విజయ్‌ టీవీకే పార్టీ ర్యాలీలో ఘోరం: తొక్కిసలాటలో 31 మంది మృతి

కరూర్‌ మెడికల్‌ కాలేజీ డీన్‌ డాక్టర్‌ ఆర్‌ శాంతిమలార్‌ మొదట్లో 10 మంది మృతిని ధ్రువీకరించగా, ఆ తర్వాత అంబులెన్స్‌లు వరుసగా ఆసుపత్రికి చేరుకోవడంతో మృతుల సంఖ్య అనూహ్యంగా 31కి పెరిగింది.;

Update: 2025-09-27 16:55 GMT

ప్రముఖ సినీ నటుడు, తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీ అధినేత విజయ్‌ నిర్వహించిన ర్యాలీలో శనివారం రాత్రి ఘోర విషాదం చోటుచేసుకుంది. తమిళనాడులోని కరూర్‌లో జరిగిన ఈ ర్యాలీ సందర్భంగా సంభవించిన భారీ తొక్కిసలాటలో ముగ్గురు చిన్నారులతో సహా 31 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మందికి పైగా తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ ర్యాలీకి అభిమానులు, ప్రజలు భారీ సంఖ్యలో ఊహించని విధంగా తరలివచ్చారు. విజయ్ ప్రసంగం జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా తోపులాట మొదలై, పరిస్థితి అదుపు తప్పింది. జనం ఒక్కసారిగా కిందపడటంతో ఊపిరాడక చాలామంది ప్రాణాలు విడిచారు.

కరూర్‌ మెడికల్‌ కాలేజీ డీన్‌ డాక్టర్‌ ఆర్‌ శాంతిమలార్‌ మొదట్లో 10 మంది మృతిని ధ్రువీకరించగా, ఆ తర్వాత అంబులెన్స్‌లు వరుసగా ఆసుపత్రికి చేరుకోవడంతో మృతుల సంఖ్య అనూహ్యంగా 31కి పెరిగింది. ఆరోగ్యశాఖ మంత్రి మా. సుబ్రహనియన్‌ ఈ విషయాన్ని వెల్లడించారు.

తక్షణ సహాయ చర్యలు

గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించేందుకు తిరుచ్చి నుంచి 24 మంది, సేలం నుంచి 20 మంది వైద్యులను కరూర్‌ ఆసుపత్రికి పంపినట్లు ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు. మృతుల కుటుంబాలకు సహాయం అందించేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతోందని చెప్పారు.

ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి

ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం ప్రకటించారు. తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని మాజీ మంత్రి సెంథిల్‌ బాలాజీ, ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రహనియన్‌, జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ముఖ్యమంత్రి స్వయంగా ఆదివారం కరూర్‌ ఆసుపత్రిని సందర్శించనున్నారు.

ర్యాలీ అనంతరం విజయ్‌ తన ప్రసంగాన్ని ముగించుకొని వెళ్లిపోయారు. అయితే, అక్కడి అభిమానుల భారీ గుంపు, ఒక్కసారిగా జరిగిన తోపులాట ఈ ఊహించని విషాదానికి దారితీసింది. ఈ దుర్ఘటనతో తమిళనాడు అంతటా తీవ్ర విషాదం నెలకొంది.

10వేల మందికి పర్మిషన్ ఇస్తే 2 లక్షల మంది రాక

టీవీకే పార్టీకి చెందిన కరూర్ కార్నర్ మీటింగ్ కు కేవలం 10 వేల మందికి మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చినప్పటికీ, నటుడు విజయ్ అభిమానులు.. పార్టీ కార్యకర్తలు దాదాపు 2 లక్షల మంది వరకు అనూహ్యంగా తరలివచ్చారు. అంత భారీ సంఖ్యలో జనం రావడంతో, సరిపడా స్థలం లేక తొక్కిసలాట లాంటి పరిస్థితి నెలకొంది. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది.

Tags:    

Similar News