రాహుల్ తెలివి ఉపయోగించు...ఒకనాటి సన్నిహితుడి ఘాటు వ్యాఖ్యలు
రాహుల్ గాంధీని ఆలోచించు అంటూ మాజీ సహచరుడిగా కిరణ్ కుమార్ రెడ్డి సలహా ఇచ్చారు.;
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ మీద అనూహ్యంగా ఒక కీలక నాయకుడు విమర్శలు చేశారు. సాధారణంగా ఆయన విమర్శలకు కడు దూరంగా ఉంటారు. ఆయన లో ప్రొఫైల్ మెయింటెయిన్ చేస్తారు. పైగా ఆయన కాంగ్రెస్ రాజకీయాల్లోనే పుట్టి పెరిగి ఎదిగిన వారు. ఏకంగా ఉమ్మడి ఏపీకి మూడేళ్ల పాటు సీఎం గా పనిచేసిన వారు చివరి సీఎం గా రికార్డులకు ఎక్కిన వారు. ఆయనే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. ఆయన రాహుల్ గాంధీ మీద ఆయన తెలివి మీద తాజాగా సెటైర్లు వేశారు. అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
రాహుల్ ఆలోచించు అంటూ :
రాహుల్ గాంధీని ఆలోచించు అంటూ మాజీ సహచరుడిగా కిరణ్ కుమార్ రెడ్డి సలహా ఇచ్చారు. మీరు మీ పక్కన ఉన్న వారూ తెలివిగా వ్యవహరించండి అని గట్టిగానే అంటించారు. మీ తెలివి మీద కూడా సందేహాలు వస్తున్నాయని అన్నారు. అసలు మీ తెలివి ఏమైందో అని డౌట్ వ్యక్తం చేశారు. బీజేపీ ఈసీతో కలసి రిగ్గింగ్ చేసి మూడోసారి వరసగా కేంద్రంలో అధికారంలోకి వచ్చింది అంటూ రాహుల్ గాంధీ తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అదే సమయంలో ఎన్నికల సంఘం పని తీరు మీద సందేహాలు వ్యక్తం అయ్యేలా చేస్తున్నాయి అని అంటున్నారు. దాంతో బీజేపీలో ఉన్న కిరణ్ ఇపుడు రంగంలోకి దిగారు.
ఆనాడు గెలిచింది కదా :
కేంద్రంలో యూపీఏ అధికారంలో ఉన్నపుడే 2014 ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 282 సీట్లను గెలుచుకుని అప్పటికి మూడున్నర దశాబ్దాలుగా కేంద్రంలో ఏ పార్టీకి సొంతంగా మెజారిటీ రాని స్థితిని బ్రేక్ చేసింది కదా అని గుర్తు చేశారు. ఇక 2019లో అంతకంటే ఎక్కువగా 303 సీట్లు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కదా అని ఆయన చెప్పారు. ఇక 2024లో కనుక ఈసీతో రిగ్గింగ్ అని రాహుల్ గాంధీ అన్నదే నిజం అనుకుంటే ఏకంగా 400 సీట్లు రావాలి కదా అని ప్రశ్నించారు. బీజేపీ మ్యాజిక్ ఫిగర్ కి కూడా దూరంగా 240 దగ్గర ఎందుకు ఆగిపోతుంది అని ప్రశ్నించారు.
నాకే అర్ధం కారు మరి :
తాను కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాలుగా పనిచేశాను అని కిరణ్ చెబుతూ తనకే రాహుల్ గాంధీ తీరూ మాటలూ ఎపుడూ అర్ధం కావని అన్నారు. మహారాష్ట్రలో అయిదు నెలల ముందు ఎంపీ సీట్లు ఎక్కువగా వచ్చాయని అదే అసెంబ్లీ ఎన్నికల్లో డిపాజిట్లు పోయాయని అదెలా సాధ్యమని రాహుల్ గాంధీ అంటున్నారని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పుకొస్తూ ప్రజల విలక్షణ తీర్పునకు అది నిదర్శనమని అన్నారు. 2009లో ఉమ్మడి ఏపీలో ఒకేసారి అసెంబ్లీకి పార్లమెంట్ కి ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ కి అసెంబ్లెలెఓ 156 సీట్లు మాత్రమే వచ్చాయని అదే ఎంపీ సీట్లు చూస్తే 33 దాకా వచ్చాయని ఆయన గుర్తు చేశారు.
ఒకే రోజు ఒకేసారి ఎన్నికలు జరిగితే అసెంబ్లీ సీట్లలో మెజారిటీలు తగ్గాయని అదే ఎంపీ సీట్లలో పెరిగాయని దీనిని ఏమంటారు అని నల్లారి వారు లాజిక్ తో కూడిన ప్రశ్నను రాహుల్ కి సంధించారు. ప్రజలు చాలా తెలివైన వారు ఎపుడూ అని గుర్తు పెట్టుకోవాలని అన్నారు. ముందు రాహుల్ గాంధీ తనకు తెలివి ఉంటే ఉపయోగించాలని లేకపోతే సలహాలు ఇచ్చేవారికి తెలివైన వారు ఉంటే పెట్టుకోవాలని ఈ మాజీ సీఎం సూచన చేశారు. మొత్తానికి రాహుల్ గాంధీకి మాజీ కాంగ్రెస్ నేత నుంచే ఈ తరహా సెటైర్లు పడడం విశేషం. ఏది ఏమైనా కమలానికి ఈ కష్టకాలంలో కిరణ్ కుమార్ రెడ్డి వైపు నుంచి గట్టిగా వచ్చిన సమర్ధింపు మాత్రం పెద్ద ఎత్తున ఊరటగా ఉంది అదే సమయంలో మాజీ కాంగ్రెస్ వాదిగా ఆయన రాహుల్ మీద చేసిన వ్యాఖ్యలు జనంలోకి పెద్దగా వెళ్తాయని అంటున్నారు.