చీకట్లో ఒంటరిగా ఉన్నాను.. డబ్బులు పంపండి... ట్రంప్ 'వార్ రూమ్' డ్రామా

సాధారణంగా రాజకీయ విరాళాల కోసం పంపే మెయిళ్లు అభ్యర్థన పూర్వకంగా ఉంటాయి. కానీ ట్రంప్ మార్క్ మెయిల్ మాత్రం ఒక హాలీవుడ్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది.;

Update: 2026-01-14 06:27 GMT

అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టి ఏడాది గడుస్తున్నా డొనాల్డ్ ట్రంప్ చుట్టూ వివాదాలు తగ్గడం లేదు. ఒకవైపు 'బిగ్ బ్యూటిఫుల్ బిల్'పై విమర్శలు మరోవైపు న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బలతో సతమతమవుతున్న ట్రంప్.. ఇప్పుడు తన దృష్టిని 2026 నవంబర్ మిడ్‌టర్మ్ ఎన్నికలపై సారించారు. ఈ క్రమంలో ఆయన మద్దతుదారులకు పంపిన ఒక ఈమెయిల్ ఇప్పుడు సోషల్ మీడియాలో నవ్వులపాలు కావడమే కాకుండా, తీవ్ర చర్చకు దారితీసింది.

'టిక్.. టిక్.. టిక్..' - మెయిల్‌లో సినిమా లెవల్ సస్పెన్స్!

సాధారణంగా రాజకీయ విరాళాల కోసం పంపే మెయిళ్లు అభ్యర్థన పూర్వకంగా ఉంటాయి. కానీ ట్రంప్ మార్క్ మెయిల్ మాత్రం ఒక హాలీవుడ్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. ‘అంధకారంలో ఒంటరి’ అనే టైటిల్‌తో మొదలైన ఈ మెయిల్‌లో ట్రంప్ తన పరిస్థితిని అత్యంత దైన్యంగా వర్ణించుకున్నారు. నేను ఇప్పుడు వార్ రూమ్‌లో ఒంటరిగా కూర్చున్నాను. నా ల్యాప్‌టాప్ డెడ్ అయిపోయింది. 72 గంటల డెడ్‌లైన్ టిక్ టిక్ మంటూ దగ్గర పడుతోంది అంటూ రాసుకొచ్చారు. రాడికల్ లెఫ్ట్ వింగ్‌ డెమోక్రాట్లు దేశ సరిహద్దులను తెరిచేస్తారని, గన్ కల్చర్‌తో హింసను పెంచుతారని పిల్లలను బ్రెయిన్‌వాష్ చేస్తారని హెచ్చరించారు. ఒకవేళ విరాళాలు అందక ఎన్నికల్లో గెలవకపోతే తనపై మరోసారి 'తప్పుడు అభిశంసన ప్రయోగిస్తారని తన మద్దతుదారులను ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేసే ప్రయత్నం చేశారు. ప్రతి రెడ్-బ్లడెడ్ అమెరికన్ నిజమైన దేశభక్తుడు వెంటనే 47 డాలర్ల విరాళం పంపాలి అని ఆ మెయిల్‌లో ట్రంప్ కోరారు.

సోషల్ మీడియాలో ట్రోలింగ్.. బిలియనీర్ బెగ్గర్!

ఈ మెయిల్‌ను డెమోక్రాట్ ఇన్‌ఫ్లూయెన్సర్ హ్యారీ సిస్సన్ ఎక్స్‌ వేదికగా పంచుకోవడంతో ఇది కాస్తా వైరల్‌గా మారింది. నెటిజన్లు ట్రంప్ తీరుపై విరుచుకుపడుతున్నారు. ల్యాప్‌టాప్ చార్జింగ్ పెట్టుకోవడానికి డబ్బులు లేవా? అని కొందరు ఎద్దేవా చేస్తుంటే.. కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్న వ్యక్తి, సామాన్యులను 47 డాలర్లు అడగడం సిగ్గుచేటు అని మరికొందరు మండిపడుతున్నారు. ఇది పొలిటికల్ మెయిల్ లా లేదు.. ఏదో స్కామర్ పంపిన మెయిల్ లా ఉంది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

మిడ్‌టర్మ్ ఎన్నికలు.. ట్రంప్ భవిష్యత్తుకు అగ్నిపరీక్ష

79 ఏళ్ల వయసులో ఉన్న ట్రంప్‌కు ఈ మిడ్‌టర్మ్ ఎన్నికలు జీవన్మరణ సమస్యగా మారాయి. హౌస్, సెనెట్‌లపై పట్టు కోల్పోతే ఆయన పాలన కుంటుపడటమే కాకుండా భవిష్యత్తులో మూడోసారి పోటీ చేసే అవకాశాలు కూడా దెబ్బతింటాయి. అందుకే ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్న తరుణంలో 'భయం' అనే ఆయుధాన్ని వాడి ఫండ్స్ వసూలు చేయాలని ఆయన చూస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

మొత్తానికి ట్రంప్ పంపిన ఈ 'డ్రామాటిక్ మెయిల్' అమెరికా రాజకీయాల్లో వేడిని పెంచడమే కాకుండా ఎన్నికల ప్రచారం ఏ స్థాయికి దిగజారిందో చెప్పకనే చెబుతోంది.


Tags:    

Similar News