కదిరి టీడీపీలో సిద్దారెడ్డి రగడ..?
వైసీపీ నుంచి జంపింగ్‌లు స్టార్ట్ అయ్యాయి. కదిరి మాజీ ఎమ్మెల్యే సిద్ధారెడ్డి టిడిపిలోకి చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు;
వైసీపీ నుంచి జంపింగ్‌లు స్టార్ట్ అయ్యాయి. కదిరి మాజీ ఎమ్మెల్యే సిద్ధారెడ్డి టిడిపిలోకి చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల వైసీపీ ఆయనపై వేటు వేసిన విషయం తెలిసిందే. నిజానికి తాజాగా జరిగిన ఎన్నికల్లో వైసిపి ఆయనకు టికెట్ ఇవ్వలేదు. 2019లో విజయం దక్కించుకున్న ఆయన మంత్రివర్గంలో సీటు కోసం ప్రయత్నించిన విషయం తెలిసిందే. అటు మంత్రి వర్గంలో సీటు దక్కలేదు. కానీ ఇటీవల ఎమ్మెల్యే టికెట్ అయినా కొనసాగిస్తారని ఆశలు పెట్టుకున్నా అది కూడా సిద్ధారెడ్డికి లభించలేదు. సిద్ధారెడ్డి ప్లేస్ లో వేరే వారికి అవకాశం ఇస్తూ మైనారిటీ అభ్యర్థిని జగన్మోహన్ రెడ్డి నిలబెట్టారు.
ఈ పరిణామాలతో సిద్ధారెడ్డి కూటమి పార్టీలకు అనుకూలంగా పని చేశారనేది వైసీపీ చెపుతున్న మాట. ఈ నేపథ్యంలోనే ఫలితాలు వచ్చిన నెల రోజుల తర్వాత.. ఆయనపై చర్యలు తీసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. దీంతో సిద్ధారెడ్డి ఓపెన్ అయ్యారు. పార్టీనే నేతలకు అన్యాయం చేసిందని, తాను పార్టీకి అన్యాయం చేయలేదని చెప్పుకొచ్చారు. 2014లో గెలిచిన అక్తర్ చాంద్ భాషా పార్టీని వదిలేసిన తాను పార్టీని డెవలప్ చేశానని, గడిచిన 10 సంవత్సరాలలో పార్టీ కోసం అనేక నిధులు ఖర్చు పెట్టానని, అప్పుల పాలయ్యానని చెప్పుకొచ్చారు.
ఈ పార్టీలో ఉండటం ఇక, తన వల్ల కాదని కూడా సిద్దారెడ్డి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఆయన టిడిపిలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు టిడిపిలో కదిరి ఎమ్మెల్యేగా ఉన్న కందికుంట వెంకటప్రసాద్ ఈ వ్యవహారాలతో ఇబ్బంది పడే పరిణామాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే అక్తర్ చాంద్ భాష 2014లో గెలిచి టిడిపిలోకి వచ్చారు. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే గా ఉన్న సిద్ధారెడ్డి కూడా టిడిపిలోకి వస్తే ఇక్కడ ఆధిపత్యం పోరు లేదా పార్టీలో వర్గ పోరు పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
అందుకే కందికుంట వెంకటప్రసాద్ కు ఈ పరిణామం ఇబ్బందిగా మారింది. పార్టీని డెవలప్ చేసేందుకు ఇతర పార్టీల నుంచి నాయకులను తీసుకునేందుకు అధిష్టానం నుంచి సంకేతాలు వస్తున్నప్పటికీ సిద్ధారెడ్డి విషయంలో కందికుంట ఏం చేస్తారనేది ఆసక్తిగా మారింది. దాదాపు మూడు నాలుగు ఎన్నికల తర్వాత కందికుంట వెంకటప్రసాద్ ఇక్కడ విజయం దక్కించుకున్నారు. ఇప్పుడు కొత్తవారిని పార్టీలోకి తీసుకోవడంతో వర్గ పోరు పెరిగితే ఆయనకు పాలనాపరంగా సంక్షేమ పరంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది.
పోనీ.. వెంకటప్రసాద్ అందరినీ కలుపుకొని వెళ్లేందుకు ప్రయత్నం చేసినా ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకుల మనస్తత్వం ఎట్లా ఉంటుందనేది ఆయనను కొంత ఇబ్బంది పెడుతున్న అంశం. మరి చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారా? లేదు వచ్చిన వారిని వచ్చినట్టు తీసేసుకుంటారా? అనేది చూడాలి. వచ్చిన వారిని వచ్చినట్టు తీసుకుంటే వర్గ పోరు పెరిగితే అది పార్టీకే నష్టం అనే విషయం క్షేత్రస్థాయిలో నాయకులు చెబుతున్న మాట. ఇక, సిద్ధారెడ్డి లాంటి నాయకులు చాలామంది కనిపిస్తున్నారు. మరి కొద్ది రోజులు గడిస్తే ఇంకొంతమంది నాయకులపై పార్టీ వేటు వేయడం వారందరూ బయటకు రావడం స్పష్టంగా కనిపిస్తున్న సంకేతాలు.