జగన్-జూ.ఎన్టీఆర్.. కేతిరెడ్డి లీక్స్.. ఏపీలో సంచలనం

ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని వైయస్ జగన్ మోహన్ రెడ్డి కోరుకుంటున్నారా? అన్న ప్రశ్నకు కేతిరెడ్డి ఆసక్తికర సమాధానం ఇచ్చారు.;

Update: 2026-01-08 07:04 GMT

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి జూనియర్ ఎన్టీఆర్ పేరు హాట్ టాపిక్‌గా మారింది. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీశాయి. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశంపై చాలాకాలంగా కొనసాగుతున్న ఊహాగానాలకు ఆయన వ్యాఖ్యలు కొత్త ఊపునిచ్చాయి.

ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని వైయస్ జగన్ మోహన్ రెడ్డి కోరుకుంటున్నారా? అన్న ప్రశ్నకు కేతిరెడ్డి ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో జూనియర్ ఎన్టీఆర్ కొత్త ముఖమని, ఆయన రాజకీయాల్లోకి వస్తే రాజకీయాలు ఈ స్థాయిలో దిగజారేవి కావని జగన్ కూడా భావించి ఉండవచ్చని వ్యాఖ్యానించారు.

ఇదే సందర్భంలో తెలుగుదేశం పార్టీలో 70 నుంచి 80 శాతం మంది జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారని కేతిరెడ్డి వెల్లడించారు. ఎన్టీఆర్ కుటుంబానికి నిజమైన వారసుడు ఆయనే అన్న భావన ఆ వర్గాల్లో బలంగా ఉందన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కూడా కేతిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతల్లో 80 నుంచి 90 శాతం మంది తెలంగాణలో భారత రాష్ట్ర సమితి విజయం సాధించాలని కోరుకుంటున్నారని చెప్పారు. అలాగే బీఆర్ఎస్‌లోని మెజారిటీ నేతలు ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ గెలవాలని ఆకాంక్షిస్తారని పేర్కొన్నారు. దీనికి కేసీఆర్, కేటీఆర్ లకు జగన్‌తో ఉన్న సంబంధాలు.. అలాగే రేవంత్ రెడ్డి, చంద్రబాబులను ఓడించాలనే లక్ష్యమే కారణమని వ్యాఖ్యానించారు.

గతంలో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం నిర్వహించారు. ముఖ్యంగా 2009 ఎన్నికల సమయంలో రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించి ప్రచారంలో పాల్గొన్నారు. అయితే ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో టీడీపీకి, జూనియర్ ఎన్టీఆర్‌కు మధ్య దూరం పెరిగింది. అప్పటి నుంచి ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

అయినా కూడా వివిధ సందర్భాల్లో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని పెద్దఎత్తున డిమాండ్ వస్తూనే ఉంది. కానీ ఈ అంశంపై ఆయన ఇప్పటివరకు స్పష్టమైన స్పందన ఇవ్వలేదు. తాజాగా కేతిరెడ్డి వ్యాఖ్యలతో ఈ చర్చ మరోసారి తెరపైకి రావడం, ఏపీ రాజకీయాల్లో కొత్త కలకలం రేపుతోంది.

Tags:    

Similar News