అమీబాతో చిన్నారి మృతి.. కేరళలో కళకలం

ఆరోగ్యశాఖ అధికారులు బాలిక మరణానికి కారణమైన అమీబా మూలాన్ని వెతికే ప్రయత్నాలు ప్రారంభించారు.;

Update: 2025-08-17 09:30 GMT

కేరళలో మరో అరుదైన వ్యాధి బయటపడడంతో అక్కడి ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. కోజికోడ్ జిల్లా తామరశేరి ప్రాంతానికి చెందిన 9ఏళ్ల బాలిక మెదడును దెబ్బతీసే అమీబా వ్యాధితో ప్రాణాలు కోల్పోయింది. జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలతో బాధపడుతున్న ఆమెను తొలుత స్థానిక ఆసుపత్రిలో చేర్చగా, పరిస్థితి విషమించడంతో కోజికోడ్ వైద్య కళాశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న సమయంలోనే బాలిక మృతి చెందింది. మైక్రోబయాలజీ పరీక్షల్లో ఈమె మెదడు వాపుతో బాధపడుతున్నదని, దీనికి "అమీబిక్ ఎన్సెఫలైటిస్" అనే అరుదైన వ్యాధే కారణమని వైద్యులు నిర్ధారించారు.

కలుషిత నీరు ప్రధాన కారణం

ఆరోగ్యశాఖ అధికారులు బాలిక మరణానికి కారణమైన అమీబా మూలాన్ని వెతికే ప్రయత్నాలు ప్రారంభించారు. సమీపంలోని చెరువులు, నీటి వనరులు, సరస్సుల్లో పరిశీలనలు చేపట్టారు. కలుషిత నీటిలో పెరిగే ఈ అమీబా ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించి మెదడును ప్రభావితం చేస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వ్యాధిని వైద్య పరిభాషలో ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫలైటిస్ (PAM) అని పిలుస్తారు. అరుదుగా సంక్రమించినా ప్రాణాంతకమని వైద్యులు పేర్కొంటున్నారు.

ఇప్పటికే నాలుగు కేసులు

కోజికోడ్ జిల్లాలో ఇప్పటివరకు ఇలాంటి నాలుగు కేసులు వెలుగు చూశాయని, ఈ మరణం ఐదో సంఘటనగా నమోదైందని అధికారులు తెలిపారు. కలుషిత నీటి వినియోగం ఎంతమంది చేసారో గుర్తించి, వ్యాధి వ్యాప్తిని అంచనా వేయాలని చర్యలు ప్రారంభించారు. ఈ వ్యాధికి ప్రత్యేకమైన చికిత్స అందుబాటులో లేకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది.

అప్రమత్తం కావాలని విజ్ఞప్తి

పిల్లలు వేసవిలో చెరువులు, కాలువలలో స్నానం చేసే సందర్భాలు ఎక్కువగా ఉంటాయని, అలాంటి నీటికి దూరంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం అత్యవసరమని సూచించారు. ఈ వ్యాధి నివారణపై విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు పేర్కొన్నారు.

Tags:    

Similar News