ఏపీకి షర్మిల.. తెలంగాణకు కవిత
ఇప్పుడు తెలంగాణలో చోటు చేసుకుంటున్న పరిణామాల్ని చూసినప్పుడు.. రానున్న రోజుల్లో ఏపీలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో.. అలాంటి పరిస్థితులే రిపీట్ కానున్నాయా?;
సంబంధం లేని అంశాలుగా కనిపిస్తూనే.. తరచి చూస్తే.. చుక్కలు ఇట్టే కలిసిపోయే ఉదంతాలు కొన్ని చోటు చేసుకుంటూ ఉంటాయి. అలాంటి రాజకీయ పరిణామమే తెలంగాణలో ఇప్పుడు చోటు చేసుకోనుందా? అన్నది ప్రశ్నగా మారింది. ఎందుకంటే ఇదే తరహా సీన్ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ఉండటటం తెలిసిందే. అవును.. బీఆర్ఎస్ అధినేత కం తన తండ్రి కేసీఆర్ కు లేఖ రాసిన కవిత వైనం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ డా మారింది. ఆమె ఏం ఆశించి ఇదంతా చేస్తున్నారు? అన్న ప్రశ్న తలెత్తుతోంది.
ఆసక్తికరమైన అంశం ఏమంటే ఆంధ్రప్రదేశ్ లో విపక్ష వైసీపీకి ప్రధాన రాజకీయ ప్రత్యర్థి తెలుగుదేశం.. జనసేన అయినప్పటికీ.. భావోద్వేగ ప్రత్యర్థి మాత్రం.. తన గురించి అంతా తెలిసిన.. తన రక్తం పంచుకు పుట్టిన సోదరి షర్మిలగా చెప్పాలి. ఒకప్పుడు జగనన్న విడిచిన బాణాన్ని అని నినదించి.. ప్రజాక్షేత్రంలో తన అన్న పెట్టిన పార్టీ కోసం వందలాది కిలోమీటర్లు పాదయాత్ర చేశారు.
తర్వాతి కాలంలో ఏం జరిగింది? అన్నది అందరికి తెలిసిందే. అధికారాన్ని పంచుకునే విషయంలోనూ.. ఆస్తుల్ని షేర్ చేసుకునే విషయంలో తలెత్తిన పంచాయితీ చివరకు షర్మిల చేత కొత్త పార్టీ పెట్టేలా చేశాయి. తొలుత తన సోదరుడితో ముఖాముఖి తలపడటం ఇష్టం లేక సొంతంగా తెలంగాణలో పార్టీ పెట్టినా.. తర్వాతి దశల్లో ఆమెకు తత్త్వం బోధపడి చివరకు తన తండ్రి మాదిరే కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేసేశారు. ఏపీకే పరిమితమవుతున్నట్లు ప్రకటించటం ద్వారా తన అన్న అరకాలిలో ముల్లుగా..కంట్లో నలకలా మారారు.
ఏపీ కాంగ్రెస్ రథసారధిగా షర్మిల బాధ్యతలు చేపట్టే నాటికే ఎన్నికలు దగ్గరకు రావటం.. ఎన్నికల్లో ఆమె సాధించింది ఏమీ లేకున్నా.. ఆమె టార్గెట్ చేసిన తన సోదరుడి చేతిలో ఉన్న అధికారం చేజారిపోయింది. ఇప్పుడు విపక్షంలో ఉన్న ఈ అన్నాచెల్లెళ్ల మధ్య రాజకీయశత్రుత్వం నడుస్తూనే ఉంది.జగన్ తో పోలిస్తే షర్మిలే తన అన్న మీద తరచూ ఘాటు విమర్శలు చేస్తుంటారు. ఈ విషయంలో జగన్ మాత్రం చెల్లెలు మీద ఆచితూచి అన్నట్లుగా స్పందిస్తూ ఉంటారు.
ఇప్పుడు తెలంగాణలో చోటు చేసుకుంటున్న పరిణామాల్ని చూసినప్పుడు.. రానున్న రోజుల్లో ఏపీలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో.. అలాంటి పరిస్థితులే రిపీట్ కానున్నాయా? అన్నది ఆసక్తికర చర్చగా మారింది. ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ విపక్షంలో ఉంది. కష్టాల్లో ఉన్న పార్టీకి కావలి కాసే కన్నా.. ఇలాంటి వేళలోనే తనకు ఇవ్వాల్సిన సముచిత ప్రాధాన్యత అంశాన్ని బయటకు తీసి.. తెర మీదకు తీసుకొచ్చిన కవిత తదుపరి మజిలీ కొత్త పార్టీ ఏర్పాటుగానే చెప్పాలి.
అలాంటిదే జరిగితే.. ఏపీలో ఎలాంటి పరిస్థితి నెలకొందో తెలంగాణలోనూ అలాంటి పరిస్థితే నెలకొనటం ఖాయం. ఏపీ విపక్షానికి చిరాకు పెట్టేలా షర్మిల ఉండగా.. రానున్న రోజుల్లో తెలంగాణ విపక్షానికి మంట పుట్టేలా కవిత మారనున్నారా? అన్నది ప్రశ్నగా మారింది. దీనికి కచ్ఛితమైన సమాధానం చెప్పగలిగింది కాలం ఒక్కటి మాత్రమే. అదిచ్చే తీర్పు వరకు వెయిట్ చేయక మరో మార్గం లేదు.