కోమటిరెడ్డిలో ఈ కోణం కూడా ఉందా?

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్‌ లపై తీవ్ర విమర్శలు చేసేవారిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒకరు.

Update: 2024-04-18 11:38 GMT

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్‌ లపై తీవ్ర విమర్శలు చేసేవారిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒకరు. కాంగ్రెస్‌ పార్టీ తరఫున ప్రత్యర్థులపై పదునైన విమర్శలతో ఆయన విరుచుకుపడుతుంటారు. అయితే ఆయన గురించి తెలిసినవారు మాత్రం కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట కరుకే కానీ మనసు మాత్రం వెన్న అని చెబుతుంటారు.

కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా విజయం సాధించారు. 1994, 2004, 2009, 2014ల్లో వరుసగా నల్లగొండ నుంచి ఆయన ఎమ్మెల్యేగా కాంగ్రెస్‌ పార్టీ తరఫున గెలుపొందారు. 2009లో వైఎస్సార్‌ మంత్రివర్గంలో ఐటీ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. 2018 ఎన్నికల్లో మాత్రం తొలిసారి కోమటిరెడ్డి ఓడిపోయారు. అయితే ఆ వెంటనే 2019 ఎన్నికల్లో లోక్‌ సభకు పోటీ చేసి భువనగిరి ఎంపీగా గెలుపొందారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మరోమారు నల్గొండ నుంచి ఘనవిజయం సాధించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

కాగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన కుమారుడి పేరుతో కోట్లాది రూపాయలు వెచ్చించి చేస్తున్న పనులు ఆయనకు ఎంతో మంచి పేరును తెచ్చిపెడుతున్నాయి. కోమటిరెడ్డికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. అయితే 20 డిసెంబర్‌ 2011న హైదరాబాదులో జరిగిన ఒక కారు ప్రమాదంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమారుడు ప్రతీక్‌ రెడ్డి మృత్యువాత పడ్డాడు. అప్పటికి ప్రతీక్‌ రెడ్డి వయసు కేవలం 18 ఏళ్లే.

కుమారుడు అకాల మృత్యువు బారిన పడటంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలా కాలం కోలుకోలేకపోయారు. ఆ తర్వాత తన కుమారుడి పేరుతో ప్రతీక్‌ రెడ్డి ఫౌండేషన్‌ ని స్థాపించారు. ఈ ఫౌండేషన్‌ ద్వారా రూ. 3.5 కోట్ల వ్యయంతో నల్గొండలో ప్రతీక్‌ మెమోరియల్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను, ఒకేషనల్‌ జూనియర్‌ కళాశాలను ఏర్పాటు చేశారు.

Read more!

అంతేకాకుండా ప్రతీక్‌ ఫౌండేషన్‌ కింద ఉచిత అంబులెన్సు సేవలను కూడా అందిస్తున్నారు. తన కుమారుడు రహదారి ప్రమాదంలో చనిపోవడంలో రోడ్డు భద్రత గురించిన అవగాహన కార్యక్రమాలను కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రతీక్‌ ఫౌండేషన్‌ కింద చేపడుతున్నారు.

అదేవిధంగా ఏటా కోమటిరెడ్డి ప్రతీక్‌ ఫౌండేషన్‌ జాబ్‌ మేళా నిర్వహిస్తూ తెలంగాణలోని అనేక మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తోంది.

ఇప్పుడు తాజాగా ఈ సేవలకు అదనంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రతీక్‌ ఫౌండేషన్‌ కింద మరో మంచి పని చేపట్టారు. ఇప్పుడు వేసవి కావడంతో నల్గొండ ప్రసూతి ప్రభుత్వాస్పత్రిలో, ఐసీయూ విభాగంలో ఆయన ఏసీలు ఏర్పాటు చేశారు.

ఆస్పత్రికి వచ్చే నిరుపేదలు, గర్భిణులు, బాలింతలు వేసవి తాపాన్ని తట్టుకోవడానికి వీలుగా ఏకంగా 32 ఏసీలను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అందజేశారు. ఏసీలు కావాలని ఎవరూ అడగకపోయినా ఆయనే స్వయంగా ఏసీలు అందజేయడం విశేషం.

ఈ సేవలు మాత్రమే కాకుండా పేద విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసించడానికి కూడా కోమటిరెడ్డి చేయూతనందిస్తున్నారు. దీంతో ఆయన సేవల పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కుమారుడు మరణించినా తాను చేపట్టే మంచి పనుల ద్వారా అతడి పేరును ప్రజల్లో సజీవంగా ఉండేలా చేస్తున్నారు.

Tags:    

Similar News