వైసీపీ నెత్తిన పాలు పోస్తున్న కూటమి

పై స్థాయిలో చంద్రబాబు పట్ల పవన్ కళ్యాణ్ కి ఆరాధనాభావం ఉంది. అలాగే పవన్ పట్ల బాబుకు అభిమానం ఉంది.;

Update: 2025-07-16 17:53 GMT

పై స్థాయిలో చంద్రబాబు పట్ల పవన్ కళ్యాణ్ కి ఆరాధనాభావం ఉంది. అలాగే పవన్ పట్ల బాబుకు అభిమానం ఉంది. కానీ గ్రౌండ్ లెవెల్ లో చూస్తే అదేమీ కనిపించడం లేదు. పైగా పొలిటికల్ గ్రౌండ్ నుంచి ఒకరిని ఒకరు ఎలిమినేట్ చేసుకోవడానికి చూస్తున్నారు. దానికి అచ్చమైన ఉదాహరణ ఉమ్మడి చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గంగా చెప్పుకోవాలి.

ఇక్కడ కూటమి మధ్యన ఆది నుంచి సఖ్యత పెద్దగా లేదు. దానికి కారణం ఒకరితో మరొకరు పోటీ పడడం, రాజకీయ ఆధిపత్యం కోసం ఎందాకైనా అన్నట్లుగా వ్యవహరినడం. అమెరికాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగస్తులుగా ఉంటూ నెలకు చెరి పన్నెండు లక్షల జీతంతో హాయిగా గడిపే కోట వినుత, ఆమె భర్త చంద్రబాబు 2018 ప్రాంతంలో రాజకీయాలపైన మక్కువతో సొంత ప్రాంతానికి వచ్చేశారు. ఇక కోట వినుత జనసేనలో చేరారు. 2019 ఎన్నికల్లో ఆమె ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు.

ఇక 2024లో పొత్తులలో భాగంగా ఈ సీటుని ఆమె కోరుకున్నారు. కానీ దక్కలేదు. బొజ్జల సుధీర్ రెడ్డికి ఈ సీటు ఇచ్చారు. ఎన్నికల వేళ ఎలా ఉన్నా గత పదమూడు నెలలుగా మాత్రం టీడీపీ వర్సెస్ జనసేన గానే కధ నడుస్తోంది. దాంతో వ్యవహారం ఇపుడు ఎంత దూరం వెళ్ళింది అంటే కోట వినుత దగ్గర డ్రైవర్ గా పనిచేసిన రాయుడు అన్న యువకుడు హత్యకు గురి అయ్యాడు. ఆ హత్య కోట వినుత దంపతులు చేశారు అని తేలడంతో వారిని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. అలా వారు జైలులో ఉన్నారు.

ఇక విచారణ సందర్భంగా తమ మీద నిఘా పెట్టి తమ విషయాలు అన్నీ సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే తమ డ్రైవర్ రాయుడుని లోబరచుకుని సేకరించారని వినుత దంపతులు పోలీసులకు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ విధంగా బొజ్జల సుధీర్ ని ఈ కేసులోకి తెస్తున్నారు. మరి కోట వినుత దంపతులు చేస్తున్న ఆరోపణలు నిజమైతే మాత్రం బొజ్జల మెడకు కూడా ఈ ఉచ్చు బిగుస్తుందని అంటున్నారు.

ఇక శ్రీకాళహస్తిలో రెండు పార్టీల నేతలు పరస్పరం చేసుకుంటున్న ఆరోపణలతో కూటమి వీధిన పడినట్లు అయింది. నిజానికి గత ఏడాదిగానే కూటమిలో ఈ రెండు పార్టీల మధ్య భారీ గ్యాప్ వచ్చింది. మంత్రులతో తమ మీద కోట దంపతులు ఫిర్యాదులు చేస్తున్నారు అని ఎమ్మెల్యే అనుచరులు అంటున్నారు. అయితే తమకు సరిగ్గా న్యాయం చేయడం లేదని మిత్ర పక్షంగా గౌరవం లేదని జనసేన నేతలు అంటున్నారు.

ఇపుడు కోట దంపతులు ఎటూ జైలులో ఉన్నారు. ఇపుడు టీడీపీ వారిని లాగే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మొత్తం ఇష్యూలో కూటమి ప్రతిష్ట అయితే దెబ్బ తిన్నది. సరిగ్గా ఇదే సమయం అని వైసీపీ మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి రంగంలోకి వస్తున్నారు. ఆ రెండు పార్టీల వ్యవహారాన్ని ఆయన అనుచరులు ఎండగడుతున్నారు. శ్రీకాళహస్తి వైసీపీ బలంగానే ఉంది. 2024 ఎన్నికల్లోనూ ఏకంగా 78 వేలకు పైగా ఓట్లు తెచ్చుకుంది. ఇపుడు కూటమి కుమ్ములాటలు తమకు కలసివస్తున్నాయని వైసీపీ నేతలు సంబరపడుతున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News