కార్వార్ జైలులో ఖైదీల వింత ప్రవర్తన.. జైలు సిబ్బందిపై.. అసలు కారణం ఇదే..

జైలు అంటే ఏంటి? కఠిన నియమాలు, నియంత్రణ, క్రమశిక్షణ. కానీ కార్వార్‌ జిల్లా జైలులో జరిగిన ఈ ఘటన ఆ భ్రమను ఒక్కసారిగా మార్చివేశాయి.;

Update: 2025-12-08 06:47 GMT

జైలు అంటే ఏంటి? కఠిన నియమాలు, నియంత్రణ, క్రమశిక్షణ. కానీ కార్వార్‌ జిల్లా జైలులో జరిగిన ఈ ఘటన ఆ భ్రమను ఒక్కసారిగా మార్చివేశాయి. నేరస్తులు ఉండాల్సిన ప్రదేశంలో అధికారులు హింసకు గురవుతుంటే శిక్ష, సంస్కరణల మధ్య ఉన్న అతి చిన్న రేఖ మనలను పరిశీలించేకునేలా చేస్తుంది. ఇది ఒక చిన్న గొడవ కాదు.. ఇది జైలు వ్యవస్థలో దాగిన పెద్ద సమస్యల ప్రతిబింబం.

అసలు ఏమైంది?

శనివారం ఉదయం సాధారణ తనిఖీలలో భాగంగా జైలు సిబ్బంది పరిశీలిస్తున్నారు. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా అల్లకల్లోలంగా మారింది. మంగళూరుకు చెందిన ఇద్దరు ఖైదీలు మొహమ్మద్ అబ్దుల్ ఫయ్యాజ్, కౌశిక్ నిహాల్ ఒక్కసారిగా విపరీతంగా రియాక్ట్ అయ్యారు. నిషేధిత పదార్థాలపై జైలు సిబ్బంది కట్టుదిట్టమైన తనిఖీలు నిర్వహిస్తుండడంతో అసహనానికి గురై, జైలు సిబ్బందితో ఘర్షణకు దిగారు. జైలర్ కల్లప్ప గస్తీతో పాటు విధుల్లో ఉన్న మరో ముగ్గురు సిబ్బందిపై వీరిద్దరూ దాడి చేసినట్లు సమాచారం. గంజాయి, పొగాకు, సిగరెట్లు, ఇతర నిషేధిత వస్తువుల అక్రమ సరఫరాను నిరోధించేందుకు ఇటీవల జైలులో చర్యలు కఠినంగా మారాయి. ఈ నియంత్రణ ఈ ఇద్దరిని మరింత రెచ్చగొట్టినట్లు తెలుస్తోంది. నియంత్రణ పెరిగిందనే కారణంతో వాగ్వాదం మొదలై, అది చివరకు హింసాత్మక దాడిగా మారింది. ఈ ఘటనలో జైలర్‌తో పాటు పలువురు సిబ్బంది గాయపడ్డారు, వారి యూనిఫార్ములు చిరిగిపోయాయి. గాయపడిన వారిని కార్వార్ జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు.

కానీ ఈ సంఘటనను అక్కడితో ముగిసిన దాడిగా మాత్రమే చూస్తే, జైలు వ్యవస్థలో దాగి ఉన్న అసలు లోపాలను మనం కనిపెట్టలేం. జైలులోకి నిషేధిత పదార్థాల ప్రవాహం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఏ జైలులోనైనా కాంట్రాబాండ్ సరఫరా అనే చీకటి వ్యవస్థ ఉండడం ఆందోళనకరం. ఈ వస్తువులు బయట నుంచి వస్తున్నాయా..? లేక అంతర్గత సిబ్బంది సాయంతో చేరుతున్నాయా..? అన్నది అసలు ప్రశ్న. ఖైదీలు ఈ పదార్థాలను జైలులోకి తెప్పించుకునేందకు చూపుతున్న ఆత్రుత, నియంత్రణను ధిక్కరించే ధోరణి ఇవన్నీ ఒక సుస్థిరమైన అక్రమ నెట్‌వర్క్ ఉన్నట్టుగా సూచిస్తున్నాయి.

పెరుగుతున్న దాడులు..

మరో పెద్ద సమస్య ఏంటంటే, జైళ్లు ఇప్పుడు రీఫార్మ్ సెంటర్లు కాకుండా ‘రెసిస్టెన్స్ జోన్స్’‌గా మారుతున్నాయా? అన్న ప్రశ్న వినిపిస్తోంది. నియమాలు కఠినతరం చేయగానే ప్రతిఘటన పెరుగుతోంది. జైళ్లలో పెరుగుతున్న గ్యాంగ్‌ కల్చర్, ఖైదీల మధ్య వర్గీకరణ, సిబ్బందిపై దాడులు ఇవన్నీ వ్యవస్థ ఎంత బలహీనమైందో చూపుతుంది. బయట ఎలా ఉంటారో, జైల్లో కూడా అదే దూకుడు కొనసాగిస్తున్న ఖైదీలు, నియంత్రణను సవాలు చేయడానికి వెనుకాడడం లేదు. ఇదంతా సిబ్బంది భద్రతను ప్రమాదంలోకి నెడుతూ, వారి మానసిక ఒత్తిడిని పెంచుతోంది. సిబ్బంది తక్కువగా ఉండడం, సదుపాయాలు పరిమితంగా ఉండడం సమస్యను మరింత లోతులోకి నెడుతున్నాయి.

పాలనావ్యవస్థ మారాలి..

ఈ ఘటనలో గాయపడింది కేవలం జైలర్ గస్తీ సిబ్బంది అనే చూడద్దు.. మొత్తం పరిపాలనగా చూడాలి. ఇద్దరు ఖైదీలకు ఇంత ధైర్యం ఎలా వచ్చింది? అది ఒక్కసారిగా వచ్చిన అహంకారమా? లేక వ్యవస్థలోని బలహీనతలను గుర్తించి వాటిని సద్వినియోగం చేసుకున్న ధైర్యమా? జైల్లో అమలు చేయాల్సిన నియమాలు కేవలం పుస్తకాలలోనే ఉంటే, ఖైదీలు వాటిని పట్టించుకోకపోవడం సహజం. ఇది ఖైదీల ధైర్యానికి కాదు వ్యవస్థ బలహీనతకు సంకేతం.

దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు

పోలీసులు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించారు. దాడి చేసిన ఇద్దరు ఖైదీలపై కేసులు నమోదవుతాయి. కఠిన చర్యలు తీసుకుంటారు. కానీ అసలు ప్రశ్న ఇలాంటి ఘటనలు ఇక జరగకుండా ఎలా నిరోధించాలి? జైళ్లలో టెక్నాలజీ వినియోగం పెరగాలా? బాడీ కెమెరాలు తప్పనిసరిచేయాలా? కాంట్రాబాండ్ సరఫరా గొలుసును పూర్తిగా ఛేదించాలా? సిబ్బందికి ప్రమాద నిర్వహణ శిక్షణ అవసరమా? సమాధానం ఒకటే అవును.

చివరగా, జైలు అంటే శిక్ష మాత్రమే కాదు, సంస్కరణ కూడా. ఖైదీలు మారాలంటే ముందుగా వ్యవస్థ మారాలి. నిషేధిత పదార్థాల నిరోధం, పునరావాస కార్యక్రమాలు, సిబ్బంది భద్రత ఇవన్నీ ఒక సున్నితమైన సమతౌల్యంలో ఉండాలి. కార్వార్ ఘటన మనకు స్పష్టమైన సందేశం ఇస్తుంది. జైలు గోడలు ఎంత ఎత్తుగానైనా, లోపల క్రమశిక్షణ బలహీనమైతే చీకటిలో సమస్యలు పెరుగుతూనే ఉంటాయి. ఇది ఒక దాడి కథ కాదు.. ఇది వ్యవస్థ సవరణకు పిలుపు.




Tags:    

Similar News