీవల భార్యల చేతుల్లో మట్టుపెట్టబడుతున్న భర్తల జాబితా రోజు రోజుకీ పెరిగిపోతున్నట్లు కనిపిస్తోన్న సంగతి తెలిసిందే! ప్రియుడు కలిసి హత్యచేసి, భర్త మృతదేహాన్ని ముక్కలుగా నరికి, ఆ అవశేషాలను ఒక ప్లాస్టిక్‌ డ్రమ్‌ లో ఉంచి, పైనుంచి సిమెంట్‌ తో కప్పిపెట్టిన ఘటనకు ముందు, ఆ తర్వాత ఈ తరహా భయానక ఘటనలు ఎన్నో వెలుగు చూస్తున్నాయి.

ఇక ఇటీవల తన ప్రియుడితో కలిసి భర్తను గొంతు పిసికి చంపి.. తన భర్త పాము కాటుకు గురై మరణించాడని లోకాన్ని నమ్మించేందుకు వెయ్యి రూపాయలు పెట్టి ఓ పామును కొనుగోలు చేసి, దాంతో కాటు వేయించిన మహిళ ఉదంతం మరొకటి! ఈ క్రమంలో తనను సెల్ఫీ పేరుతో నమ్మించి తన భార్యే తనను నదిలోకి తోసేసిందని ఆరోపిస్తున్నాడు ఓ భర్త. ఈ విషయం తాజాగా తెరపైకి వచ్చింది.

అవును... కర్ణాటకలో యాద్గిర్‌ లోని గుర్జాపూర్ వంతెన సమీపంలో సెల్ఫీ సెషన్‌ లో భాగంగా ఓ మహిళ తన భర్తను కృష్ణా నదిలోకి తోసేసిందనే విషయం తాజాగా తెరపైకి వచ్చింది! దంపతులు తమ బైక్‌ ను వంతెనపై ఆపిన తర్వాత.. భార్య తన భర్తను నదిలోకి తోసి, అతను ప్రమాదవశాత్తు జారిపడ్డాడని చెప్పి తప్పుదారి పట్టించడానికి ప్రయత్నించిందని అంటున్నారు!

అదృష్టవశాత్తూ ఆ వ్యక్తి ప్రవహించే నదిలో ఒక బండరాయిని పట్టుకుని అరవడంతో.. స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని తాడు ఉపయోగించి అతన్ని రక్షించారు. ఇలా స్థానికుల సహాయంతో రక్షించబడిన తర్వాత ఆ వ్యక్తి.. ఆ షాకింగ్ ఘటన నుంచి తేరుకొని.. తన భార్యే తనను ఉద్దేశపూర్వకంగా నదిలోకి తోసివేసిందని ఆరోపించాడు.

మరోవైపు అతడు నదిలో పడిపోయిన సమయంలో ఆ మహిళ కూడా వంతెనపై నిలబడి సహాయం కోరుతూ కనిపించిందని తెలుస్తోంది. ఈ క్రమంలో భర్త చేసిన ఆరోపణలను ఆమె ఖండించింది. భర్తే ప్రమాదవశాత్తు నదిలో పడిపోయాడని చెబుతోంది.

Tags:    

Similar News