'జూబ్లీహిల్స్'పై బీఆర్ఎస్ ఫైనల్ డెసిషన్.. అభ్యర్థి ఎవరంటే..?

మాగంటి కుటుంబ సభ్యులతోపాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీకి చాలామంది ఉవ్విళ్లూరుతున్నారు.;

Update: 2025-07-26 14:38 GMT

తెలంగాణలో త్వరలో జరగబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు తన అభ్యర్థిని ప్రతిపక్ష బీఆర్ఎస్ ఫైనల్ చేసిందనే టాక్ వినిపిస్తోంది. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మికంగా మరణించడంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది. ప్రతిపక్షం బీఆర్ఎస్ సిట్టింగు స్థానమైన ‘జూబ్లీహిల్స్’ను నిలబెట్టుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇక్కడ గెలుపు ఆ పార్టీకి జీవనర్మరణ పోరాటంగా భావిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఓటమిని మూటగట్టుకున్న బీఆర్ఎస్.. పార్లమెంటు ఎన్నికల్లో చావు దెబ్బ తిన్నది. ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలంటే జూబ్లీహిల్స్ స్థానాన్ని నిలబెట్టుకోవడం ఆ పార్టీకి అత్యంత ప్రాధానంగా చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో సరైన అభ్యర్థిని రంగంలోకి దింపాలని బీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. ఎమ్మెల్యే మరణించిన మరుక్షణం నుంచి జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎవరు అవుతారనేది చర్చకు దారితీస్తోంది.

గత ఎన్నికల్లో ఏం జరిగింది?

అనుకోకుండా ఉప ఎన్నిక వచ్చిన జూబ్లీహిల్స్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని అధికార కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గం నుంచి గతంలో మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ను బరిలోకి దింపింది. అయితే అభ్యర్థి ఎంపిక ఆలస్యం అవడం, క్షేత్రస్థాయి రాజకీయాలు తెలియకపోవడంతో అజ్జూ భాయ్ గత ఎన్నికల్లో గట్టెక్కలేకపోయారు. మరోవైపు 2014 నుంచి గెలుస్తూ వచ్చిన గోపీనాథ్ అనుభవం కూడా బీఆర్ఎస్ కు అక్కరకు వచ్చిందని చెబుతారు. బీఆర్ఎస్ కు, మాగంటి కుటుంబానికి ఈ నియోజకవర్గంలో గట్టి పట్టు ఉండటంతో గత ఎన్నికల్లో సునాయాశంగా గెలిచారన్న విశ్లేషణలు ఉన్నాయి. మరోవైపు ఎమ్మెల్యే మరణంతో ఖాళీ అయిన ఈ స్థానాన్ని తమ కుటుంబానికే కేటాయించాలని మాగంటి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

పోటీకి మాగంటి కుటుంబం సై..

ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ బతికి ఉండే వరకు ఆ కుటుంబం నుంచి ఎవరూ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనలేదు. గోపీనాథ్ విజయం కోసం ఆయన సోదరుడు మాగంటి వజ్రనాథ్ మాత్రం ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొనేవారు. అంతకుమించి ఆ కుటుంబంలో ఎవరూ రాజకీయాల్లో లేరని చెబుతారు. అయితే గోపీనాథ్ మరణంతో ఆ స్థానం కోసం కుటుంబం ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తమ్ముడు మరణంతో తాను ఎమ్మెల్యే కావాలని మాగంటి వజ్రనాథ్ భావిస్తున్నారు. బీఆర్ఎస్ అధిష్టానంతో ఆయన ఇప్పటికే సంప్రదించినట్లు చెబుతున్నారు. కానీ, మాగంటి సతీమణి సునీతను బరిలోకి దింపాలని బీఆర్ఎస్ ప్రతిపాదిస్తోందని అంటున్నారు. గోపీనాథ్ భార్య సునీత అయితే సానుభూతి ఓట్లతో సులువుగా గట్టెక్కవచ్చని బీఆర్ఎస్ అంచనా వేస్తోందని చెబుతున్నారు. దీంతో ఆమె అభ్యర్థిత్వం ఖరారయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.

బీఆర్ఎస్ టికెట్ కోసం తీవ్ర పోటీ

మాగంటి కుటుంబ సభ్యులతోపాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీకి చాలామంది ఉవ్విళ్లూరుతున్నారు. నగరంలో బీఆర్ఎస్ కు పట్టున్న నియోజకవర్గాల్లో ఒకటైన జూబ్లీహిల్స్ లో గెలుపు ఈజీ అన్న అంచనాతో పలువురు బీఆర్ఎస్ నేతలు టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే విష్ణువర్థన్ రెడ్డి జూబ్లీహిల్స్ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరిన విష్ణువర్థన్ రెడ్డి ఎమ్మెల్యే మరణంతో ఖాళీ అయిన స్థానాన్ని ఆశిస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం విష్ణు కుటుంబ సభ్యులకు చిరపరిచితంగా చెబుతారు. దీంతో తనకు టికెట్ ఇస్తే గెలిచి వస్తానని ఆయన బీఆర్ఎస్ పెద్దలపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ సీనియర్ నేత రావుల శ్రీధర్ రెడ్డి సైతం టికెట్ ఆశిస్తున్నారు. 2018 ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన రావుల అనంతరం బీఆర్ఎస్ లో చేరారు. రాష్ట్ర విద్యా మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ గా పనిచేసిన రావులకు కూడా ఈ నియోజకవర్గంలో బలమైన అనుచర గణం ఉంది. దీంతో ఆయన కూడా పోటీకి సై అంటున్నారు. అయితే బీఆర్ఎస్ అధిష్టానం మాత్రం మాగంటి సతీమణి సునీత అభ్యర్థిత్వంపైనే ఆసక్తి చూపుతోందని అంటున్నారు.

Tags:    

Similar News