కపిల్‌ శర్మ కేఫ్‌పై ఖలిస్థానీ ఉగ్రవాది ఎందుకు కాల్పులు జరిపాడు? అసలేంటి కథ?

కపిల్‌ శర్మ హోస్ట్ చేస్తున్న ప్రముఖ హాస్య కార్యక్రమంలో ఒక సెగ్మెంట్‌లో నిహంగ్‌ సింగ్‌ల వేషధారణను హాస్యంగా ప్రదర్శించడంపై సిక్కు సమాజంలో విమర్శలు వెల్లువెత్తాయి.;

Update: 2025-07-11 19:30 GMT

కెనడాలోని బ్రిటిష్‌ కొలంబియాలోని సర్రీ నగరంలో ప్రముఖ హాస్యనటుడు కపిల్‌ శర్మకు చెందిన రెస్టారెంట్‌ 'కాప్స్‌ కేఫ్‌'పై జరిగిన కాల్పుల ఘటన అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది. జూలై 9వ తేదీ రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఈ కేఫ్‌పై కాల్పులకు తెగబడగా, 12 రౌండ్ల కాల్పులు జరిగినప్పటికీ అదృష్టవశాత్తు ఎవరూ గాయపడలేదని పోలీసులు తెలిపారు.

ఈ ఘటనకు సంబంధించి తీవ్ర ఉగ్రవాద చరిత్ర కలిగిన ఖలిస్థానీ ఉగ్రవాది హర్జీత్‌ సింగ్‌ లడ్డీ బాధ్యత వహిస్తున్నట్టు స్వయంగా ప్రకటించడంతో భయాందోళనలు మరింత పెరిగాయి. లడ్డీ ఖలిస్థానీ ఉగ్రసంస్థ బబ్బర్‌ ఖల్సా ఇంటర్నేషనల్‌కు చెందినవాడు. భారత జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) మోస్ట్‌ వాంటెడ్‌ జాబితాలో అతని పేరు ఉంది. భారత ప్రభుత్వం అతని తలపై రూ.10 లక్షల రివార్డు కూడా ప్రకటించింది.

-హర్జీత్‌ సింగ్‌ లడ్డీ నేపథ్యం

పంజాబ్‌లోని నంగల్‌ ప్రాంతంలో 2024 జూన్‌లో జరిగిన విశ్వహిందూ పరిషత్‌ నేత వికాస్‌ ప్రభాకర్ హత్య కేసులో లడ్డీ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులో కుల్బీర్‌ సింగ్‌ అలియాస్‌ సిద్ధూతో పాటు మరికొందరు నిందితులుగా పోలీసులు గుర్తించారు. భారత్‌లో అనేక దేశవిరోధక కేసుల్లో లడ్డీపై ఆరోపణలున్నాయి.

- దాడికి కారణం ఏమిటి?

కపిల్‌ శర్మ హోస్ట్ చేస్తున్న ప్రముఖ హాస్య కార్యక్రమంలో ఒక సెగ్మెంట్‌లో నిహంగ్‌ సింగ్‌ల వేషధారణను హాస్యంగా ప్రదర్శించడంపై సిక్కు సమాజంలో విమర్శలు వెల్లువెత్తాయి. నిహంగ్‌ సింగ్‌లు సిక్కు సంప్రదాయంలో ప్రత్యేకమైన స్థానం కలిగిన పవిత్ర వర్గం. వారి హుందాతనాన్ని హాస్యం పేరిట కించపరిచారన్న ఆరోపణలపై కొన్ని సిక్కు సంఘాలు కపిల్‌ శర్మను విమర్శించాయి.

ఈ విమర్శల నేపథ్యంలో "మేము పలుమార్లు కపిల్‌ మేనేజర్‌ను సంప్రదించేందుకు ప్రయత్నించాం కానీ స్పందన రాలేదు. కపిల్‌ శర్మ బహిరంగంగా క్షమాపణ చెప్పాలి" అని ఒక ఆన్‌లైన్‌ ప్రకటనలో డిమాండ్‌ చేశారు. దీనికి స్పందన రాకపోవడంతో రెచ్చిపోయిన దుండగులు కాఫేపై కాల్పులకు పాల్పడినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

- పోలీసుల దర్యాప్తు

దాడి సమాచారం అందుకున్న సర్రే పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని ఫోరెన్సిక్‌ బృందాలతో ఆధారాలు సేకరిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు వారు అధికారికంగా ఏ నిందితుడి పేరు ప్రకటించలేదు. దర్యాప్తు కొనసాగుతున్నదని, త్వరలో పూర్తి వివరాలు వెల్లడి చేస్తామని పోలీసు అధికారులు పేర్కొన్నారు.

ఈ ఘటనతో భారతీయ సమాజం, ముఖ్యంగా సిక్కు సంఘాలు, తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఖలిస్థానీ ఉగ్రవాదుల బెదిరింపులు విదేశాల్లోకి విస్తరించడంపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని పౌరసంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏమిటి?

Tags:    

Similar News