రాజు గారు పత్తా లేకుండా పోయారే ?

ఎలమంచిలిలో కాపులు ఎక్కువ. సామాజిక వర్గం పరంగానే ఇక్కడ విజయావకాశాలను ప్రభావితం చేసేందుకు వీలు అవుతుంది.

Update: 2026-06-06 03:37 GMT

ఉమ్మడి విశాఖ జీల్లాలో ఆ రాజు గారు సీనియర్ నేత. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వారు. పలుకుబడి కూడా బాగా ఉన్న నాయకుడు. అలాంటి రాజు గారు ఇపుడు పత్తా లేకుండా పోయారు అన్న చర్చ సాగుతోంది. ఆయన ఎవరో కాదు ఎలమంచిలి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు. వైఎస్సార్ చలవతో 2004లో తొలిసారి కాంగ్రెస్ నుంచి గెలిచిన కన్నబాబు రాజు మరో దఫా 2009 లోనూ విజయ కేతనం ఎగురవేశారు. ఆ తరువాత వైఎస్సార్ మరణంతో పాటు కాంగ్రెస్ ఏపీలో పతనం చెందడంతో ఆయన టీడీపీ గూటికి చేరుకున్నారు. 2014లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చూసినా కన్నబాబు రాజుకు టికెట్ దక్కలేదు. ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పినా అది కూడా నెరవేరలేదు. దాంతో ఆయన వైసీపీ వైపు వచ్చారు. అలా 2019లో వైసీపీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు.

కుమారుడి కోసమే అంతా :

ఇదిలా ఉంటే తన రాజకీయ వారసుడిగా కుమారుడు సుకుమార్ వర్మకు 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ని ఆయన ఆశించారు. ఈ మేరకు వైసీపీ అధినాయకత్వాన్ని కోరారు అని కూడా చెబుతున్నారు. అయితే కన్నబాబు రాజుకే తిరిగి టికెట్ ఇచ్చారు. కూటమి ప్రభంజనంలో కన్నబాబు రాజు ఓటమి పాలు అయ్యారు. ఇక పార్టీ ఓడిన తరువాత ఆయన పెద్దగా యాక్టివిటీస్ లో పాలు పంచుకోకపోవడంతో ఆ నియోజకవర్గ ఇంచార్జిగా ఆయనను పక్కన పెట్టేసింది వైసీపీ అధినాయకత్వం. ఆ ప్లేస్ లో మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కి అవకాశం ఇచ్చారు. అలా ఇంచార్జిగా ధర్మశ్రీని నియమించినా కన్నబాబు రాజు నుంచి సహకారం అయితే లభించడం లేదని అంటున్నారు.

సామాజిక కోణంలోనే :

ఎలమంచిలిలో కాపులు ఎక్కువ. సామాజిక వర్గం పరంగానే ఇక్కడ విజయావకాశాలను ప్రభావితం చేసేందుకు వీలు అవుతుంది. వైసీపీ విషయానికి వస్తే 2014లో గవర సామాజిక వర్గానికి చెందిన వారికి టికెట్ ఇచ్చిది. ఓటమి పాలు అయింది. 2019లో కన్నబాబు రాజుకు టికెట్ ఇచ్చింది అయితే జగన్ వేవ్ లో వైసీపీ విజయం సాధ్యపడింది అని గుర్తు చేస్తున్నారు. 2024 నాటికి టీడీపీ కూటమిగా బలంగా ముందుకు రావడం బలమైన కాపు సామాజిక వర్గం నుంచి జనసేన అభ్యర్ధికి టికెట్ ఇవ్వడంతో సునాయాసంగా విజయం దక్కింది. ఈ సమీకరణలను పరిశీలించిన వైసీపీ తమ పార్టీ నుంచి కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత ధర్మశ్రీని ఎంపిక చేసింది.

ఒంటరి పోరాటమేనా :

అయితే కన్నబాబు రాజుకు చెప్పుకోదగిన బలం ఉంది. ఆయన సహాయం అయితే వైసీపీకి అందడం లేదు. పైగా ఫుల్ సైలెంట్ మోడ్ లో రాజు గారు ఉంటున్నారు అని అంటున్నారు. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నందున తన కుమారుడి రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అప్పటి వేళకు ఒక కీలక నిర్ణయం తీసుకోవచ్చు అన్న ఆలోచనలో రాజు గారు ఉన్నట్లుగా చెబుతున్నారు. వైసీపీ సమావేశాలలో అయితే ఆయన ఎక్కడా కనిపించడం లేదు. దాంతో ఆయన వైసీపీకి దూరంగా ఉన్నట్లేనా అన్న చర్చ సాగుతోంది. ఆయన వైసీపీకి దూరం అయితే రాజకీయంగా ఇబ్బంది అని అంటున్నారు అయితే కరణం ధర్మశ్రీ ఏ మేరకు పార్టీని పటిష్టం చేస్తారు అన్న దాని మీదనే అక్కడ ఫ్యాన్ తిరిగేది ఆధారపడి ఉందని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News