కుర్చీ పోరుకు కాసేపు విరామం.. సిద్ధూ, డీకే మధ్య వివాదానికి ఫుల్ స్టాప్!
కర్ణాటకలో కొద్ది రోజులుగా సాగుతున్న సీఎం సీటుపై సమరం ముగింపునకు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది.;
కర్ణాటకలో కొద్ది రోజులుగా సాగుతున్న సీఎం సీటుపై సమరం ముగింపునకు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య నుంచి అధికార బదిలీ కోరుకుంటున్న ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కాస్త మెత్తబడ్డారని ప్రచారం జరుగుతోంది. ఇద్దరి మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరుకోవడంతో కాంగ్రెస్ అధిష్టానం జోక్యం చేసుకుందని అంటున్నారు. దీంతో డీకేని బ్రేక్ ఫాస్ట్ కు ఆహ్వానించిన సీఎం సిద్ధరామయ్య తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని ప్రకటించారు. అంతేకాకుండా సీఎం పీఠంపై పేచీ కూడా లేదని చెప్పే ప్రయత్నం చేశారని అంటున్నారు. కాంగ్రెస్ అధిష్టానం జోక్యంతో వివాదాస్పదంగా మారిన అధికార బదిలీకి లైన్ క్లియర్ అయినట్లు కనిపిస్తోందని విశ్లేషిస్తున్నారు.
సీఎం సిద్ధరామయ్య, డీసీఎం డీకే శివకుమార్ మధ్య జరిగిన బ్రేక్ ఫాస్ట్ భేటీ జాతీయ రాజకీయాలను ఆకర్షించింది. ఈ రోజు ఉదయం కాంగ్రెస్ అధిష్టానం సూచనతో డీకే శివకుమార్ ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లారు. ఇన్నాళ్లు జోడెద్దుళ్లా కలిసి పనిచేసిన ఈ ముఖ్యనేతలు ఇద్దరు కొద్ది రోజులుగా పరోక్ష విమర్శలు చేసుకుంటూ వాతావరణాన్ని వేడిక్కెంచారు. అయితే బ్రేక్ ఫాస్ట్ భేటీ తర్వాత ఈ ఉద్రిక్తతలు మటుమాయమయ్యే పరిస్థితులు ఉన్నాయని వ్యాఖ్యానిస్తున్నారు. ఇక ఇద్దరు అల్పాహారం ముగించిన తర్వాత ఎక్స్ లో వేర్వేరుగా ట్వీట్లు చేశారు.
బ్రేక్ ఫాస్ట్ మీటింగ్లో పాల్గొన్న సీఎం సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ నాయకత్వ మార్పుపై ఆసక్తికరంగా స్పందించారు. ఈ అంశంపై పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తామిద్దరికీ ఆమోదయోగ్యమేనని ప్రకటించారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. అల్పాహార భేటీ తర్వాత ఇద్దరూ సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమారుతో ఎటువంటి విభేదాలు లేవని ముఖ్యమంత్రి సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడా తమ ఇద్దరి మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు రావని హామీ ఇచ్చారు. 2028లో జరగబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ను మరోసారి అధికారంలోకి తేవడం గురించి ఇద్దరం చర్చించుకున్నామని పేర్కొన్నారు. అలాగే త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల గురించి కూడా మాట్లాడుకున్నామని అన్నారు.
ఇక శివకుమార్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నాయకత్వ మార్పుపై పార్టీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. రేపటి నుంచి ఎలాంటి గందరగోళం ఉండదని ఇద్దరు నేతలు ఉమ్మడి ప్రకటన చేశారు. "బీజేపీ, జేడీఎస్లకు తప్పుడు ఆరోపణలు చేయడం అలవాటు. ఆ రెండు పార్టీలు మా ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం తీసుకువస్తామని ప్రకటనలు చేస్తున్నాయి. బీజేపీకి 60, జేడీఎస్ 18 సీట్లు ఉన్నారు. వారు మా ఎమ్మెల్యే సీట్లు 140కి దరిదాపుల్లో లేరు. విపక్షాల తప్పుడు ఆరోపణలకు దీటుగా బదులిస్తాం. నాకు తెలిసినంత వరకు కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు కావాలని కోరుకుంటున్నారు. వారు హైకమాండ్ను కలవడానికి వెళ్లి ఉండొచ్చు. అంటే వారు నాయకత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని కాదు. వారిలో కొందరు నాతో మాట్లాడారు. దిల్లీకి ఎందుకు వెళ్లారో చెప్పారు. హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా మేము దానికి కట్టుబడి ఉంటాం" అని సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు.