బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో కేసీఆర్ ఫైర్.. మళ్లీ ఫామ్ లోకి గులాబీ బాస్..
సుదీర్ఘ విరామం తర్వాత కేసీఆర్ మళ్లీ తన పాత ‘ఉద్యమ’ శైలి గళాన్ని వినిపించడం తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడిని పెంచింది.;
సుదీర్ఘ విరామం తర్వాత కేసీఆర్ మళ్లీ తన పాత ‘ఉద్యమ’ శైలి గళాన్ని వినిపించడం తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడిని పెంచింది. పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేళ ఆయన చేసిన విశ్లేషణలు.. అటు గతాన్ని గుర్తుచేస్తూనే, ఇటు భవిష్యత్ కార్యాచరణను దిశానిర్దేశం చేసవిగాపార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా చంద్రబాబుతో పొత్తు వెనుక ఉన్న ‘తెలంగాణ’ వ్యూహంపై ఆయన చేసిన వ్యాఖ్యలు రెండు రాష్ట్రాలను ఆలోచింపు చేస్తున్నాయి.
తెలంగాణ రాజకీయ ముఖచిత్రంపై బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ మళ్లీ తనదైన ముద్ర వేశారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన ప్రసంగం కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం కాలేదు.. తెలంగాణ ఉనికిని, ఆత్మగౌరవాన్ని తట్టిలేపే ప్రయత్నంలా కనిపించింది. 2009లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం కేవలం సీట్ల సర్దుబాటు కోసం కాదని, సమైక్యవాదాన్ని గట్టిగా వినిపించే చంద్రబాబు చేత 'తెలంగాణకు అనుకూలం' అని చెప్పించడమే తన అసలు లక్ష్యమని కేసీఆర్ చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
2009 నాటి ‘మాస్టర్ స్ట్రోక్’
కేసీఆర్ తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఎత్తు పళ్లాలు చూశారు. మరెన్నో పొత్తులు పెట్టుకున్నారు, ఇందులో 2009 నాటి పొత్తు అత్యంత చర్చనీయాంశమైంది. అప్పటి వరకు తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న టీడీపీని, తన వ్యూహంతో తెలంగాణ అనుకూల వైఖరి వైపు మళ్లించడంలో కేసీఆర్ సఫలమయ్యారు. తద్వారా సమైక్యవాద శక్తుల బలాన్ని తగ్గించి, ఉద్యమాన్ని జాతీయ స్థాయికి తీసుకువెళ్లగలిగారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో సోనియా గాంధీ 16 సార్లు కోరినా, హైదరాబాద్ విషయంలో అంగుళం కూడా వెనక్కి తగ్గలేదని కేసీఆర్ చెప్పుకచ్చారు. నాడు తాను పడిన ఒత్తిడిని, చూపిన తెగువను మరోసారి ప్రజలకు గుర్తుచేశారు. ‘మొండెం లేని శరీరం’ అనే పదం ద్వారా హైదరాబాద్ ప్రాముఖ్యతను ఆయన మరోసారి నొక్కిచెప్పారు.
‘రైతు బంధు’ వెనుక అసలు కథ
కేసీఆర్ పాలనలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘రైతు బంధు’ పథకం పుట్టుక వెనుక ఉన్న రహస్యాన్ని కూడా ఆయన పంచుకున్నారు. ప్రపంచ ప్రఖ్యాత నిపుణుడు అశోక్ గుల్హాటియా సూచన మేరకు రైతులకు నేరుగా పెట్టుబడి సాయం అందించేలా ఈ పథకాన్ని తీసుకువచ్చినట్లు స్పష్టంచేశారు. అలాంటి బృహత్తర పథకానికి ప్రస్తుత ప్రభుత్వం ఏ గతి పట్టించిందో చూసి కన్నీటి పర్యంతమయ్యానన్నారు. రైతు బంధు నిధుల పంపిణీలో జాప్యంపై ప్రభుత్వాన్ని నిలదీశారు.
చిల్లర’ ప్రభుత్వం
ప్రస్తుత కాంగ్రెస్, బీజేపీలపై కేసీఆర్ కనీవినీ ఎరుగని రీతిలో ఫైర్ అయ్యారు. అంబేద్కర్ విగ్రహం వద్దకు సందర్శకులను వెళ్లనివ్వకపోవడాన్ని ఆయన ‘చిల్లర రాజకీయం’గా పేర్కొన్నారు. అసెంబ్లీలో వాడే భాష సభ్యసమాజం తలదించుకునేలా ఉందన్నారు. బీజేపీని ఒక 'మనువాద' పార్టీ అంటూ.. ఆ పార్టీలో మహిళలకు సరైన గౌరవం దక్కదని ఆరోపించారు. తేజస్వి సూర్య వంటి నేతలు తెలంగాణపై చేస్తున్న వ్యాఖ్యలను ప్రభుత్వం ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నించారు.
భవిష్యత్ కార్యాచరణ
కేవలం విమర్శలకే పరిమితం కాకుండా, పార్టీని పునర్నిర్మించే పనిలో కేసీఆర్ నిమగ్నమయ్యారు. సంస్థాగతంగా పార్టీని ప్రక్షాళన చేస్తూ పాత కమిటీలన్నింటినీ రద్దు చేశారు. ప్రతి నియోజకవర్గం నుంచి 200 మంది ప్రత్యేక శిక్షణ పొందిన 'తెలంగాణ వారియర్స్'ను రంగంలోకి దించుతామని ప్రకటించారు. విద్యార్థి విభాగాలను బలోపేతం చేయడం ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీ పట్టు తిరిగి సాధించాలని భావిస్తున్నట్లు చెప్పారు.
కేసీఆర్ తాజా ప్రసంగం చూస్తుంటే, ఆయన మళ్లీ పాత 'ఉద్యమ' గూటికి చేరుకున్నట్లు అనిపిస్తోంది. అధికారం కోల్పోయిన బాధ కంటే, తెలంగాణ ప్రజల ప్రయోజనాలు దెబ్బతింటున్నాయనే ఆవేదన ఆయన మాటల్లో కనిపిస్తోంది. ‘తెలంగాణ వారియర్స్’ సిద్ధం కావాలని ఆయన ఇచ్చిన పిలుపు, రాబోయే రోజుల్లో రాష్ట్రంలో రాజకీయ పోరు మరింత తీవ్రం కాబోతోందని సూచిస్తోంది. కేసీఆర్ మార్క్ విశ్లేషణలు, వేసే రాజకీయ ఎత్తుగడలు మళ్లీ తెలంగాణ పాలిటిక్స్‌లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారాయి.