సీనియర్ నాయకుడి వ్యాఖ్యలపై ఆగ్రహంలో కాంగ్రెస్ పార్టీ.. ఇంతకూ ఏమన్నారంటే..?
పదవుల కాంక్ష ఎంతగా దిగజారేలా చేస్తుందనేందుకు ఈ నేతే నిదర్శనం. తనకు పదవి కావాలని ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేయడం కాంగ్రెస్ పార్టీని కలవరపెట్టింది.;
పదవుల కాంక్ష ఎంతగా దిగజారేలా చేస్తుందనేందుకు ఈ నేతే నిదర్శనం. తనకు పదవి కావాలని ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేయడం కాంగ్రెస్ పార్టీని కలవరపెట్టింది. గతంలో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన సదరు నేత నేడు అదే కేబినెట్ లో తనకు మంత్రి పదవి కావాలని పార్టీని, సీఎంను ఎడా పెడా ధూషించడం పార్టీ వర్గాల్లో కలవరం రేపుతోంది. తనకు మంత్రి పదవి ఇస్తానని పార్టీ చెప్పిందని సాక్ష్యాత్తు డిప్యూటీ స్పీకరే తనకు చెప్పారని కానీ ఆయన మాట్లాడిన క్లిప్ తో సోషల్ మీడియాను రాజకీయంగా హీటెక్కించారు. తన కుటుంబ సభ్యులకు మంత్రి పదవి ఇస్తే తనకు ఇవ్వారా? అంటూ ప్రశ్నలు సైతం లేవనెత్తారు. ఇక ఇప్పుడు మరో వివాదంతో ముందుకు వచ్చాడు.
కాంగ్రెస్ పార్టీ కోసం తన ఆస్తులన సైతం అమ్ముకున్నారంట.. ఈ కామెంట్లు చేసింది ఎవరో కాదు సాక్షాత్తు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఈ నాయకుడు కాంగ్రెస్ పార్టీకి కొరకరాని కొయ్యగా మారాడని కార్యకర్తలే మండిపడుతున్నారు. ‘కాంగ్రెస్ పార్టీ కోసం తను ఆస్తులు అమ్ముకున్నాను’ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలతో నేతలు సైతం తలలు పట్టుకుంటున్నారు. కొంతైనా నమ్మేలా ఉండాలంటున్నారు. ఇలా మాట్లాడితే నవ్వుల పాలవుతావని హెచ్చరిస్తున్నారు. పార్టీ కోసం ఆస్తులను అమ్ముకుంటున్నానన్న అతను మధ్యలో ఒకసారి పార్టీని వీడి బీజేపీలోకి వెళ్లి పోటీ చేసి బీఆర్ఎస్ చేతిలో భంగపడ్డాడు. సరే.. కాంగ్రెస్ కోసం ఆస్తులు అమ్ముకున్నారని కాసేపు అనుకుందాం.. అయతే బీజేపీలోకి ఎందుకు వెళ్లినట్లు..? సరే వెళ్లారు.. మరి తను ఆర్థికంగా నష్టపోయిన పార్టీలోకి మళ్లీ తిరిగిరావడం ఎందుకు? అని అందరూ ప్రశ్నిస్తున్నారు.
కోమటి రెడ్డి కాంగ్రెస్ పార్టీ హయాంలో చాలా వరకు కాంట్రాక్టులు తీసుకున్నారు. వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి కాంట్రాక్టులను చేజిక్కించుకున్నారు. ఇటీవల మేడారం అభివృద్ధి పనులు కూడా ఆయనే దక్కించుకున్నారు. ఈ విషయంపైనే కొండా మురళితో వివాదం కూడా జరిగింది. అయితే గతంలో మునుగోడు ఉప ఎన్నిక జరిగిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీకే వ్యతిరేకంగా పని చేయలేదా.? బీజేపీ చేరిన ఆయన కాంగ్రెస్, బీఆర్ఎస్ ను నిందించే కదా.. ఆ సమయంలో ఆయన ‘కాంగ్రెస్ పార్టీని రేవంత్ కూడా ఆదుకోలేడు’ అని ప్రచారంలో భాగంగా వ్యాఖ్యలు చేశారు. అలాంటి రాజగోపల్ రెడ్డి ‘పార్టీ కోసం ఆస్తులు అమ్ముకున్నా’ అనడం వింత కాదా..?
కోమటిరెడ్డి బ్రదర్స్ కు కాంగ్రెస్ కు విడదీయలేని సంబంధం ఉందని తెలిసిందే.. అయితే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారు. అవసరం వచ్చినప్పుడు రాజగోపాల్ రెడ్డికి తెర వెనుక సహకారం అందిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కానీ రాజగోపాల్ రెడ్డి మాత్రం అవసరాన్ని బట్టి మారుతుంటారు. రేవంత్ కేబినెట్ లో వెంకట్ రెడ్డికి మంత్రి పదవి దక్కింది. ఎందుకంటే తమ్ముడు పార్టీని వీడినా.. పార్టీలోనే కొనసాగుతున్నాడని, రేవంత్ ఇదే సాకుగా చూపి ఇంటికి ఒక మంత్రి పదవి ఉంది అని రాజగోపాల్ రెడ్డికి కేబినెట్ లో చోటు కల్పించలేదు. కోమటిరెడ్డి బ్రదర్స్ కాంగ్రెస్ పార్టీతోనే ఆర్థికంగా చాలా ఎదిగారు. గతంలో రాహుల్ సభ నిర్వహించిన సమయంలో కూడా డబ్బులు పెట్టలేదు.
కాంగ్రెస్ లో ఉంటూ అనేక కాంట్రాక్టులు దక్కించుకొని, దండిగా ఆర్జించి కుబేరులు అయిన బ్రదర్స్ కు కాంగ్రెస్ భిక్ష పెట్టిందా..? లేక పార్టీ ఎదిగేందుకు వీరే డబ్బులు పెట్టారా.? ఇది పార్టీలోని సాధారణ కార్యకర్త నుంచి నాయకుల వరకు తెలిసిందే. రాజగోపాల్ రెడ్డి ఈ వ్యాఖ్యలతో పార్టీకి మరింత దూరమవుతున్నారని సొంత వర్గం నుంచే హెచ్చరికలు వినిపిస్తున్నాయి.