సముద్ర గర్భంలో కొత్త పరాన్నజీవి.. మానవులకు డేంజర్ ఉందా..?
ఈ పరాన్నజీవి ఒక కోపి పాడ్. ఇది ఒక అసాధారణ విషయం. ఎందుకంటే సముద్రంలో బాగా లోతులో జీవించే క్లోరోఫ్తాల్మస్ ఆల్బట్రాసిస్ చేప నోటిలో ఈ పరాన్నజీవి పెరుగుతుంది.;
భూమిపై ఉన్న జీవరాశి కంటే సముద్రంలోనే ఎక్కువ జీవులు ఉన్నాయి. సముద్ర గర్భం ఎన్నో జీవులకు నివాసం. అంతెందుకు మొదట జీవి ఆవిర్భవంచింది కూడా సముద్ర గర్భంలోనే. సూర్యుడి నుంచి ముక్కగా ఏర్పడిన భూమిపై మొదట ఆవిర్భవించిన జీవి సముద్ర గర్భంలోనే.. అటువంటి సముద్ర గర్భంలో లోతుకు వెళ్తున్నా కొద్దీ.. ఊహకు అందని అనేక ప్రాణులను ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇటీవల జపాన్ సముద్రతీర జలాల్లో కొత్త రకమైన మత్స్య పరాన్నజీవిని కేరళకు చెందిన యువ శాస్త్రవేత్త డాక్టర్ పీటీ అనీశ్ కనుగొన్నారు. హిరోషిమా విశ్వవిద్యాలయ పరిశోధక నౌక సాయంతో జరిగిన ఈ అన్వేషణలో ఆయన ఒక జీవిని కనుగొన్నారు. ఈ పరాన్నజీవి ఒక కోపి పాడ్. ఇది ఒక అసాధారణ విషయం. ఎందుకంటే సముద్రంలో బాగా లోతులో జీవించే క్లోరోఫ్తాల్మస్ ఆల్బట్రాసిస్ చేప నోటిలో ఈ పరాన్నజీవి పెరుగుతుంది.
జైవ వైవిధ్యానికి కొత్త నిర్ధేశం..
ఒకే చేపలో నాలుగు లేదంటే ఐదు రకాల పరాన్నజీవులు ఉండవచ్చని ఆయన పరిశోధన ద్వారా రుజువైంది. పరాన్నజీవుల పరిశోధనలో డాక్టర్ అనీశ్ ప్రధానంగా రొయ్యలు, పీతలు, ప్రత్యేక చేపలపై దృష్టి పెట్టారు. పరాన్నజీవుల వల్ల ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా చేపల పెంపక పరిశ్రమ వందల కోట్ల డాలర్ల నష్టాన్ని ఎదుర్కొంటోంది. సముద్ర సంపదపై ఆధారపడి జీవించే కోట్లాది మంది ప్రజల జీవితాలపై ఇది ప్రతికూల ప్రభావం చూపిస్తోంది.
ఇలాంటి పరిశోధనలు కేవలం అకాడెమిక్ విజయాలకే పరిమితం కాకుండా, ప్రత్యక్ష ఆర్థిక, ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగిస్తాయి. పరాన్నజీవుల స్వభావం, వ్యాప్తి విధానం, వాటి ప్రభావం గురించి క్షుణ్ణంగా అర్థం చేసుకుంటే నివారణ చర్యలు, చికిత్సా విధానాలు మరింత సమర్థవంతంగా అర్థం చేసుకోవచ్చు. అలాగే మానవులకు హాని చేసే పరాన్నజీవులను కూడా ముందే గుర్తించి, సమాజాన్ని రక్షించడం సాధ్యమవుతుంది. దీనితో పాటు పరాన్నజీవుల ఉనికిపై నిఘా పెడితే పర్యావరణ సమతుల్యత కాపాడుకోవచ్చు. ఇది భవిష్యత్తులో మన ఆహార భద్రతకు కూడా దోహదపడుతుంది.
అంతర్జాతీయ గుర్తింపు
డాక్టర్ అనీశ్ ప్రస్తుతం మలేసియాలో అధ్యాపకుడిగా పనిచేస్తూ, భారత్, జపాన్, మలేసియా శాస్త్రవేత్తలతో కూడిన బృందాన్ని నడిపిస్తున్నారు. ఈ బృందం ఇప్పటి వరకు 42 రకాల చేపల పరాన్నజీవులను గుర్తించడం విశేషం. మన దేశం నుంచి వెళ్లిన శాస్త్రవేత్తలు విదేశీ విశ్వవిద్యాలయాల్లో, పరిశోధన సంస్థల్లో ఇలాంటి విలువైన పనులు చేయడం ప్రతి భారతీయుడికి గర్వకారణం.
భవిష్యత్ పరిశోధనలకు దారి
సముద్ర గర్భంలో ఉన్న జీవజాలం ఇంకా ఎన్నో రహస్యాలు దాచుకుంది. మనకు కనిపించే సముద్ర ఉపరితలం కేవలం ఒక చిన్న భాగం మాత్రమే. లోతుల్లో ఉన్న అనేక జీవరాశులు, వాటి మధ్య సంబంధాలు, ప్రభావాలు ఇంకా అన్వేషించాల్సిన అవసరం ఉంది. ప్రపంచం ఎదుర్కొంటున్న వాతావరణ మార్పులు, పర్యావరణ సంక్షోభం నేపథ్యంలో ఈ పరిశోధనలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.