బిగ్ బ్రేకింగ్.. రౌడీ షీటర్ మిస్సింగ్ మిస్టరీ - సీఐ నాగరాజు అరెస్టు!

రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన రౌడీషీటర్ గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసులో విజయవాడలోని కృష్ణలంక మాజీ సీఐ నాగరాజును పోలీసులు అరెస్టు చేశారు.

Update: 2026-06-23 09:20 GMT

రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన రౌడీషీటర్ గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసులో విజయవాడలోని కృష్ణలంక మాజీ సీఐ నాగరాజును పోలీసులు అరెస్టు చేశారు. గత నెలలో విచారణ పేరుతో రౌడీషీటర్ సాయికృష్ణను తీసుకువచ్చిన కృష్ణలంక పోలీసులు అతడిని మాయం చేశారని, లాకప్ లో కొట్టి చంపేశారని సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని అయినా తమకు అప్పగించాలని ఆమె వేడుకున్నారు. లాకప్ లో చనిపోయిన తన కుమారుడి మృతదేహాన్ని పోలీసులు రహస్యంగా దహనం చేశారని విజయలక్ష్మి తన ఫిర్యాదులో ఆరోపించారు. ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీయడం, విపక్షం వైసీపీ రంగంలోకి దిగడంతో ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు బాధితులను స్వయంగా పిలిపించుకుని మాట్లాడటంతోపాటు ఈ మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించారు.

రౌడీషీటర్ సాయికృష్ణ మిస్సింగ్ కేసులో దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు మంగళవారం కృష్ణలంక పోలీసుస్టేషన్ లో తనఖీలు చేశారు. ఐజీ రవిప్రకాష్ ఆధ్వర్యంలోని ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు. తొలుత పోలీసుస్టేషన్ లో సీసీ కెమెరా పుటేజీని స్వాధీనం చేసుకోవాలని సిట్ అధికారులు భావించారు. అయితే కృష్ణలంక పోలీసుస్టేషన్ లో మే 1వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు సీసీ కెమెరా పుటేజీ లేదని సిబ్బంది తెలియజేయడంతో సిట్ అధికారులు షాక్ తినాల్సివచ్చిందని చెబుతున్నారు. దీంతో ఆ తేదీల మధ్య ఏదో జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మే నెల 23వ తేదీన సాయికృష్ణను మార్కాపురం నుంచి టాస్క్ ఫోర్సు పోలీసులు తీసుకువచ్చారని, అతడిని పోలీసుస్టేషన్ లో నిర్బంధించారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

పోలీసు వేధింపులు భరించలేక మే 24 లేదా 25 తేదీల్లో సాయికృష్ణ చనిపోతే, అతడి మృతదేహాన్ని రహస్యంగా దహనం చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇక పోలీసుస్టేషన్ లో ఆ తేదీలకు చెందిన సీసీ కెమెరా పుటేజ్ లభించకపోవడంతో కుటుంబ సభ్యుల అనుమానాలకు బలం చేకూరుతుందని అంటున్నారు. దీంతో సిట్ అధికారులు ముందుగా సీఐ నాగరాజును అరెస్టు చేయాలని నిర్ణయించి సింగ్ నగర్ లో ఉన్న ఆయన నివాసానికి చేరుకుని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలిసి నాగరాజు అభిమానులు, మద్దతుదారులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకుని ఆందోళన చేశారు. నాగరాజును పోలీసుస్టేషన్ కు తరలించకుండా అడ్డుపడ్డారు.

అయితే పోలీసు బందోబస్తు మధ్య ఆందోళనకారులను తప్పించి సీఐ నాగరాజును పోలీసు గెస్ట్ హౌసుకు తరలించారు. సీసీ కెమెరా పుటేజీ లేకపోవడంతో సీఐ నాగరాజు వాంగ్మూలమే మిస్టరీ ఛేదించేందుకు కీలకంగా చెబుతున్నారు. దీంతో ఆయన నోరువిప్పి ఏం చెబుతారన్నదే ఆసక్తి రేకెత్తిస్తోంది. రౌడీషీటర్ సాయికృష్ణ అదృశ్యం అయిన నుంచి సీఐ నాగరాజుపై తీవ్ర ఆరోపణలు వస్తున్నా, ఆయన ఇంతవరకు బహిరంగంగా మాట్లాడలేదు. సాయికృష్ణను అదుపులోకి తీసుకున్న విషయం కానీ, మార్కాపురం నుంచి తెచ్చిన విషయం కానీ ఆయన చెప్పలేదు. దీంతో సాయికృష్ణ సజీవంగా ఉన్నాడా? లేడా? అన్న చర్చ ఎక్కువగానే సాగుతోంది. ప్రస్తుతం కుటుంబ సభ్యులు చెబుతున్న వాదనకే ఎక్కువ ప్రచారం లభిస్తోంది. దీంతో సాయికృష్ణ కస్టడీలో మరణించారన్న అనుమానాలతో పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారని అంటున్నారు.

ఈ పరిస్థితుల్లో సీఐ నాగరాజు అరెస్టు కావడంతో కేసు కీలక మలుపు తిరిగిందని చెబుతున్నారు. సాయికృష్ణ అదృశ్యంపై ఆయన నోరు విప్పితేనే మిస్టరీ వీడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో పోలీసుల అదుపులో ఉన్న సీఐ నాగరాజు ఏం చెబుతారు? అన్న ఉత్కంఠ ఎక్కువవుతోంది. మరోవైపు సీఐ నాగరాజును సమర్థిస్తూ కృష్ణలంకలో స్థానికులు ఆందోళనలు చేస్తున్నారు. రెండు రోజులుగా ఆయనకు మద్దతుగా ర్యాలీలు, కొవ్వొత్తుల ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో సోషల్ మీడియాలో సీఐ నాగరాజును సపోర్టు చేస్తూ స్టేటస్ లు పెడుతున్నారు. స్టాండ్ విత్ నాగరాజు సర్ అన్న హ్యాష్ ట్యాగ్ తో యువత ఉద్యమిస్తుండటం చర్చనీయాంశం అవుతోంది. ఈ పరిణామాల్లో సీఐ నాగరాజు అరెస్టు తర్వాత ఏం జరగనుందనేది ఉత్కంఠ రేకెత్తిస్తోందని అంటున్నారు.

Tags:    

Similar News