గాలి జనార్దన్ రెడ్డి మామూలు వ్యక్తి కాదు.. జేడీ సంచలన కామెంట్స్

గాలి జనార్దన్‌రెడ్డిని అరెస్ట్ చేయడం అంత సులభం కాలేదని, అనేక అడ్డంకులు ఎదురయ్యాయని ఆయన వెల్లడించారు.;

Update: 2025-05-07 08:19 GMT

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అక్రమాల కేసులో కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ వ్యాపారవేత్త గాలి జనార్దన్‌రెడ్డితో సహా పలువురికి నాంపల్లిలోని సీబీఐ కోర్టు ఇటీవల ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ నేపథ్యంలో ఈ కేసును దర్యాప్తు చేయడంలో కీలక పాత్ర పోషించిన నాటి సీబీఐ జాయింట్ డైరెక్టర్ వి.వి. లక్ష్మీనారాయణ, ఉరఫ్ జేడీ లక్ష్మీనారాయణ, ఆనాటి అనుభవాలను, కేసు విచారణలో ఎదురైన సవాళ్లను పంచుకున్నారు. గాలి జనార్దన్‌రెడ్డిని అరెస్ట్ చేయడం అంత సులభం కాలేదని, అనేక అడ్డంకులు ఎదురయ్యాయని ఆయన వెల్లడించారు.

-అరెస్ట్ వెనుక వ్యూహం: ఐటీ అధికారుల వేషంలో..

గాలి జనార్దన్‌రెడ్డిని అరెస్ట్ చేసే క్రమంలో తమకు తీవ్ర ఒత్తిడి ఎదురైందని జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు. కేసు నమోదు చేసిన తర్వాత దర్యాప్తును ఎటు నుంచి ప్రారంభించాలో కూడా తొలుత అర్థం కాలేదని, కొన్ని కీలక వ్యవస్థలు ఆయన వెనుక ఉండటంతో విచారణ ముందుకు తీసుకెళ్లడం సవాల్‌గా మారిందని ఆయన పేర్కొన్నారు. మైనింగ్ ప్రాంతం రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉండటంతో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల అధికారుల సహకారం అవసరమైందని, అయితే, ఈ విషయంలో అధికారుల నుంచి సహకారం పొందడం చాలా కష్టంగా మారిందని జేడీ వివరించారు. తాము విచారణకు వెళ్తున్నామని తెలిస్తే, కీలక అధికారులు సెలవులపై వెళ్లిపోయేవారని ఆయన పేర్కొన్నారు.

"సీబీఐ అధికారులుగా వెళ్తే గాలి జనార్దన్‌రెడ్డి మనుషులు అడ్డుకునే ప్రయత్నం చేస్తారని భావించాం. అందుకే, ఐటీ అధికారులమని చెప్పి, కేవలం తనిఖీల కోసమే వచ్చామని నమ్మించి ఆయనను అరెస్ట్ చేశాం" అని జేడీ ఆనాటి పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. అంతేకాకుండా, అరెస్ట్ వార్తను అత్యంత గోప్యంగా ఉంచడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డామని, తమ ఫోన్లను సైతం పక్కన పెట్టేశామని ఆయన చెప్పారు. అరెస్ట్ తర్వాత బెదిరింపులు వస్తాయని కొందరు అన్నా, పక్కా ఆధారాలతోనే కేసు ఫైల్ చేశామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

-బదిలీలతో విచారణ ఆలస్యం: ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి

కేసు విచారణను ఆలస్యం చేయడానికి అనేక ప్రయత్నాలు జరిగాయని జేడీ లక్ష్మీనారాయణ వెల్లడించారు. తమ చేతిలోని అధికారులను బదిలీ చేయించేవారని, దీంతో ఈ రోజు ఉన్న అధికారి రేపు ఉంటాడో ఉండడో తెలియని పరిస్థితిని ఎదుర్కొన్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి కేసులను విచారించేవారు సహజంగా ఎదుర్కొనే ఒత్తిళ్లు తనపైనా ప్రభావం చూపించాయని ఆయన అన్నారు. కేసు విచారణలో దాదాపు 14 సంవత్సరాలు జాప్యం జరగడానికి రాజకీయపరమైన బదిలీలు ఒక కారణమై ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇలాంటి కేసులు త్వరగా పరిష్కారం కావాల్సిన అవసరం ఉందని, ఇందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని జేడీ లక్ష్మీనారాయణ సూచించారు. అక్రమ మైనింగ్ కేసులో ఆలస్యమైనా న్యాయం జరిగిందని ఆయన పేర్కొన్నారు. నాంపల్లి సీబీఐ కోర్టు తీర్పుతో గాలి జనార్దన్‌రెడ్డితో పాటు బీవీ శ్రీనివాస్ రెడ్డి, వి.డి. రాజగోపాల్, మెఫూజ్ అలీ ఖాన్‌లకు ఏడేళ్ల జైలు శిక్ష, ఓఎంసీ కంపెనీకి జరిమానా పడింది. ఇదే కేసులో అప్పటి మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఐఏఎస్ అధికారి కృపానందంలను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. గతంలోనే ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మిని హైకోర్టు ఈ కేసు నుంచి డిశ్చార్జ్ చేసింది. విచారణ సమయంలో నిందితుల్లో ఒకరైన లింగారెడ్డి మరణించారు.

Tags:    

Similar News