సీఎంగా పదేళ్లు.. అయినా సొంత ఇల్లు లేదు!!
డబ్బు సంపాదించడానికి మెరుగైన మార్గంగా చాలా మంది రాజకీయాలను ఎంచుకుంటారు. ఇందుకు తగ్గట్టే గల్లీల్లో రాజకీయం చేసేవారు కూడా తమ పరపతిని వాడుకుని బాగా సంపాదిస్తారనే అభిప్రాయం ఎక్కువగా ఉంది.
డబ్బు సంపాదించడానికి మెరుగైన మార్గంగా చాలా మంది రాజకీయాలను ఎంచుకుంటారు. ఇందుకు తగ్గట్టే గల్లీల్లో రాజకీయం చేసేవారు కూడా తమ పరపతిని వాడుకుని బాగా సంపాదిస్తారనే అభిప్రాయం ఎక్కువగా ఉంది. ఇక ముఖ్యమంత్రి వంటి ఉన్నత పదవులు అధిష్టించే నేతల ఆస్తులు, అంతస్తులపై పెద్ద అంచనాలే ఉన్నాయి. భారీ భవంతులు, విలాసవంతమైన సౌకర్యాలు, కోట్ల రూపాయల ఆస్తులు ఉంటాయనే భావన ఎక్కువగా ఉంటుంది. కానీ, ఇందుకు భిన్నంగా సొంత ఇల్లు లేని ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు ఉన్నారంటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. నిజమే కేరళం రాష్ట్రానికి పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన పినరయి విజయన్ కోసం ఒక ఆసక్తికర సమాచారం వైరల్ అవుతోంది.
దాదాపు పదేళ్లుగా కేరళం ముఖ్యమంత్రిగా పనిచేసిన పినరయి విజయన్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలైన విషయం తెలిసిందే. దీంతో సీఎం విజయన్ తన అధికారిక నివాసమైన ‘క్లిఫ్ హౌస్‘ను ఖాళీ చేసి తిరువనంతపురంలోని బేకరీ జంక్షన్ సమీపంలో ఒక అద్దె ఇంట్లోకి మారుతున్నారు. పదేళ్ల పాటు సీఎంగా కొనసాగిన విజయన్ అద్దె ఇంటికి మారుతున్నారనే సమాచారం ప్రధాన చర్చనీయాంశంగా మారింది. కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు అయిన విజయన్ నిరాంబరతకు ఇదే నిదర్శనమని వ్యాఖ్యానిస్తున్నారు.
సీపీఎం అగ్ర నాయకుల్లో ఒకరైన ముఖ్యమంత్రి విజయన్ క్రమశిక్షణకు మారుపేరుగా చెబుతున్నారు. సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఆయనకు సొంతంగా ఇల్లు, కారు వంటి సౌకర్యాలు ఏవీ లేవని అంటున్నారు. ఆయన పేరు మీద ఉన్న ఆస్తుల విలువ కేవలం కొన్ని లక్షల్లోనే ఉండటం గమనార్హం. కన్నూర్ జిల్లాలోని స్వగ్రామంలో కొంత వారసత్వ భూమి మాత్రమే విజయన్ ఆస్తిగా చెబుతున్నారు. ఇక బ్యాంక్ ఖాతాల్లో ఉన్న నగదు, షేర్ల విలువ కూడా చాలా పరిమితమేనని ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు. పదేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ, ఆయన ఆస్తుల్లో పెద్దగా మార్పు లేకపోవడం విశేషంగా వ్యాఖ్యానిస్తున్నారు.
సామాన్యుల కెప్టెన్ విజయన్
పినరయి విజయన్ ప్రస్థానం ఏమీ పూలబాట కాదు. ఒక చేనేత కార్మికుడి కుటుంబంలో జన్మించిన ఆయన, అత్యంత పేదరికాన్ని అనుభవించారు. విద్యార్థి దశ నుండే కమ్యూనిస్ట్ భావజాలం పట్ల ఆకర్షితులై, అట్టడుగు వర్గాల కోసం పోరాడారు. 1975-77లో అత్యవసర పరిస్థితి విధించిన సమయంలో జైలు పాలై, పోలీసుల చిత్రహింసలను కూడా భరించారు. ఆ నాటి పోరాట పటిమనే ఆయనను కేరళ రాజకీయాల్లో తిరుగులేని నాయకుడిగా, అభిమానులు ప్రేమగా పిలుచుకునే ‘కెప్టెన్’గా నిలబెట్టిందని చెబుతున్నారు.
ఆడంబరాలకు దూరం
ముఖ్యమంత్రి విజయన్ ఆడంబరాలకు దూరంగా ఉంటారని చెబుతున్నారు. పార్టీ కేడర్, సామాన్య ప్రజలతో మమేకం కావడానికే ఎక్కువ సమయం కేటాయిస్తారని, ప్రజలతో గడపడటమే ఆయనకు ఇష్టమని అభిమానులు చెబుతుంటారు. అవినీతి మరకలు అంటకుండా, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేయడం వల్లే ఆయన కేరళం చరిత్రలో వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికై రికార్డు సృష్టించారని అంటున్నారు. రాజకీయాల్లో విలువలు తగ్గుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఒక ముఖ్యమంత్రిగా ఉండి కూడా సామాన్య జీవితాన్ని గడపడం అనేది అరుదైన విషయంగా అభివర్ణిస్తున్నారు.