దేవుడిపై నమ్మకం లేదా? కేరళంలో 42 మంది ఎమ్మెల్యేలపై ఆసక్తికర చర్చ
కేరళం రాష్ట్ర 16వ శాసనసభ తొలి సమావేశాలలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. కొత్తగా ఎన్నికైన 140 మంది ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ జి. సుధాకరన్ ప్రమాణ స్వీకారం చేయించారు.
కేరళం రాష్ట్ర 16వ శాసనసభ తొలి సమావేశాలలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. కొత్తగా ఎన్నికైన 140 మంది ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ జి. సుధాకరన్ ప్రమాణ స్వీకారం చేయించారు. మూడున్నర గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర విశిష్ట రాజకీయ సంస్కృతిని, లౌకికవాద భావాలను ప్రతిబింబించింది. విభిన్న భాషల వైవిధ్యం స్పష్టంగా కనిపించింది. కమ్యూనిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉండే కేరళం రాష్ట్రంలో శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం భిన్నంగా సాగిందని కథనాలు వస్తున్నాయి. మొత్తం శాసనసభ్యుల్లో మూడొంతుల మంది దైవసాక్షిగా అనకుండా ఆత్మసాక్షిగా.. అంటూ ప్రమాణం చేయడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
ఆత్మసాక్షిగా ప్రమాణం
ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరు వైరల్ అవుతోంది. 42 మంది ఎమ్మెల్యేలు ఆత్మసాక్షిగా ప్రమాణం చేసి ప్రత్యేక చర్చకు తెరతీశారు. వీరిలో సీపీఐ(ఎం), సీపీఐ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులందరూ ఉన్నారు. ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా ఆత్మసాక్షిగానే ప్రమాణం చేశారు. అయితే ఆశ్చర్యకరంగా, కాంగ్రెస్ పార్టీకి చెందిన వి.టి. బలరామ్, సుమేష్ అచ్యుతన్, ఆర్‌ఎస్‌పీ నేతలు షిబు బేబీ జాన్, విష్ణు మోహన్, ఆర్‌ఎంపీఐ ఎమ్మెల్యే కె.కె. రెమ సైతం దేవుని పేరిట కాకుండా ఆత్మసాక్షిగానే పదవీ ప్రమాణం చేశారు.
భిన్నత్వంలో ఏకత్వం
ఇక సభ్యుల ప్రమాణ స్వీకారంలో మరో వైవిధ్యం కూడా స్పష్టంగా కనిపించింది. మెజారిటీ సభ్యులు మలయాళంలో ప్రమాణం చేయగా, పలువురు నేతలు ఇతర భాషలను ఎంచుకున్నారు. మంజేశ్వర్ ఐయూఎంఎల్ ఎమ్మెల్యే ఎ.కె.ఎమ్. అష్రఫ్ కన్నడ, మలయాళం కలగలిసిన ప్రాంతీయ యాసలో ప్రమాణం చేశారు. దేవికుళం కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎఫ్. రాజా తమిళంలో ప్రమాణ స్వీకారం పూర్తి చేశారు. సీనియర్ కాంగ్రెస్ నేతలు రమేష్ చెన్నితాల, కె. మురళీధరన్, సన్నీ జోసెఫ్, మాథ్యూ కుజల్నాదన్, సందీప్ వారియర్ ఇంగ్లీషులో ప్రమాణం చేయడం విశేషం. ఇందులో సందీప్ వారియర్ రాజ్యాంగ ప్రతిని పట్టుకుని ‘జై హింద్’, ‘జై సీతారామ్’ అనే నినాదాలతో ముగించారు.
ప్రత్యర్థుల మధ్య చిరునవ్వులు
ఎన్నికల ప్రచారంలో తీవ్ర విమర్శలు చేసుకున్నప్పటికీ, సభ లోపల నేతలు చూపిన రాజకీయ హుందాతనం అందరినీ ఆకట్టుకుంది. సీపీఐ(ఎం) వీడి, యూడీఎఫ్ మద్దతుతో స్వతంత్రులుగా గెలిచిన టి.కె. గోవిందన్, వి.కున్హికృష్ణన్ తదితరులు సభలో మాజీ సీఎం పినరయి విజయన్‌ను కలిసి సాదరంగా పలకరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే, సీపీఎం సభ్యత్వాన్ని వదులుకుని యూడీఎఫ్ మద్దతుతో గెలిచిన ప్రొటెం స్పీకర్ జి.సుధాకరన్ కూడా మాజీ సీఎం పినరయి విజయన్ ప్రమాణం పూర్తి చేసుకోగానే కరచాలనం చేసి అభినందించడం సభలో సుహృద్భావ వాతావరణాన్ని నింపిందని అంటున్నారు.
సీఎంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్
కేరళం కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వి.డి. సతీశన్ తన పేరు చివర మీనన్ అంటూ తన కులాన్ని ప్రస్తావించడంపై సోషల్ మీడియాలో వచ్చిన విమర్శలను తోసిపుచ్చారు. ఎమ్మెల్యేగా ప్రమాణం చేసే సమయంలో కూడా ఆయన తన పూర్తి పేరును ‘వడస్సేరి దామోదర మీనన్ సతీశన్’ అని స్పష్టంగా ఉచ్ఛరించారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. తాను కేవలం తన తండ్రి పేరును మాత్రమే గౌరవపూర్వకంగా ప్రస్తావించానని, ఇందులో ఎలాంటి తప్పు లేదని సమర్థించుకున్నారు. కాగా, ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పలువురు ఎమ్మెల్యేలు నడుకుంటూ అసెంబ్లీకి రాగా, మరికొందరు సైకిళ్లను తొక్కుకుంటూ వచ్చారు. ఖరీదైన వాహనాలను పక్కన పెట్టి పొదుపు చర్యలు పాటిస్తున్నామనే సంకేతాలు ఇవ్వడానికే ఎమ్మెల్యే ఇలాచేశారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.