ఎంపీ టాక్: పార్లమెంటుకు చేరిన.. 'కోనసీమ కొబ్బరి'.. !
అమలాపురం ఎంపీగా తొలిసారి విజయం దక్కించుకున్న యువ నాయకుడు, గంటి హరీష్.. తాజా సమా వేశాల్లో ఈ విషయాన్ని ప్రస్తావించారు.;
పార్లమెంటులో తొలిసారి కోనసీమ కొబ్బరి రైతుల కష్టాలు.. కన్నీళ్లు ప్రతిబింబించాయి. దాదాపు 30 ఏళ్ల తర్వాత.. తొలిసారి పార్లమెంటులో కోనసీమ రైతులపై ప్రస్తావన వచ్చింది. వారికి ట్రాన్స్ పోర్టు ఏర్పాటు చేయడంతోపాటు కొబ్బరికి కూడా గిట్టుబాటు ధర కల్పించేలా చూడాలన్న వాదన వినిపించింది. అంతే కాదు.. కోనసీమలోనూ కాయిర్ ఇండస్ట్రీ డెవలప్ చేయాలన్న డిమాండ్ స్పష్టంగా వినిపించింది. దీంతో కొబ్బరి రైతులకు మేలు జరిగేలా చర్చ జరగడం గమనార్హం.
ఇలా.. కోనసీమ రైతుల గురించి.. తన తండ్రి తర్వాత... తొలి సారి పార్లమెంటులో ప్రస్తావించిన ఘనత.. అమలాపురం ఎంపీ గంటి హరీష్ కు దక్కుతుంది. గతంలో ఆయన తండ్రి.. బాలయోగి స్పీకర్‌గా ఉన్నప్పుడు.. తొలిసారి.. కొబ్బరి రైతుల కష్టాలు పార్లమెంటుకు చేరాయి. ఆ సమయంలోనే కాయిర్ బోర్డు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఏర్పడింది. అయితే.. ఆ కల సాకారం కాకుండానే ఆయన మృతి చెందారు. ఇక, తర్వాత ఎంపీలు అయిన వారు ఎవరూ పెద్దగా దీనిని పట్టించుకోలేదు.
అమలాపురం ఎంపీగా తొలిసారి విజయం దక్కించుకున్న యువ నాయకుడు, గంటి హరీష్.. తాజా సమా వేశాల్లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ముఖ్యంగా ఉప్పాడ తీరంలో సముద్ర నీరు కారణంగా దెబ్బతిం టున్న కొబ్బరిని కాపాడాలని.. దీనికి సంబంధించి.. గోడను ఏర్పాటు చేయాలని కోరారు. అదేవిధంగా కాయర్ బోర్డును ఏర్పాటు చేయడం ద్వారా.. అనుబంధం పరిశ్రమలను తీసుకువచ్చేందుకు అవకాశం ఉంటుందని కూడా చెప్పారు.
ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లోకేవలం కేరళలోనే కాయర్ బోర్డు(కొబ్బరి అనుబంధ ఉత్పత్తుల మార్కెటింగ్, ప్రాసెసింగ్ యూనిట్లకు ఇచ్చే ప్రోత్సాహం. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు వంటివి) ఉంది. ఈ నేపథ్యంలో కోనసీమ కూడా కేరళకు సమాంతరంగా కొబ్బరి ఉత్పత్తిలో దూసుకుపోతున్నా.. ఇక్కడ సరైన మార్కెటింగ్ లేకుండా పోయింది. దీనికి గాను బోర్డును ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కొన్ని దశాబ్దాలుగా నలుగుతోంది. తాజాగా గంటి హరీష్ ఈ విషయాన్ని పార్లమెంటులో లేవనెత్తడం ద్వారా సక్సెస్ అయ్యారనే చెప్పాలి.