నంబాల కేశవరావు అంత్యక్రియలు పూర్తి!
మావోయిస్టు అగ్రనేత, సీపీఐ మావోయిస్టు పార్టీ జాతీయ కార్యదర్శిగా పనిచేసిన నంబాల కేశవరావు మృత దేహానికి అంత్యక్రియలు పూర్తయ్యాయి.;
మావోయిస్టు అగ్రనేత, సీపీఐ మావోయిస్టు పార్టీ జాతీయ కార్యదర్శిగా పనిచేసిన నంబాల కేశవరావు మృత దేహానికి అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఈ నెల 21న ఛత్తీస్‌గఢ్‌లోని నారయణ్‌పూర్ జిల్లాలో ఉన్న అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్‌లో నంబాల కేశవరావు సహా.. 27 మంది మృతి చెందారని పోలీసులు ప్రకటించారు. కానీ, 28 మంది చనిపోయారని.. ఒక మృత దేహాన్ని తాము తీసుకువెళ్లామని మావోయిస్టులు పేర్కొన్నారు.
ఇక, మృతి చెందిన 27 మంది మావోయిస్టుల్లో కొందరి మృత దేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగిం చారు. కానీ, రివార్డులు ఉన్నవారు... అత్యంత వివాదాస్పద ఘటనలకు పాల్పడిన వారి మృతదేహాలను మాత్రం పోలీసులు వెనక్కి ఇవ్వలేదు. వీరిలో నంబాల కేశవరావు, ఉంగి అలియాస్ కోసి వంటివారు ఉన్నారు. వీరి మృత దేహాలను తమకు అప్పగించాలంటూ.. వారి కుటుంబ సభ్యులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులు అడ్డుకుంటున్నారని కూడా తెలిపారు.
ఈ నేపథ్యంలోనే హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కానీ, ఛత్తీస్‌గఢ్ పోలీసులను ఆశ్రయించి.. మృత దేహాలను స్వాధీనం చేసుకోవాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఛత్తీసగఢ్ పోలీసులను ఆశ్రయించేందుకు వారి కుటుంబ సభ్యులు ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. మరోవైపు..పోలీసులకు మృతదేహాలను భద్ర పరిచేలా ఆదేశాలు ఇవ్వాలన్న విన్నపాలు కూడా ఫలించలేదు. ఈ క్రమంలోనే నంబాల కేశవరావు సహా.. 8 మంది కీలక మావోయిస్టుల మృతదేహాలకు.. పోలీసులే.. అంత్యక్రియలు నిర్వహించారు.
మీడియాకు కూడా ఎలాంటి సమాచారం లేకుండా.. అంతా గోప్యంగా నిర్వహించేసి.. వారే ఫొటోలు రిలీజ్ చేయడం గమనార్హం. ఇదిలావుంటే.. ఈ ఘటనల తర్వాత.. మరికొందరు మావోయిస్టు అగ్రనేతలు.. తాము లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నామని.. కాల్పులు ఆపాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. అంతేకాదు.. పొరుగున ఉన్న పాకిస్థాన్ కాల్పులు ఆపమని కోరితే ఆపేశారని(ఆపరేషన్ సిందూర్).. కానీ తాము కోరుతున్నా కాల్పులు ఆపడం లేదని మావోయిస్టు అగ్రనేతలు వ్యాఖ్యానించడం గమనార్హం. మరి తదుపరి కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.