కుదురు లేని కవిత!
బీఆర్ ఎస్ నుంచి సస్పెన్షన్‌కు గురైన కేసీఆర్ తనయ, జాగృతి నాయకురాలు కవిత రాజకీయాలు ఎలాంటి మలుపు తిరుగుతా యి? ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు చర్చగా మారింది.;
బీఆర్ ఎస్ నుంచి సస్పెన్షన్‌కు గురైన కేసీఆర్ తనయ, జాగృతి నాయకురాలు కవిత రాజకీయాలు ఎలాంటి మలుపు తిరుగుతా యి? ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు చర్చగా మారింది. పార్టీలో ఆది నుంచి ఫైర్ బ్రాండ్ నాయకురాలిగా వ్యవహరించిన కవిత.. ఇప్పుడు తన దూకుడుతోనే తనకు చేటు తెచ్చుకున్నారన్న వాదన వినిపిస్తోంది. `డియర్ డాడీ` లేఖకు ముందు.. తర్వాత కూడా.. కవిత సెంట్రిక్‌గా రాజకీయాలు సాగుతున్నాయి. ఢిల్లీమద్యం కుంభకోణంలో చిక్కుకున్నప్పుడు.. కేసీఆర్.. ఆమెను హెచ్చరించారన్న వార్తలు వచ్చాయి.
``మద్యం గొడవ.. అసలు మనకు ఎందుకు?`` అని కేసీఆర్ తన కుమార్తెను ప్రశ్నించారన్న చర్చ జరిగింది. అయితే.. ఆమె వినిపించుకోలేదని.. ఫలితంగానే జైలుకు వెళ్లాల్సి వచ్చిందని కూడా పార్టీలో చర్చసాగింది. ఆ తర్వాత బెయిల్ దక్కించుకోవడం తోపాటు.. బయటకు రావడం వెనుక కూడాకేసీఆర్ ఉన్నారు. ఇది నిర్వివాదాంశం. అయితే.. పార్టీలో తనకు ప్రాధాన్యం లేకుండా పోయిందన్నది కవిత ఆవేదన. పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత.. మండలి సభ్యురాలిగా ఉన్న కవిత.. తనకు మండలిలో బీఆర్ పక్ష నాయకురాలి పదవిని ఆశించారు. కానీ, కేసీఆర్..ఆమెకు ఆ పదవి ఇవ్వలేదు. ఇదేసమయంలో పార్టీలో తనకు కేటీఆర్‌తో సమానంగా మరేదైనా పదవిని ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇలా.. ఆది నుంచి కూడా తనకు గుర్తింపు.. ప్రాధాన్యం కోసం కవిత వెంపర్లాడారనేది వాస్తవం. కానీ, అప్పటికే హరీష్‌రావు, కేటీఆర్‌ల మధ్య ఆధిపత్య ధోరణి పెరిగిందన్న చర్చ ఉన్న నేపథ్యంలో కేసీఆర్ కవితకు అంత కీలక పదవులు ఇవ్వకపోవడంతో ఆమెలో సహజంగానే అసంతృప్తి రాజుకుంది. ఇక, తన నిర్ణయాలు కూడా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదనతోనూ ఉన్నారు. వీటన్నింటి కలగలుపుగానే డియర్ డాడీ లేఖ ను సంధించారు. తర్వాతైనా.. తనకు ప్రాధాన్యం పెరుగుతుందని అనుకున్నారు.కానీ, కేసీఆర్.. ఈ విషయాలను లైట్ తీసుకున్నారు. ఇక, తాజాగా తండ్రి కోసం అంటూ.. పార్టీని ఇరుకున పడేలా కాళేశ్వరంలో అవినీతిపై వ్యాఖ్యలు చేశారు. ఇవి విపక్షాలకు బలమైన ఆయుధంగా మారాయి.
ఈ పరిణామాల క్రమంలోనే కేసీఆర్.. సస్పెండ్ చేశారు. అయితే.. దీనికి ముందే కేసీఆర్.. కవితతో రెండుదఫాలుగా ఫోన్‌లో చర్చించినట్టు సమాచారం. తాజాగా పార్టీ కీలక నాయకురాలు.. సత్యవతి రాథోడ్ చెప్పిన విషయం మేరకు.. కవితతో కేసీఆర్ ముచ్చటించినట్టు సమాచారం. ఆమెను తగ్గాలని, కీలక వ్యాఖ్యలు చేయొద్దని కూడా సూచించారని సమాచారం. కానీ, కవిత ఎక్కడా వినిపించుకునే పరిస్థితిలో లేకపోవడంతో నే పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు చెప్పారు. ఇక, ఇప్పుడుకవిత పార్టీలో నే కొనసాగుతారా? అంటే.. 99 శాతం ఆమె పార్టీ నుంచి బయటకు రావడం ఖాయమని తెలుస్తోంది. తెలంగాణ జాగృతి పేరుతో సొంత కుంపటి ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.