నేనొక్కసారి చెబితే.. 100 సార్లు చెప్పినట్లే.. జీవన్ రెడ్డి ఇంట్రెస్టింగ్ పోస్టర్

ఇక ప్రస్తుతం ఓ సీనియర్ నేత తన రాజీనామా విషయంపై స్పష్టత ఇస్తూ ఇదే డైలాగ్ ను వాడటం విశేషంగా చెబుతున్నారు. కాకపోతే ఈ పాపులర్ తెలుగు డైలాగును ఆ సీనియర్ నేత ఇంగ్లీషులో పెట్టారు.;

Update: 2026-03-23 15:30 GMT

బాషా ఒక్కసారి చెబితే వంద సార్లు చెప్పినట్లే.. రజనీకాంత్ సినిమాలో పాపులర్ అయిన ఈ డైలాగ్ ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉంటుంది. వివిధ సందర్భాల్లో ఈ డైలాగ్ ను వాడుతుంటారు. ఎవరికి అనువైన విధంగా వారు అన్వయించుకుంటారు. బాషా సినిమా విడుదలైన నుంచి ఈ డైలాగ్ తెలుగు వారి ఫేవరెట్ గా మారింది. ఇక ప్రస్తుతం ఓ సీనియర్ నేత తన రాజీనామా విషయంపై స్పష్టత ఇస్తూ ఇదే డైలాగ్ ను వాడటం విశేషంగా చెబుతున్నారు. కాకపోతే ఈ పాపులర్ తెలుగు డైలాగును ఆ సీనియర్ నేత ఇంగ్లీషులో పెట్టారు.

కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పాలని డిసైడ్ అయిన తెలంగాణ సీనియర్ నేత, మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డి బాషా సినిమా డైలాగ్ చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు గతంలో ప్రకటించిన జీవన్ రెడ్డి తన నిర్ణయంలో మార్పు లేదని, రాదని స్పష్టత ఇచ్చేందుకు ‘నేను ఒకసారి చెబితే వంద సార్లు చెప్పినట్లే..’ అన్న డైలాగ్ ఉన్న పోస్టర్ ను తన కార్యాలయంలో ప్రదర్శించారు. ఈ పోస్టర్ పై తన ఫొటోతోపాటు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఫొటోను కూడా ముద్రించడం గమనార్హం.

కాంగ్రెస్ పార్టీలో పరిణామాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న జీవన్ రెడ్డి ఇకపై అవమానాలు భరించలేనని ప్రకటించారు. తన రాజీనామాను ఈ నెల 25న అధికారికంగా ప్రకటిస్తానని అనుచరులకు సమాచారం ఇచ్చారు. ఇంతకాలం తనతో కలిసి నడిచిన నాయకులు, కార్యకర్తలు వెంట నడవాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ కోసం తాను దశాబ్దాలుగా పోరాడితే ఆ ఫలితాన్ని వేరెవరో కాజేయడాన్ని చూస్తూ ఊరుకోలేకపోతున్నానని జీవన్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన సీఎం రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేతగా వ్యవహరించిన డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ఎంతలా పనిచేశారో ఎమ్మెల్సీ హోదాలో తాను అంతే కష్టపడ్డానని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

వారిద్దరు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిగా ఉండగా, తాను కనీసం మంత్రి పదవి పొందడానికి అర్హుడిని కాదా? అంటూ ప్రశ్నించారు. పార్టీ కోసం ఒంటరి పోరాటం చేసిన తాను మంత్రి పదవి ఆశిస్తే తప్పేంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మండలి సభ్యుడిగా తనకు 20 నెలల పదవీ కాలం ఉన్నప్పటికీ మంత్రి పదవి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక జీవన్ రెడ్డి తాజా వ్యాఖ్యలు, ఆయన కార్యాలయంలో ప్రదర్శించిన పోస్టరుతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం ఖాయంగా తేలిపోయిందని అంటున్నారు. ఆయనను బుజ్జగించేందుకు మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

Tags:    

Similar News