కేతిరెడ్డి పంతం తీరింది....తాడిపత్రి సంగతేంటి ?
ఎట్టకేలకు కేతిరెడ్డి పెద్దారెడ్డి తన పట్టుదలను నిరూపించుకున్నారు. సుమారు పదిహేను నెలల తరువాత ఆయన ఎంతో ఖుషీగా తన సొంతింట అడుగుపెట్టారు.;
ఎట్టకేలకు కేతిరెడ్డి పెద్దారెడ్డి తన పట్టుదలను నిరూపించుకున్నారు. సుమారు పదిహేను నెలల తరువాత ఆయన ఎంతో ఖుషీగా తన సొంతింట అడుగుపెట్టారు. తాడిపత్రిలో సువిశాలంగా నిర్మించుకున్న ఇంట్లో పెద్దిరెడ్డి ఎమ్మెల్యేగా ఎంత కాలం ఉన్నారో తెలియదు కానీ మాజీ ఎమ్మెల్యేగా ఒక్క క్షణం కూడా ఉండలేకపోయారు. ఇలా ఓటమి పాలు కావడమేంటి అలా తాడిపత్రి డోర్స్ క్లోజ్ చేశారు మాజీ ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి.
ఎలా వస్తావో చూస్తామంటూ :
పెద్దారెడ్డి ఎలా తాడిపత్రికి వస్తారో చూస్తామని జేసీ భారీ సవాల్ నే విసిరారు. దాంతో పాటు ఆయన రాకుండా చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేశారు. దాంతో పెద్దారెడ్డి తాడిపత్రి లో అడుగు పెట్టలేకపోయారు. ఎన్నో సార్లు రావాలనుకున్నా పోలీసులే స్వయంగా ఆయనను తీసుకెళ్ళి ఊరు దాటించేశారు. ఇక లాభం లేదనుకుని ఆయన న్యాయ పోరాటానికి దిగారు. హైకోర్టుకు వెళ్ళారు. సింగిల్ బెంచ్ తీర్పు అనుకూలంగా వస్తే డివిజన్ బెంచ్ స్టే విధించింది. ఆ మీదట ఆ స్టేని వెకేట్ చేయించుకోవడానికి సుప్రీం కోర్టు తలుపు తట్టారు. మొత్తానికి సుప్రీం కోర్టులో తీర్పు అనుకూలంగా వచ్చింది. మీ ఇంటికి వెళ్ళడానికి ఇబ్బంది ఎందుకు మిమ్మల్ని ఆపేది ఎవరు అంటూ అన్న న్యాయ భరోసాతో ఆయన తిరిగి వచ్చారు. అలా ఆయన శనివారం తన ఇంటికి పోలీసుల భారీ బందోబస్తు నడుమ చేరుకున్నారు.
నలభై మంది అనుచరులతో :
ఒక వైపు పోలీసుల బందోబస్తు ఉన్నా తనకంటూ సొంత బందోబస్తుని కూడా రెడీ చేసుకున్నారు. నలభై మంది సొంత అనుచరులతో ఆయన తాడిపత్రిలోని తన ఇంట్లోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయన తిమ్మంపల్లి లో గుడిలో పూజలు కూడా చేశారు. ఇక మీదట ఇక్కడే ఉంటా అంటూ చాలెంజ్ చేసి మరీ తన సొంతింట అడుగు పెట్టారు. తాను ప్రతి నిత్యం ప్రజలతో ఉంటాను వారి సమస్యలు పరిష్కరిస్తాను అంటున్నారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. తాను జనం మనిషిని అని చెబుతున్నారు. మాజీ ఎమ్మెల్యేగా ఆయన తన కొత్త జీవితాన్ని పదిహేను నెలల తరువాత మొదలెడుతున్నారు.
ప్రజా సమస్యల పరిష్కారం అంటూ :
అయితే తాడిపత్రిలో మాత్రం రాజకీయ రచ్చలేవీ తగ్గడం లేదు. అలాగే ఉన్నాయని అంటున్నారు. పెద్దారెడ్డి తాడిపత్రి లో ఈ వైపున ఆ వైపు జేసీ వర్గం కూడా ఉంది. దాంతో పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు అని తెలుసొతంది. అయితే ఇలా ఎంత కాలం పోలీసు పహారా అని అంటున్నారు. నివురు గప్పిన నిప్పులా తాడిపత్రి అయితే ఉంది. పెద్దారెడ్డి తన ఇంటికి అయితే వచ్చి ఖుషీగా ఉన్నారు కానీ తాడిపత్రి మాత్రం వేడిగానే ఉందిట. ఇది పోలీసులకే అగ్ని పరీక్ష అని అంటున్నారు. వారే లా అండ్ ఆర్డర్ కచ్చితంగా నిర్వహించి సాధార స్థితికి అంతా తేవాల్సి ఉందని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.