హెచ్‌-1బీ, గ్రీన్ కార్డ్ విధానాలపై జేడీ వాన్స్ సంచలన వ్యాఖ్యలు.. అనిశ్చితిలో భారతీయ టెక్కీల భవిష్యత్తు!

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వలస విధానాలపై చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు అగ్రరాజ్యంతో పాటు అంతర్జాతీయంగా.. ముఖ్యంగా భారతదేశంలో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.;

Update: 2026-04-15 04:46 GMT

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వలస విధానాలపై చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు అగ్రరాజ్యంతో పాటు అంతర్జాతీయంగా.. ముఖ్యంగా భారతదేశంలో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వం వలస చట్టాలను సమూలంగా మారుస్తున్న తరుణంలో హెచ్‌-1బీ వీసాదారులు.. గ్రీన్ కార్డ్ ఆశావహుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న కఠిన వైఖరిని వాన్స్ వ్యాఖ్యలు ప్రతిబింబిస్తున్నాయి.

వ్యవస్థలో లోపాలు.. దుర్వినియోగంపై ధ్వజం

జార్జియాలో జరిగిన ఒక బహిరంగ సభలో పాల్గొన్న వాన్స్‌కు గ్రీన్ కార్డ్ వెయిటింగ్ పీరియడ్ గురించి ఒక భారతీయ సంతతి యువతి నుండి ఊహించని ప్రశ్న ఎదురైంది. తన కుటుంబం ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరిస్తూ గ్రీన్ కార్డ్ కోసం వేచి చూసే సమయం 100 ఏళ్లకు పైగా ఉందని.. ఇది న్యాయమేనా అని ఆమె ప్రశ్నించింది. దీనికి స్పందించిన వాన్స్ ప్రస్తుతం ఉన్న హెచ్‌-1బీ వ్యవస్థలో భారీగా మోసాలు.. దుర్వినియోగం జరుగుతున్నాయని అంగీకరించారు. కొంతమంది ఈ లొసుగులను వాడుకుని వ్యవస్థను భ్రష్టు పట్టించారని.. అయితే నిజాయితీగా అమెరికా అభివృద్ధికి తోడ్పడుతున్న వలసదారుల కృషిని కూడా తాము గుర్తిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

ముందుగా మీరు అమెరికన్లు.. వాన్స్ పిలుపు

ఈ సందర్భంగా వాన్స్ ఒక కీలకమైన సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు. అమెరికాలో నివసించే వారు లేదా పౌరసత్వం కోరుకునే వారు తమ మాతృదేశం కంటే "అమెరికా ప్రయోజనాలకే" ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు. "వ్యవస్థ సక్రమంగా పనిచేయాలంటే, ఇక్కడ ఉండేవారు తమను తాము ముందుగా అమెరికన్లుగా గుర్తించుకోవాలి. తాము వచ్చిన దేశం పట్ల మమకారం కంటే అమెరికా బాగుండాలనే తపన ఎక్కువగా ఉండాలి" అని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ క్రమంలో తన మామగారిని ఉదాహరణగా చూపిస్తూ ఆయన భారతదేశం నుండి వచ్చినప్పటికీ ఎప్పుడూ అమెరికా ప్రయోజనాల గురించే ఆలోచిస్తారని.. అటువంటి దృక్పథమే వలసదారుల్లో ఉండాలని వాన్స్ సూచించారు. ఇది పరోక్షంగా వలసదారులు తమ సాంస్కృతిక మూలాల కంటే అమెరికన్ జాతీయవాదానికి కట్టుబడి ఉండాలనే సంకేతాన్ని ఇచ్చింది.

ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు

వాన్స్ వ్యాఖ్యలకు తోడు ట్రంప్ ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న నిబంధనలు వలసదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. 2026 ప్రారంభం నుండి అమల్లోకి వచ్చిన మార్పులు పరిశీలిస్తే హెచ్‌-1బీ కొత్త దరఖాస్తుల కోసం ఏకంగా 1 లక్ష డాలర్ల ఫీజును విధించడం చిన్న , మధ్యతరహా కంపెనీలకు పెను భారంగా మారింది.

వేతనాల పెంపు: 2026 ఫిబ్రవరి నిబంధనల ప్రకారం హెచ్‌-1బీ పొందాలంటే ఉండాల్సిన కనీస వేతనాన్ని ప్రభుత్వం భారీగా పెంచింది. దీనివల్ల కేవలం అత్యున్నత స్థాయి నైపుణ్యం కలిగిన వారికి మాత్రమే అమెరికాలో చోటు దక్కే అవకాశం ఉంది. సాధారణ ఉద్యోగాల కంటే అత్యధిక జీతాలు పొందే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, నిపుణులకే వీసాల్లో ప్రాధాన్యం ఇస్తున్నారు.

భారతీయులపై ప్రభావం

గ్రీన్ కార్డ్ కోసం దశాబ్దాలుగా వేచి చూస్తున్న లక్షలాది మంది భారతీయులకు ఈ పరిణామాలు మింగుడుపడటం లేదు. ఒకవైపు వీసా నిబంధనలు కఠినతరం చేయడం.. మరోవైపు గ్రీన్ కార్డ్ జారీలో జాప్యం తగ్గించకపోవడం వల్ల భారతీయ టెక్కీల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. అమెరికాను తమ సొంత గడ్డగా భావించి ఏళ్ల తరబడి పన్నులు కడుతున్న వారికి వాన్స్ చెప్పిన "అమెరికా ఫస్ట్" పాలసీ ఎంతవరకు ఊరటనిస్తుందో కాలమే నిర్ణయించాలి.

మొత్తానికి జేడీ వాన్స్ చేసిన ఈ వ్యాఖ్యలు అమెరికా వలస విధానంలో రాబోయే పెద్ద మార్పులకు సంకేతంగా నిలుస్తున్నాయి. మెరిట్ ఆధారిత వలసల పేరుతో ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయాలు అంతర్జాతీయ శ్రామిక మార్కెట్‌ను శాసించనున్నాయి.

Tags:    

Similar News