తండ్రి నుంచి కవిత కోరుతోంది అదేనా ?
తెలంగాణ జాతిపితగా బీఅర్ఎస్ వారు కేసీఅర్ ని కీర్తిస్తారు. బాపూ అని తెలంగాణావాదులు ఆయన అభిమానులు పొగుడుతారు.;
తెలంగాణ జాతిపితగా బీఅర్ఎస్ వారు కేసీఅర్ ని కీర్తిస్తారు. బాపూ అని తెలంగాణావాదులు ఆయన అభిమానులు పొగుడుతారు. కానీ తనకు సొంత తండ్రి అయిన కేసీఆర్ విషయంలో ఆయన ముద్దుల తనయ కవిత మాత్రం ఎదురు నిలిచారు దానిని చూసిన వారు అంతా రాజకీయం ఎంత చిత్రం అని మాత్రమే అనుకోగలరు. కేసీఆర్ కి కుమార్తె అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే.
రాజకీయ అందలాలు అలా :
రాజకీయాల్లో ప్రోత్సాహాం ఉంటుంది. అలా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవాలి. కవితకు కేటీఆర్ కి కూడా కేసీఅర్ చాన్సులు ఇచ్చారు. ఆమెకు నిజామాబాద్ ఎంపీగా రెండు సార్లు టికెట్ ఇస్తే 2014లో మాత్రమే గెలిచి 2019లో ఓడారు. ఆ తరువాత ఆమెను తెచ్చి ఎమ్మెల్సీగా చేశారు. అయితే కవిత ఢిల్లీ లిక్కర్ స్కాం లో చిక్కుకోవడంతో ఇబ్బందులు పాలు అయ్యారు.
నాటి నుంచే దూరం :
కవిత ఈ స్కాం లో జైలులో నెలల తరబడి ఉండి వచ్చారు. అయితే ఆమె బయటకు వచ్చిన తరువాత తనకు పార్టీ నుంచి తగినంత మద్దతు దక్కలేదని భావించడం మొదలెట్టారు. మరో వైపు చూస్తే ఆమె ఈ కేసులో ఉండడం వల్ల తమకు ఎదురయ్యే ఇబ్బందులు బేరీజు వేసుకున్నారో ఏమో కానీ కొంత ఎడం అయితే పార్టీ పెట్టిందని కవిత అనుచరుల వైపు నుంచి వస్తున్న ఆరోపణ. ఏది ఏమైనా ఒక గ్యాప్ అయితే కొన్నాళ్ళ క్రితమే వచ్చింది.
నేరుగానే విమర్శలు :
ఈ మధ్యకాలం అంతా కవిత పరోక్ష విమర్శలు చేస్తూ వచ్చారు. అయితే కొన్ని రోజులుగా ఆమె నేరుగానే ఎటాక్ చేస్తున్నారు. దానికి కారణం తనకు బీఆర్ఎస్ లో ఇక పెద్దగా బంధం లేదని తేలిపోవడమే ఒక కారణం అంటున్నారు. అదే సమయంలో తాను సొంతంగా ఒక రాజకీయ పార్టీని పెట్టాలని ఆమె చూస్తున్నారు అని ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే కవిత సొంత పార్టీ పెట్టాలీ అంటే ఆమెకు స్వేచ్చ ఉంది కదా ఎందుకు తాత్సారం మరెందుకు బీఆర్ఎస్ అధినాయకత్వంతో పంచాయతీలు పేచీలు అన్న చర్చ కూడా వస్తోంది.
సానుభూతి కోసమేనా :
బీఆర్ఎస్ అధినాయకత్వాన్ని వీలైనంతగా రెచ్చగొట్టి ఇబ్బంది పెడితే తప్పనిసరిగా తనను పార్టీ నుంచి బయటకు పంపిస్తారు అన్నదే ఆమె రాజకీయ వ్యూహం అని అంటున్నారు. అపుడు తనను సొంత పార్టీలో సొంత వారే బయటకు పంపించారు అన్న సానుభూతి తనకు తనకు దక్కుతుందని తండ్రి కేసీఆర్ ని ఏమీ అనకుండా ఆయన వెనక ఉన్న వారే ఇలా చేయించారు అని చెప్పడం ద్వారా కేసీఆర్ వారసత్వం వాటా కోసం జనం మధ్యలో ఉంటూ పోరాడాలన్నదే ఆమె వ్యూహం అని అంటున్నారు.
అందుకే గుంభనంగా :
అయితే ఇలాంటి వ్యూహాలలో ఎంతో రాటుదేలిన బీఆర్ఎస్ అధినాయకత్వం అయితే ఏ మాత్రం తొందర పడటం లేదు అని అంటున్నారు. కవిత విషయంలో వీలైనంత వరకూ సంయనమంతో ఉండాలని చూస్తున్నారు అని అంటున్నారు. అందుకే మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని లిల్లీపుట్ అని కవిత అన్నా కూడా ఆయన ఆమెకే అన్నీ వదిలేస్తున్నాను అని చెప్పేశారు. కేసీఅర్ తో మాట్లాడి వచ్చిన తరువాతనే ఆయన ఈ రకమైన వ్యాఖ్యలు చేశారు. దీనిని బట్టి చూస్తే కవిత కోరుతున్నట్లుగా పార్టీ ఆమె మీద వేటు వేసి సింపతీ తెచ్చేందుకు చూడదని అంటున్నారు. తనంతట తానే కవిత బయటకు వెళ్ళేలా జాగ్రత్త పడుతున్నారు. మొత్తానికి తండ్రికే కత్తి ఇవ్వాలని కవిత చూస్తున్నారు అని కానీ జరిగేది ఆమె కోరుకున్నట్లుగా ఉంటుందా ఉండదా అన్నది వేచి చూడాల్సిందే అంటున్నారు.