పవన్ కు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వార్నింగు.. ఈ దుమారం ఎప్పుడు ఆగుతుందో?
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై తెలంగాణ నేతలు మండిపడుతున్నారు. గత బుధవారం రాజోలు పర్యటన సందర్భంగా కోనసీమకు తెలంగాణ నేతల దిష్టి తగిలిందని పవన్ అగ్గిరాజేశారు.;
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై తెలంగాణ నేతలు మండిపడుతున్నారు. గత బుధవారం రాజోలు పర్యటన సందర్భంగా కోనసీమకు తెలంగాణ నేతల దిష్టి తగిలిందని పవన్ అగ్గిరాజేశారు. దీంతో తెలంగాణ నేతలు వంతులు వారీగా పవన్ పై ఫైర్ అవుతున్నారు. తాజాగా మంత్రి కోమటిరెడ్డి ఏపీ డీసీఎంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రిగా పనిచేస్తున్న కోమటిరెడ్డి.. పవన్ కల్యాణ్ తెలంగాణ ప్రజలకు భేషరుతగా క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ ేశారు. తాము తలచుకుంటే పవన్ సినిమాలు ఒకటి రెండు రోజులు కూడా తెలంగాణలో ఆడవంటూ సూటిగా వార్నింగు ఇచ్చారు.
రాజోలు పర్యటన సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ చేసిన సరదా వ్యాఖ్యలు తెలంగాణలో రాజకీయ వేడిని రాజేశాయి. ఈ విషయంలో ముందు కల్పించుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి.. పవన్ మాటల ద్వారా తెలంగాణ భావోద్వేగాన్ని తట్టిలేపాలని ప్రయత్నించారు. ఇక ఈ విషయంలో తాము వెనకబడిపోకూడదన్నట్లు కాంగ్రెస్ నేతలు సైతం విమర్శలకు దిగుతున్నారు. రెండు రోజుల క్రితం జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పై మాటల తూటాలు పేల్చారు. పవన్ పై హాట్ కామెంట్స్ చేసిన అనిరుధ్ రెడ్డి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ నేపథ్యంలోనే తన వంతు వచ్చిందన్నట్లు మంగళవారం మంత్రి కోమటిరెడ్డి విరుచుకుపడ్డారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కు ఏ మాత్రం రాజకీయాలు తెలియవని దుయ్యబట్టారు. పవన్ తెలిసి తెలియకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టిన కోమటిరెడ్డి.. మెగాస్టార్ చిరంజీవిపై పొగడ్తలు కురిపించారు. మెగాస్టార్ సూపర్ మ్యాన్ అంటూ కొనియాడిన మంత్రి, చిరంజీవికి రాజకీయాలు తెలియవని వెనకేసుకువచ్చారు. ఇదే సమయంలో పవన్ క్షమాపణ చెబితేనే తెలంగాణలో ఆయన సినిమాలు ఒకటి, రెండు రోజులైనా ఆడిస్తామని లేదంటే ఆయన సినిమాల ప్రదర్శనకు అనుమతి ఇచ్చే ప్రసక్తి లేదంటూ కోటమిరెడ్డి తేల్చిచెప్పారు.
గత నెల 26న పవన్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించారు. ఆ సమయంలో కొబ్బరి రైతులతో ముఖాముఖి సమావేశంలో కోనసీమ అందాలను పొగిడే క్రమంలో నవ్వుతూ తెలంగాణ నేతలు దిష్టిపెట్టారా? అని నాకు అనిపిస్తుందని అన్నారు. మాటల క్రమంలో పవన్ చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. పవన్ వ్యాఖ్యలతో తెలంగాణ భావోద్వేగాన్ని తట్టిలేపాలని బీఆర్ఎస్ ప్రయత్నించగా, కాంగ్రెస్ కూడా ఆ రేసులోకి దూసుకొచ్చింది. రెండుపార్టీల నేతలు పవన్ పై పోటాపోటీగా విమర్శలు చేస్తూ తెలంగాణ స్వరం తామే అని నిరూపించుకోవాలని ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. మొత్తానికి పవన్ చేసిన వ్యాఖ్యలు, ఆయనపై తెలంగాణ నేతల ఆగ్రహావేశాలు మరికొన్ని రోజులు కొనసాగే పరిస్థితులు కనిపిస్తున్నాయని అంచనా వేస్తున్నారు.