టీడీపీ మంత్రి ఫ్యూచర్ ఆలోచనలు ?
అచ్చెన్న 2029లో పోటీ చేయకుండా తన కుమారుడుని పోటీ చేయిస్తారు అన్న వార్తలు వస్తున్నాయి.;
రాజకీయాల్లో సంతృప్తి అన్న మాటకు అర్ధం లేనే లేదు. అనేక సార్లు ఎమ్మెల్యేగా నెగ్గుతారు. అలాగే ఎంపీలు అవుతారు. ఎంత చేసినా ఇంకా చేయాలని ఉంటుంది. రాజకీయం అన్నది జీవితకాలం వృత్తిగా మారింది. ఎంత చేసినా ఎన్ని పదవులు అనుభవించినా ఇంకా చేయాలనే ఉంటుంది.
మరి రాజకీయంగా చూస్తే ఇంకా బోలెడు వయసు అవకాశాలు ఉన్న టీడీపీ సీనియర్ మంత్రి అయిన కింజరాపు అచ్చెన్నాయుడులో సంతృప్తి స్థాయిలు పీక్స్ లో ఉన్నాయా అన్న చర్చ జరుగుతోంది. అంతే కాదు ఆయన తాను రాజకీయంగా చాలా సాధించాను అన్నట్లుగా ఒక మంచి భావనతో ఉన్నారని అంటున్నారు.
ఈ మధ్యన ఆయన ఒక సభలో మాట్లాడుతూ తాను ఆరు సార్లు ఎమ్మెల్యేగా రెండు సార్లు మంత్రిగా ఉన్నాను ఇక తనకు ఏమి కావాలని అన్నట్లుగా వార్తలు వచాయి. నిజంగా అది ఒక గొప్ప రికార్డే. దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడు సోదరుడుగా ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి అనూహ్యంగా వచ్చారు అచ్చెన్నాయుడు.
1995లో ఎర్రన్నాయుడు ఎమ్మెల్యేగా హరిశ్చంద్రాపురం నుని గెలిచారు. అయితే 1996లో వచ్చిన లోక్ సభ ఎన్నికల్లో ఆయన శ్రీకాకుళం జిల్లా నుంచి ఎంపీగా పోటీ చేశారు. మంచి మెజారిటీతో నెగ్గారు. అలా ఆయన కేంద్రంలో కీలక భూమిక పోషించారు. ఇక ఆయన వదిలేసిన హరిశ్చంద్రాపురం నుంచి అచ్చెన్న 1996లో జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచారు.
ఆ తరువాత అదే సీటు నుంచి 1999, 2004లో కూడా గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. ఇక 2009లో అసెంబ్లీ నియోజక వర్గాల పునర్ విభజనలో హరిశ్చంద్రాపురం మాయమైంది. దాంతో ఆ నియోజకవర్గంలో అధిక భాగం కలసిన టెక్కలిని ఆయన ఎంచుకున్నారు 2009లో టెక్కలి నుంచి పోటీ చేసి ఓటమి పాలు అయినా 2014, 2019, 2024లో వరుసగా గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నిలిచారు.
ఇక 2014 తొలిసారి మంత్రిగా బాబు కేబినెట్ లో చేరి అయిదేళ్ళూ పనిచేశారు. 2024లలో ఆయన తిరిగి మంత్రిగా ఉన్నారు. ఈ టెర్మ్ పూర్తి అయితే పదేళ్ళ మంత్రి అవుతారు. దాంతోనే తనకు రాజకీయంగా వచ్చిన ఈ అవకాశాలు ఎంతో సంతృప్తిని ఇచ్చాయని ఆయన అంటున్నారు.
అయితే అచ్చెన్న ఈ వ్యాఖ్యలు చేయడం పట్ల చర్చ సాగుతోంది. నిజంగా ఆయన మనసులో ఏముంది అని ఆరా తీసే పనిలో పడ్డారు. 2029లో ఆయన పోటీ చేస్తారా చేయరా అన్నది కూడా అంతా చర్చించుకుంటున్నారు. అచ్చెన్న 2029లో పోటీ చేయకుండా తన కుమారుడుని పోటీ చేయిస్తారు అన్న వార్తలు వస్తున్నాయి.
దానికి తోడు సీనియర్లకు ఈసారి టికెట్లు కాకుండా పార్టీలో కీలక హోదాలు ఇచ్చి యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని కూడా పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. దాంతో అచ్చెన్న అన్నీ అర్ధం చేసుకునే ఈ విధంగా వ్యాఖ్యానించారా అన్నదే చర్చగా ఉంది. మరో వైపు చూస్తే హ్యాట్రిక్ ఎంపీగా కేంద్రంలో కీలకమైన పోర్ట్ ఫోలియోతో ఎర్రన్నాయుడు కుమారుడు రామ్మోహన్ నాయుడు ఉన్నారు.
ఆయన రానున్న కాలంలో మరింతగా దూకుడు చేస్తారు అని అంటున్నారు. జిల్లా టీడీపీని ఆయనే నడిపిస్తారు అని అంటున్నారు. లోకేష్ టీం లో కీలకంగా ఉన్న రామ్మోహన్ దే భవిష్యత్తు అని అంటున్నారు. దాంతో పెద్దాయనగా ఉన్న అచ్చెన్న వెనక్కి వెళ్తారా తన కుమారుడిని ముందు పెట్టి కింజరాపు అన్నదమ్ములకు టీడీపీ రాజకీయాలు అప్పగిస్తారా అన్న చర్చ సాగుతోంది. మొత్తానికి అచ్చెన్నాయుడు సమర్ధుడైన నేతగా పేరు తెచ్చుకున్నారు. ఆయన రాజకీయంగా కొనసాగాలని అంతా కోరుకుంటున్నారు.