కరూర్ బాధితులను కలవనున్న విజయ్.. డిఫరెంట్ గా ప్లాన్ చేశారు!
టీవీకే అధినేత, సినీ నటుడు విజయ్ కరూర్ లో నిర్వహించిన ర్యాలీలో జరిగిన తొక్కిసలాట దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన సంగతి తెలిసిందే.;
టీవీకే అధినేత, సినీ నటుడు విజయ్ కరూర్ లో నిర్వహించిన ర్యాలీలో జరిగిన తొక్కిసలాట దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తమిళనాడు రాజకీయాల్లోనూ కొత్త సమీకరణలకు తెరలేపిందనే చర్చా జరిగింది. ఈ ఘటన నేపథ్యంలో అటు అన్నాడీఎంకే, ఇటు బీజేపీలు విజయ్ కు బాసటగా నిలిచాయి.. డీఎంకే ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి.
మరోవైపు ఈ ఘటన అనంతరం టీవీకేకు సంబంధించిన కొందరిని పోలీసులు అరెస్టు చేశారు. అందులో ఆ పార్టీకి చెందిన కీలక వ్యక్తులు ఉన్నారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు విజయ్ రూ.20 లక్షలు ప్రకటించి, బాధిత కుటుంబాలకు అందించారని ప్రచారం జరిగింది! ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాలను కలిసే విషయంలో విజయ్ డిఫరెంట్ గా ఆలోచించారని అంటున్నారు.
అవును... విజయ్ కరూర్ లో నిర్వహించిన ప్రచార ర్యాలీ తీవ్ర విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో విజయ్ బాధిత కుటుంబాలను కలవనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే... బాధిత కుటుంబాలను వారి ఇళ్లకు వెళ్లి పరామర్శించేందుకు డీఎంకే ప్రభుత్వం అనుమతి నిరాకరించింది.
దీంతో వారందరినీ సోమవారం (అక్టోబర్ 27) చెన్నై సమీపంలోని రిసార్టులో కలిసి పరామర్శించనున్నారు. దీనికోసం టీవీకే పార్టీ మహాబలిపురంలోని రిసార్టులో 50 గదులను బుక్ చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. దాంతో ఒక్కో బాధిత కుటుంబాన్ని వ్యక్తిగతంగా కలిసి సంతాపం తెలియజేస్తారని తెలుస్తోంది. దీనికోసం వారికి బస్ బుక్ చేశారని సమాచారం.
కాగా... కరూర్ లో టీవీకే విజయ్ నిర్వహించిన ర్యాలీలో జరిగిన తొక్కిసలాట తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో నేరం టీవీకే పార్టీదని ప్రభుత్వం ఆరోపిస్తే... ప్రభుత్వానిదే తప్పన్నట్లుగా విపక్షాలు ఆరోపించాయి! ఈ ఘటనకు సంబంధించి టీవీకేకు సంబంధించిన కొందరిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు.
మరోవైపు ఈ ఘటనపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ విజయ్ పార్టీ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. అయితే.. ఈ విజ్ఞప్తిని తొలుత వ్యతిరేకించిన న్యాయస్థానం.. ఆ తర్వాత 'సిట్' దర్యాప్తునకు ఆదేశించింది. హైవేలపై ఏ రాజకీయ పార్టీ సభలకు పోలీసులు అనుమతివ్వరని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.