కాఫీ తోటకు వెళ్లిన ఐపీఎస్ సతీమణి.. ఏనుగు దాడిలో దుర్మరణం

1991 బ్యాచ్ కు చెందిన నాగాలాండ్ క్యాడర్ ఐపీఎస్ అధికారి సునీల్ అచ్చయ్య. కర్ణాటకకు చెందిన ఆయన.. తన కెరీర్ లో అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించినందుకు రెండు ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్న ఆయన కుటుంబంలో ఈ విషాదం చోటు చేసుకుంది.

Update: 2026-06-05 18:15 GMT

షాకింగ్ ఉదంతం కర్ణాటకలో చోటు చేసుకుంది. సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ అచ్చయ్య సతీమణి సంధ్యా అచ్చయ్య.. తమ సొంత కాఫీ తోటకు వెళ్లిన వేళలో.. అనూహ్య రీతిలో ఏనుగు జరిపిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన విషాదం చోటు చేసుకుంది. 1991 బ్యాచ్ కు చెందిన నాగాలాండ్ క్యాడర్ ఐపీఎస్ అధికారి సునీల్ అచ్చయ్య. కర్ణాటకకు చెందిన ఆయన.. తన కెరీర్ లో అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించినందుకు రెండు ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్న ఆయన కుటుంబంలో ఈ విషాదం చోటు చేసుకుంది.

కర్ణాటక రాష్ట్రంలోని కూర్గ్ జిల్లా (కొడగు) పొన్నంపేట తాలూకా తిత్తిమతి ప్రాంతం పరిధిలోని కొననకట్టె గ్రామంలో వీరికి సొంత కాఫీ తోట ఉంది. వీరి పూర్వీకుల నుంచి వస్తున్న ఈ కాఫీ తోట ఎంత విస్తీర్ణంలో ఉందన్న వివరాలు అధికారికంగా వెల్లడి కాలేదు. ఈ ప్రైవేటు కాఫీ తోటకు సంధ్యా అచ్చయ్య తన వ్యక్తిగత సిబ్బంది (ఎస్టేట్ మేనేజర్, డ్రైవర్)తో కలిసి వెళ్లారు. అనూహ్య రీతిలో ఏనుగు జరిపిన దాడిలో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. దట్టమైన కాఫీ తోటల్లో ఫెన్సింగ్ బలంగా లేని కారణంగా ఏనుగులు తోటలోకి రావటం.. దాడులు చేయటం ఇటీవల కాలంలో పలు ఘోర ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.

తాజా ఉదంతానికి వస్తే.. కాఫీ తోటను పరిశీలించేందుకు వెళ్లిన సంధ్యా అచ్చయ్య టీంపై ఒంటరి ఏనుగు అనూహ్యంగా దాడికి పాల్పడింది. ఈ ఘటనలో మేనేజర్, డ్రైవర్ త్రుటిలో తప్పించుకోగా.. సంధ్యా అచ్చయ్య మాత్రం ఏనుగు నుంచి తప్పించుకోలేక తీవ్రంగా గాయపడ్డారు. ఆమెను వెంటనే గోనికొప్పల్ లోని ఆసుపత్రికి తరలిస్తుండగానే.. ఆమె మరణించారు. ఈ ఘోర ఘటనపై కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఉన్న ఐపీఎస్ అధికారి సునీల్ అచ్చయ్యకు ఫోన్ చేసి పరామర్శించారు.

కొడుగు ప్రాంతంలో ఇటీవల కాలంలో ఏనుగు దాడులు పెరిగాయి. ఏనుగు సంచారాన్ని అడ్డుకునేందుకు తక్షణమే కఠిన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక.. సునీల్ అచ్చయ్య విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన భారత విదేశీ నిఘా సంస్థ ‘రా’ లో రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ లో స్పెషల్ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంలో ఆయన డైరెక్టర్ జనరల్ ర్యాంక్ హోదా కలిగి ఉన్నారు. కొన్ని వార్తా కథనాల ఆధారంగా చూస్తే.. ఆయన ఐబీ/రా సంస్థలకు తదుపరి అధిపతి రేసులో ఉన్నట్లుగా చెబుతారు. షార్ట్ లిస్టు చేసిన జాబితాలో ఆయన పేరు ఒకటన్న మాట వినిపిస్తోంది. అత్యున్నత పదవికి అడుగు దూరంలో ఉన్న వేళలో అనూహ్య రీతిలో వీరి కుటుంబంలో జరిగిన విషాదం షాక్ కు గురి చేస్తోంది

నిజానికి 2022లో ఆయన్ను నాగాలాండ్ రాష్ట్ర డీజీపీగా ఎంపిక చేయాలని భావించినా.. ఆయన కేంద్ర సర్వీసుల్లో కొనసాగేందుకే మొగ్గు చూపినట్లుగా చెబుతారు. కేంద్ర సర్వీసుల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయన.. ఐపీఎస్ అధికారిగా అత్యున్నత ట్రాక్ రికార్డును కలిగి ఉన్నట్లుగా చెబుతారు. కాఫీ తోటల్లో ఏనుగులు దాడులు చేయటం ఇటీవల కాలంలో ఎక్కువైంది. కర్ణాటకలోని పశ్చిమ కనుమలు (వెస్ట్రన్ ఘాట్స్) పరిధిలోని కొడగు.. హాసన్.. చిక్కమగళూరు జిల్లాల్లో దట్టమైన అడవులు.. వాటి పక్కనే కాఫీ తోటలు ఒకదానికి మరొకటి ఆనుకొని ఉంటాయి.

ఇటీవల కాలంలో అడవుల్లో ఆహారం తగ్గటం.. నీరు తగ్గటంతో ఏనుగులు పక్కనే ఉండే కాఫీ తోటల్లోకి ప్రవేశిస్తున్నాయి. తాజా దుర్ఘటన జరిగిన కొడుగు జిల్లాల్లోనే గడిచిన ఐదేళ్లలో ఏనుగుల దాడుల కారణంగా 44 మంది ప్రాణాలు కోల్పోయిన దుస్థితి. ఈ ఏడాది ప్రారంభంలో కేవలం రెండు వారాల వ్యవధిలో ముగ్గురు స్థానికులు ఏనుగుల దాడిలో మరణించారు. ఇలా సాదాసీదా జీవితాలు ఏనుగుల దాడిలో అర్ధంతరంగా ముగిసిపోవటం మామూలే. అయితే.. అత్యున్నత స్థాయిలో ఉన్న అధికారి సతీమణి అనూహ్య రీతిలో ఏనుగు దాడిలో దుర్మరణం పాలు కావటం మాత్రం తీవ్ర విషాదానికి కారణమైందని చెప్పాలి.

Tags:    

Similar News