పాకిస్థాన్‌లో హిందూ మహిళ సంచలనం.. ప్రస్తుతం అంతా ఆమెకు సెల్యూట్ చేస్తున్నారు
చాగై జిల్లాలోని నోష్కి పట్టణానికి చెందిన కషిష్ ఈ ఘనత సాధించి చరిత్ర పుటల్లోకి ఎక్కారు.;
పాకిస్థాన్‌కు చెందిన ఒక హిందూ మహిళ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌కు చెందిన కషిష్ చౌదరి బలూచిస్తాన్ అసిస్టెంట్ కమిషనర్‌గా నియామకం అయ్యాయి. కేవలం 25 ఏళ్ల వయస్సులో కషిష్, అల్లకల్లోలమైన ప్రావిన్స్‌లో ఇంత పెద్ద బాధ్యతను స్వీకరించిన పాకిస్థానీ హిందువుల మైనారిటీ కమ్యూనిటీకి చెందిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు.
చాగై జిల్లాలోని నోష్కి పట్టణానికి చెందిన కషిష్ ఈ ఘనత సాధించి చరిత్ర పుటల్లోకి ఎక్కారు. ఆమె బలూచిస్తాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (BPSC) పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం కేవలం వ్యక్తిగత విజయం మాత్రమే కాదు. దేశంలోని మైనారిటీ కమ్యూనిటీలకు ఆశాకిరణం కూడా. ఆమె ఈ విజయం సాధించిన తర్వాత ప్రతి ఒక్కరూ ఆమెను అభినందిస్తున్నారు.
సమా న్యూస్‌తో ఆమె మాట్లాడుతూ.. కషిష్ చౌదరి ఈ విజయాన్ని సాధించడానికి తాను మూడు సంవత్సరాలు అవిరామంగా చదవాల్సి వచ్చిందని, ప్రతిరోజూ కనీసం ఎనిమిది గంటలు ప్రిపేర్ అయ్యేదానినని చెప్పారు. "క్రమశిక్షణ, సమాజానికి సహకరించాలనే కోరిక ఈ ప్రయాణంలో నన్ను ముందుకు నడిపించాయి" అని ఆమె చెప్పుకొచ్చారు.
కషిష్ చౌదరి తండ్రి గిరిధారి లాల్ మీడియా ముందు తన కుమార్తె గురించి గర్వంగా మాట్లాడారు. "నా కుమార్తె తన కృషి, నిబద్ధత కారణంగా అసిస్టెంట్ కమిషనర్‌గా ఎదిగినందుకు నేను చాలా గర్వపడుతున్నాను" అని ఆమె తండ్రి అన్నారు.
కషిష్ చౌదరి, ఆమె తండ్రి క్వెట్టాలో బలూచిస్తాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్తీని కలిశారు. అక్కడ కషిష్ మహిళలు, మైనారిటీల సాధికారత, ప్రావిన్స్ అభివృద్ధి కోసం కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. కషిష్ దేశానికి, బలూచిస్తాన్‌కు గర్వకారణమని సీఎం బుగ్తీ అన్నారు. పీటీఐ ప్రకారం.. పాకిస్తాన్ లో పురుషాధిక్య ప్రాంతాలలో అనేక అడ్డంకులను అధిగమించి విజయం సాధించిన హిందూ మహిళల్లో కషిష్ ఒకరు.