నెల్లూరు పెద్దారెడ్డికి మినిస్టర్ యోగం ఉందా ?
తేడా వస్తే దేవుడిగా భావించే అధినేతను సైతం ధిక్కరించి బయటకు వస్తారు. ఆయనే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.;
ఆయనకు మంత్రి కావాలని కోరిక ఉంది. పనిమంతుడుగా పేరుంది. జనంతో నిత్యం కలసి ఉంటారు. పార్టీ ఏదైనా అధినాయకత్వం మాటే వేదవాక్కుగా భావిస్తారు. తేడా వస్తే దేవుడిగా భావించే అధినేతను సైతం ధిక్కరించి బయటకు వస్తారు. ఆయనే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
ఆయన వైఎస్సార్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితులు. ఆయన 2014 నుంచి వరుసగా నెల్లూరు రూరల్ లో గెలుస్తూ వస్తున్నారు. రెండు సార్లు వైసీపీ నుంచి గెలిచారు. ఇక 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. కోటంరెడ్డికి మంత్రి పదవి వస్తుందని అనుకుంటే విస్తరణలో కూడా చాన్స్ దక్కలేదు.
దాంతో ఆనాటి నుంచి ఆయన అసంతృప్తి చెందారని దానికి తోడు పార్టీలో పరిస్థితులు తనకు వ్యతిరేకంగా మారడంతో ఆయన ఆ పార్టీకి గుడ్ బై కొట్టేశారు అన్నది అందరికీ తెలిసిందే. ఇక తెలుగుదేశం పార్టీలో ఆయనకు బాగానే మర్యాద దక్కింది.
చంద్రబాబు కానీ లోకేష్ కానీ ఆయనకు ఇవ్వాల్సిన గౌరవం ఇస్తున్నారు. దానికి మించి ఆయన కూడా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నారు. దాంతో బాబు మెచ్చిన ఎమ్మెల్యేలతో ఆయన కూడా ఒకరుగా నిలిచారు. బాబు మార్కులు కూడా ఆయనకే వేశారు అని అంటున్నారు.
దీంతో ఆయన విషయంలో ఒక ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. చిరకాలం కోరిక అయిన మంత్రి పదవి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి దక్కుతుందా అన్నదే అంతా ఆలోచిస్తున్నారు. పార్టీ కోసం కష్టపడుతూ నెల్లూరు రూరల్ ని కంచుకోటగా మార్చిన ఆయనకు బాబు కేబినెట్ లో చోటు దక్కుతుందా అన్నదే అందరిలోనూ మెదులుతున్న విషయం.
ఇక టీడీపీ విస్తృత షాయి సమావేశం జరిగితే ఆయన ఠంచనుగా హాజరై మొత్తం సమావేశం అయ్యేంతవరకూ ఉన్నారు. అలా అధినాయకత్వం నుంచి మంచి గుర్తింపే దక్కించుకున్నారు. ఆయన పట్ల బాబుకు మంచి అభిప్రాయం ఉంది కానీ మంత్రి పదవి అయితే ఈ టెర్మ్ లో కష్టమనే అంటున్నారు.
అదెలా అంటే నెల్లూరు అర్బన్ నుంచి మంత్రిగా నారాయణ ఉన్నారు. ఆయనకు కీలకమైన మున్సిపల్ శాఖను అప్పగించారు. అంతే కాదు అమరావతి బాధ్యతలను కూడా ఆయనకే ఇచ్చారు. దాంతో నారాయణ అయిదేళ్ళ మంత్రి అని అంటున్నారు.
అలా నెల్లూరు అర్బన్ నుంచి నారాయణ ఉంటే రూరల్ నుంచి శ్రీధర్ రెడ్డికి మంత్రి పదవి ఎలా దక్కుతుంది అన్నది చర్చగా ఉంది. దాంతో ఈ అయిదేళ్ళ కాలంలోనూ ఆయన కోరిక తీరేది కాదని అంటున్నారు మరి ఎపుడు అంటే 2029లో మరోసారి కూటమి ప్రభుత్వం వస్తే మాత్రం కచ్చితంగా ఆయనకే చాన్స్ అని అంటున్నారు. ఈలోగా ఏదైనా అద్భుతం జరిగితే మాత్రం మినిస్టర్ అవుతారేమో అన్న ఆశ కూడా ఆయన అభిమానులలో ఉందట.