మండలికి మారిన సీన్.. బీఆర్ ఎస్ రచ్చ!
అయితే.. సభలో చోటు చేసుకున్నట్టే.. మండలిలోనూ బీఆర్ ఎస్ సభ్యులుతీవ్రంగా వ్యతిరేకించారు. ఈ రిపోర్టులో పసలేదన్నారు.;
తెలంగాణ శాసన మండలిలో రచ్చ చోటు చేసుకుంది. బీఆర్ ఎస్ సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ .. మండలి చైర్మన్ పోడియంను చుట్టుముట్టారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్టును వ్యతిరేకించారు. ఇది పీసీసీ రిపోర్టు అని.. కేసీఆర్ రాజకీయాలను ఎదుర్కొనలేక.. ఆయనపై కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నా రని సభ్యులు విమర్శలు గుప్పించారు. కాగా.. అసెంబ్లీలో ఆదివారం అర్ధరాత్రి వరకు కూడా ఈ రిపోర్టుపై చర్చ సాగింది. సోమవారం.. ఈ వ్యవహారం మండలికి చేరింది.
అయితే.. సభలో చోటు చేసుకున్నట్టే.. మండలిలోనూ బీఆర్ ఎస్ సభ్యులుతీవ్రంగా వ్యతిరేకించారు. ఈ రిపోర్టులో పసలేదన్నారు. అసలు చర్చ చేపట్టేందుకు కూడా వీల్లేదని పేర్కొంటూ.. పలువురు బీఆర్ ఎస్ సభ్యులు వాగ్వాదానికి దిగారు.ఈ క్రమంలో అధికార పక్ష సభ్యులు కూడా అంతే దూకుడుగా ఎదురుదాడి చేశారు. అదేసమయంలో ఎవరిని అడిగి ఈ కేసును సీబీఐకి అప్పగిస్తున్నారని.. ప్రశ్నించారు. ఎలాంటి చర్చ చేపట్టకుండా.. ప్రతిపక్షాన్ని సభ నుంచి తరిమేసి.. ఇష్టానుసారం చేస్తారా? అంటూ నిలదీశారు.
ఈ క్రమంలో ఆవేశానికి గురైన కొందరు బీఆర్ ఎస్ సభ్యులు.. కమిషన్ రిపోర్టు పత్రాలను చింపేసి.. చైర్మన్ పైకి విసిరారు. కాగా.. తీవ్ర వివాదం చోటు చేసుకోవడంతో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వారి తీరును తప్పుబట్టారు. పోడియంలోకి దూసుకువచ్చిన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండలిలో హుందాగా వ్యవహరించాలని.. బజారు రాజకీయాలు చేయొద్దని ఆయన కోరారు. అయినప్ప టికీ.. బీఆర్ ఎస్ సభ్యులు శాంతించలేదు.
ఈ గందరగోళం నడుమే చైర్మన్.. సుఖేందర్ రెడ్డి కీలక బిల్లుల ప్రవేశానికి అనుమతించారు. దీంతో మంత్రులు.. పంచాయతీరాజ్ సవరణ బిల్లు(ఆదివారం అసెంబ్లీలో చర్చించిందే!).. ను ప్రవేశ పెట్టారు. అదేవిధంగా గత సభలోనే చర్చ పూర్తయిన.. అల్లోపతి ప్రైవేటు వైద్య సంరక్షణ సంస్థల చట్టం రద్దు బిల్లులను కూడా ప్రవేశ పెట్టారు. అయితే.. బిల్లు అలా పెట్టగానే.. ఎలాంటి చర్చ లేకుండానే సభ ఆమోదం పొందిందని.. చైర్మన్ ప్రకటించారు.