మళ్ళీ మొదలెడతానంటున్న కొడాలి నాని

తన వ్యక్తిగత జీవితంలో ఇబ్బందుల వల్లనే తాను ప్రత్యక్ష రాజకీయాలకు కొంత దూరంగా ఉండాల్సి వచ్చిందని వైసీపీకి చెందిన ఫైర్ బ్రాండ్ లీడర్, మాజీ మంత్రి కొడాలి నాని చెబుతున్నారు.;

Update: 2025-12-10 13:58 GMT

తన వ్యక్తిగత జీవితంలో ఇబ్బందుల వల్లనే తాను ప్రత్యక్ష రాజకీయాలకు కొంత దూరంగా ఉండాల్సి వచ్చిందని వైసీపీకి చెందిన ఫైర్ బ్రాండ్ లీడర్, మాజీ మంత్రి కొడాలి నాని చెబుతున్నారు. ఇది జస్ట్ గ్యాప్ మాత్రమే అని ఆయన అంటున్నారు. తాను తొందరలోనే పూర్తిగా రాజకీయాల్లోకి వచ్చి జనంతో మమేకం అవుతాను అని ఆయన చెప్పారు. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా ఆ సంతకాల పత్రాలు జిల్లా కార్యాలయానికి తరలించే ప్రోగ్రాం లో బుధవారం కొడాలి నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తన ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ప్లాన్ వెల్లడించారు.

హెల్స్ ఇష్యూస్ తోనే :

తనకు బైపాస్ సర్జరీ జరిగిందని అందువల్ల కొన్నాళ్ళ పాటు రెస్ట్ తీసుకున్నాను అని చెప్పారు తొందరలోనే తాను జనంలోకి వస్తాను అని చెప్పారు. అంతే కాదు ప్రజా ఉద్యమాలలో పాల్గొంటాను అని ఆయన వివరించారు. తాను ప్రజా ఉద్యమాలలో సైతం పాలు పంచుకుంటాను అని కొడాలి నాని చెప్పారు. ఇక తన శక్తివంచన లేకుండా పనిచేస్తాను అని జగన్ మళ్ళీ ఏపీకి సీఎం కావడానికి తాను చేయాల్సింది అంతా చేస్తాను అని చెప్పారు. ప్రభుత్వంలో జరిగ్తే అవకతవకల మీద తాము ఉద్యమిస్తామని ఆయన స్పష్టం చేశారు.

గేర్ మార్చినట్లేనా :

కొడాలి నాని అంటే ఫైర్ బ్రాండ్ గా ఉంటూ టీడీపీ మీద పవన్ మీద పెద్ద ఎత్తున విమర్శలు చేసేవారు. ఆయన మంత్రిగా ఉండగా ఒక రేంజిలో ప్రత్యర్థి పార్టీల మీద విరుచుకుని పడేవారు. అయితే వాటి వల్లనే చివరికి వైసీపీకి ఇబ్బంది వచ్చింది అని అంతా విశ్లేషించారు. జనాలు విమర్శలను అయితే స్వీకరిస్తారు కానీ హద్దులు దాటి వ్యక్తిగత విమర్శలు చేస్తే మాత్రం సహించలేకపోయారు అని కూడా విశ్లేషణలు ఉన్నాయి. ఇక వైసీపీ 2024 ఎన్నికల్లో దారుణ పరాజయం పొందింది. దాంతో పాటుగా చాలా మంది నాయకులు సైతం తెర మరుగు అయ్యారు. ఆ జాబితాలో కొడాలి నాని కూడా ఉన్నారు. నిజానికి కొడాలి నాని అంటే జగన్ కి అత్యంత సన్నిహితులు అని పేరు ఉంది. కానీ ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక నాని మౌనమే తన భాషగా చేసుకున్నారు. పైగా ఆయన ఎక్కడా గుడివాడలో సైతం కనిపించలేదు. హైదరాబాద్ లో ఉన్నారని కూడా ప్రచారం సాగింది.

అరెస్టు వార్తలు :

ఇంకో వైపు చూస్తే వల్లభనేని వంశీ తరువాత అరెస్ట్ కొడాలి నానిది అని కూడా ఒక దశలో ప్రచారం సాగింది. కానీ జరిగింది వేరుగా ఉంది. నాని అరెస్టు అదిగో ఇదిగో అంటూండగానే ఏణ్ణర్ధం కాలం ఇట్టే గడచిపోయింది. మరో వైపు చూస్తే నానికి ఆరోగ్యపరంగా సమస్యలు కూడా వచ్చాయి. ఆయనకు బైపాస్ సర్జరీ జరగడంతో చాలా కాలం రెస్ట్ తీసుకున్నారు. అయితే గుడివాడలో చూస్తే కూటమి జోరు చేస్తూ పోతోంది. కొడాలి నాని లేకపోవడంతో వైసీపీ క్యాడర్ అంతా నీరసించి పోయింది. ఇంకో వైపు చూస్తే చాలా మంది నాని అనుచరుల మీద కేసులు పడ్డాయని కూడా చెబుతున్నారు. దాంతో వరసగా నాలుగు సార్లు గెలిచి కంచుకోటగా గుడివాడను చేసుకున్న నాని సొంత నియోజకవర్గం ఒక విధంగా నాయకుడు లేనిదిగా మారింది.

వైసీపీ అలెర్ట్ తో :

ఇక చూస్తే వైసీపీ అధినాయకత్వం కూడా గుడివాడలో ఆల్టర్నేషన్ కోసం ప్రయత్నిస్తోంది అన్న వార్తలు కూడా ఒక దశలో వినిపించాయి నాని కనుక ఇనాక్టివ్ గా ఉంటే అక్కడ కొత్త వారికి చాన్స్ ఇవ్వాలని కూడా హైకమాండ్ సీరియస్ గానే ఆలోచించింది అని కూడా చెప్పుకున్నారు. అంతే కాదు కొడాలి నానిని పిలీచి మరీ ఈ విషయం చెప్పి యాక్టివ్ కావాలని కోరారని ప్రచారం చోటు చేసుకుంది. ఈ నేపధ్యంలో నాని జనంలోకి వస్తాను అని చెప్పడం అంటే ఒక విధంగా వైసీపీకి శుభ వార్తను వినిపించినట్లే అని అంటున్నారు. అయితే నాని హెల్తీగా ఉన్నాను జనంలోకి వస్తాను అంటే మళ్లీ ఆయన మీద అరెస్టులు కేసులు ఉంటాయా ఉండవా అన్న చర్చ కూడా ఉంది. ఏది ఏమైనా కొడాలి మళ్ళీ మొదలెడతానని అంటున్నారు. అది వైసీపీకి ఏ మేరకు ప్లస్ అవుతుంది అన్నది చూడాల్సి ఉంది.



Tags:    

Similar News