కడపలో కంటిన్యూ అవుతున్న కుర్చీ వివాదం!
గత రెండు సమావేశాల్లో ఇదే విషయమై కార్పొరేషన్ సాధారణ సమావేశంలో రచ్చ జరిగిన విషయం తెలిసిందే.;
కడప కార్పొరేషనులో వైసీపీ మేయర్ సురేశ్ బాబు, టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి మధ్య కుర్చీ వివాదం కొనసాగుతోంది. గత రెండు సమావేశాల్లో ఇదే విషయమై కార్పొరేషన్ సాధారణ సమావేశంలో రచ్చ జరిగిన విషయం తెలిసిందే. మేయర్ కుర్చీ పక్కనే తనకు సీటు కేటాయించాల్సిందిగా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ మాధవీరెడ్డి పంతం పట్టారు. దీంతో ఈ రోజు జరగాల్సిన సమావేశంలో మేయర్ సీటు పక్కన ఇరువైపులా ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలకు సీట్లు కేటాయించారు. దీంతో వైసీపీ మేయర్ సురేశ్ బాబు సమావేశ మందిరానికి రాకుండా తన కార్యాలయంలో ఉండిపోయారు.
నిబంధనల ప్రకారం పోడియంపై మేయర్ సీటు మాత్రమే ఉండాలని వైసీపీ వాదిస్తోంది. అయితే తాము శాసనసభ్యులు అయినందున మేయర్ పక్కన తమకు సీట్లు వేయాలని టీడీపీ ఎమ్మెల్యే మాధవీరెడ్డి కోరుతున్నారు. గత సమావేశంలో కుర్చీ వేయకపోవడంపై ఆమె నిల్చొనే ఉండిపోయారు. గత ప్రభుత్వంలో అప్పటి ఎమ్మెల్యే, ఎంపీలకు మేయర్ పక్కన సీటు వేసేవారని, ఇప్పుడు ఎందుకు కుర్చీ వేయడం లేదని ఎమ్మెల్యే మాధవీరెడ్డి ప్రశ్నిస్తున్నారు.
ఎమ్మెల్యే మాధవిరెడ్డి సూచన మేరకు శుక్రవారం నిర్వహిస్తున్న కార్పొరేషన్ సమావేశానికి పాత పద్ధతిలోనే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు అధికారులు కుర్చీలు వేశారు. మేయర్ సీటుకి ఇరువైపులా రెండేసి కుర్చీలు వేసి కడప, కమలాపురం ఎమ్మెల్యేలు మాధవీరెడ్డి, పుత్తా చైతన్యరెడ్డి, ఎమ్మెల్సీలు రాంభూపాల్ రెడ్డి, రామచంద్రయ్యలకు కేటాయించారు. అయితే తనకు తెలియకుండా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వేదికపై కుర్చీలు వేయడంపై వైసీపీ మేయర్ సురేశ్ బాబు కినుక వహించారు.
సమావేశ మందిరానికి రాకుండా తన చాంబర్ లో ఉండిపోయారు. 38 మంది వైసీపీ కార్పొరేటర్లతో తన చాంబరులోనే సమావేశం నిర్వహిస్తానని మేయర్ కమిషనర్ కి సమాచారమిచ్చారు. అయితే నిబంధనల ప్రకారం అలా నిర్వహించకూడదని అధికారులు చెప్పారు. సమావేశ మందిరానికి రావాల్సిందిగా మేయర్ తో చర్చిస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యే మాధవిరెడ్డి టీడీపీ కార్పొరేటర్లతో సమావేశ మందిరానికి వచ్చారు. తనకు కేటాయించిన సీటులో కూర్చొన్నారు. దీంతో కడప నగర పాలిక రాజకీయం రసవత్తరంగా మారింది.