వైసీపీ 'కడప కుస్తీ'.. వికెట్లు ఔట్!
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ సొంత జిల్లా కడపలో రాజకీయ కుస్తీ జరుగుతోంది.;
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ సొంత జిల్లా కడపలో రాజకీయ కుస్తీ జరుగుతోంది. వైసీపీ నాయకులు ఒక్కొక్కరుగా కాదు.. మూకుమ్మడిగా ఆ పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు. మరోవైపు కడప మేయర్ పదవి కూడా పార్టీ చేజారిపోయింది. తాజాగా శాసన మండలి డిప్యూటీ చైర్మన్, మైనారిటీ నాయకురాలు.. రాయచోటికి చెందిన జకియా ఖానుం సైతం పార్టీకి రాజీనామా చేసి బీజేపీ పంచన చేరిపోయారు. ఇక్కడితో అయినా.. కడప కుస్తీ ఆగిందా? అంటే లేదు.
తాజాగా కీలకమైన మైదుకూరు నియోజకవర్గంలో మరో పరిణామం చోటు చేసుకుంది. మైదుకూరు మునిసిపల్ చైర్మన్ చంద్ర వైసీపీకి రాజీనామా చేశారు. కడపలో అంటే.. మేయర్ అవినీతి చేశారు. ఆయన కుటుంబానికి నామినేటెడ్ పద్ధతిలో రూ.36 లక్షల కాంట్రాక్టులు ఇచ్చి.. ప్రజలను మోసం చేశారన్న అభియోగాలతో ఆయనను తొలగించారు. దీనికి ఒక రీజన్ ఉంది. కానీ.. మైదుకూరుకు వచ్చే సరికి మాత్రం అధినేత జగన్ ఉదాశీనత.. లోకల్ లీడర్ల నాయకత్వ లోపంతో చంద్ర పార్టీకి దూరమయ్యారు.
మైదుకూరులో వైసీపీ స్థానికంగా విజయం దక్కించుకుంది. అయితే.. పనులు చేపట్టే క్రమంలో కొన్ని ఇబ్బందులు వస్తున్నాయని.. వాటిపై జగన్‌తో చర్చించాలని చంద్ర కోరుతున్నారు. కానీ.. స్థానిక నాయకులు ఆయన మాట వినిపించుకోవడం లేదు. ఈ క్రమంలో నేరుగా ఆయన ఒకటి రెండు సార్లు తాడేపల్లికి వచ్చారు.(ఆయన చెప్పిందే). అయితే.. ఇక్కడ కూడా జగన్ దర్శనం కాలేదు. ఇలా వేచి చూసి.. ఇక వేసారి పోయి.. ఏకంగా పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో కీలకమైన కడపలో వైసీపీ ఘోర పరాజయాల బాట నుంచి పతనావస్థకు చేరుతోందని అంటున్నారు పరిశీలకులు.