అటు విజయ్ ఇటు సతీషన్ : ఏపీ తెలంగాణాలో ఈ సన్నివేశాలు చూస్తామా ?

కట్ చేస్తే ఏపీలో సీన్ అందరికీ తెలిసిందే. ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు ఎక్కడా ఎదురు బొదురు కనిపించరు.

Update: 2026-05-15 18:40 GMT

రాజకీయాలు అంటే కచ్చితంగా ప్రజా సేవ చేయడమే. అందులో రెండవ మాటకు తావు లేదు. ప్రజల కోసం పనిచేసే వారు అంతా రాజకీయాల్లోకి వస్తారు. కొందరికి ఎక్కువ అవకాశం వచ్చి అధికారం అందుకుంటే మరి కొందరికి తక్కువ అవకాశం వచ్చి విపక్షంలోకి వస్తారు ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవరూ ఎవరికీ శతృవులు అయితే కాదు, ప్రత్యర్ధులు మాత్రమే. ఓటమి అన్నది ఏ ఇద్దరి పోటీలో అయిన సహజం. మరి దానిని హుందాగా స్వీకరించాల్సి ఉంటుంది. అదే సమయంలో గెలిచిన వారు కూడా అహంకారానికి పోరాదు. ఈ విషయం ప్రజాస్వామ్యానికి మూల సూత్రం. ఇదిలా ఉంటే దేశంలో ప్రధాని మోడీ విపక్ష నేత రాహుల్ గాంధీ అనేక కీలక సందర్భాలలో కలుస్తున్నారు, ముచ్చటించుకుంటున్నారు. ఇక ఇరుగు పొరుగు రాష్ట్రాలలో కూడా అలాగే జరుగుతోంది. ఏపీ తెలంగాణాల సంగతేంటి అన్న చర్చ అయితే అంతటా సాగుతోంది.

విపక్షాల ఇంటికి :

తమిళనాడులో గెలిచిన టీవీకే పార్టీ అధినేత ముఖ్యమంత్రి విజయ్ నేరుగా విపక్ష నేత మాజీ సీఎం స్టాలిన్ ఇంటికి వెళ్ళారు. ఆయనతో ఆప్యాయంగా మాట్లాడారు. ఇద్దరూ కలసి మెలసిన దృశ్యాలు అందరికీ ఆనందం కలిగించాయి. అంతే కాదు వామపక్ష నాయకులతో పాటు ఇతర నాయకుల ఇళ్ళకు కూడా వెళ్ళి వచ్చారు. అంతా కలసి ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. ఇది అందరికీ ఆకట్టుకుంది. తమిళనాడులో అధికార విపక్షలా మధ్యన కూడా రాజకీయం ఉంది. అయితే అది హద్దులు దాటడం లేదు, మాటల తూటాలు పేలుతున్నాయి కానీ అవి మంటలను పెట్టడం లేదు. ఒకనాడు చూస్తే ఇదే తమిళనాడులో ప్రతీకార రాజకీయాలు చోటు చేసుకున్నాయి. జయలలిత వర్సెస్ కరుణానిధిగా సాగిన రాజకీయం నాడు దేశాన్ని నివ్వెరపరచింది. కానీ ఇపుడు అక్కడ రాజకీయ మార్పు అందరినీ ఆలోచింపచేస్తోంది.

సీఎం మాజీ సీఎం కలసి :

ఒకరి చేతులు ఒకరు పట్టుకుని ఒకరి ఖ్సేమం ఒకరు తెలుసుకుంటూ కేరళంలో ప్రస్తుతం సన్నివేశం ఇది. కేరళం కొత్త ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ తరఫున సతీషన్ ఎంపిక అయ్యారు. ఆయన ఈ నెల 18న ప్రమాణం చేస్తారు. అయితే ఆయన మాజీ సీఎం వామపక్ష వృద్ధ నేత పినరయ్ విజయన్ ఇంటికి వెళ్ళి ఆయనతో కలసి ముచ్చటించడం విశేషం. ఇక విజయన్ సైతం తన కోసం తన ఇంటికి వస్తున్న కొత్త ముఖ్యమంత్రి సతీషన్ కి గుమ్మం వద్దనే ఎదురు నిలిచి స్వాగతం పలికారు. ఇద్దరూ నవ్వుకుంటూ ఉల్లాసంగా కబుర్లు చెప్పుకుంటూ ఇంట్లోకి నడచి వెళ్తున్న సన్నివేశాలు చూసిన వారు ఇది కదా రాజకీయాల్లో కావాల్సింది అని అనుకుంటున్నారు.

ఏపీలో సీన్ ఇలా :

కట్ చేస్తే ఏపీలో సీన్ అందరికీ తెలిసిందే. ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు ఎక్కడా ఎదురు బొదురు కనిపించరు. గవర్నర్ ప్రతీ ఏటా ఇచ్చే ఎట్ హోం కార్యక్రమం కోసం లోక్ భవన్ లో అయినా ఇద్దరూ తారసపడిన సన్నివేశాలు ఇటీవల కాలంలో లేవు. తమిళనాడు మాదిరిగా ప్రతీకార రాజకీయాలు ఏపీ సాగుతున్న ఆవేదన అయితే అందరిలో ఉంది. తెలంగాణాలోనూ అదే పరిస్థితి. అక్కడ కూడా ప్రతిపక్షం అధికార పక్షం మధ్య సామరస్యం తక్కువగానే ఉంటోంది. దాంతో రెండు తెలుగు రాష్ట్రాలు ఇపుడు కేరళం తమిళనాడు వైపు ఆసక్తిగా చూస్తున్నాయి. ఏపీ తెలంగాణాలలో కూడా ఈ పరిస్థితులు వస్తాయా అని అంతా చర్చించుకుంటున్నారు. అయితే అలా రావాలని అంతా కలసి రాష్ట్ర భవిష్యత్తు కోసం పాటు పడాలని అంతా కోరుకుంటున్నారు.

Tags:    

Similar News