పల్లె వైపు జనసేన చూపు
ఏ రాజకీయ పార్టీకి అయినా మంచి బేస్ ఉండాలి అంటే గ్రామాలలో పట్టు ఉండాలి. తెలుగుదేశం ఇన్నేళ్ళ పాటు కొనసాగినా వైసీపీ అధికారంలోకి వచ్చిన పల్లెలలో ఆదరణ అతి ముఖ్య కారణం అన్నది తెలిసిందే.;
ఏ రాజకీయ పార్టీకి అయినా మంచి బేస్ ఉండాలి అంటే గ్రామాలలో పట్టు ఉండాలి. తెలుగుదేశం ఇన్నేళ్ళ పాటు కొనసాగినా వైసీపీ అధికారంలోకి వచ్చిన పల్లెలలో ఆదరణ అతి ముఖ్య కారణం అన్నది తెలిసిందే. జనసేన ఏపీలో మూడవ రాజకీయ పార్టీగా కొనసాగుతోంది. అయితే రెండు పెద్ద పార్టీల మధ్య తనకంటూ స్పేస్ ని పెంచుకునే ప్రయత్నంలో ఆ పార్టీ ఉంది. 2024 లో కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యం అయి అధికారంలో వాటా సాధించిన తరువాత జనసేన పార్టీ పటిష్టత కోసం గట్టి ప్రయత్నాలే చేస్తోంది.
రూరల్ సెక్టార్ ఫోకస్ :
గ్రామీణ ప్రాంతాలలో టీడీపీ అయితే బూత్ లెవెల్ వరకూ ఉంది క్షేస్త్ర స్థాయిలో ఆ పార్టీ స్ట్రాంగ్ గా ఉంది. వైసీపీకి మొదటి నుంచి పల్లెలలోనే జనాదరణ ఉంది. జగన్ కి మాస్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి పల్లెలను ఆ పార్టీ ఆకట్టుకుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినీ గ్లామర్ నిండుగా కలిగిన వారు. అయితే రాజకీయంగా చూస్తే జనసేన ఇంకా విస్తరించాల్సి ఉంది ఆ పార్టీకి అభిమానులే ఈ రోజుకీ సైన్యంగా ఉన్నారు. వారితో పాటుగా జనం నుంచి ఇంకా పెద్ద ఎత్తున పార్టీ సానుభూతిపరులను తీసుకుని జనసేనను బలోపేతం చేసుకోవాలని అధినాయకత్వం భావిస్తోంది. దాంతోనే ఉద్యమి పేరుతో సభ్యత్వ నమోదుని ఈ మధ్యన ప్రారంభించింది.
స్థానిక ఎన్నికల్లోనూ :
సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా పార్టీ గడువు పెంచుకుంటూ వెళ్ళడం వెనక రూరల్ వైపు దృష్టి పెట్టడం అన్న కాన్సెప్ట్ ఉందని అంటున్నారు. రూరల్ లోనే ఎక్కువగా సభ్యత్వ నమోదు చేయించాలని చూస్తున్నారు. ఆ దిశగా పార్టీ విజయవంతమైన వ్యూహాలను కూడా రచిస్తోంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికలను కూడా జనసేన ఒక చాలెంజ్ గా తీసుకుంటోంది. ఈసారి మండలాలు, పంచాయతీల మీద ఎక్కువ దృష్టి పెట్టాలని చూస్తోంది. అక్కడ కనుక గెలుచుకుంటే రానున్న రోజులల్లో పార్టీ పునాదులు గట్టి పడతాయని ఫలితంగా కొత్తగా పెరిగే అసెంబ్లీ సీట్లలో కూడా తమ పార్టీ ప్రాతినిధ్యాన్ని పెంచుకోవచ్చు అని ఆలోచన చేస్తోంది.
పంచాయతీ రాజ్ శాఖతో :
ఇక పవన్ కూడా పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలను తీసుకున్నారు. ఆ విధంగా కూటమి ప్రభుత్వం ద్వారా పవన్ చేసే మంచిని వివరించడం ద్వారా పల్లె పట్టులో తమ పట్టును ఎక్కువగా చేసుకోవాలని జనసేన చూస్తోంది. పది కాలాల పాటు పార్టీ నిలిచి గెలిచి ఉండాలంటే గ్రామీణం పైనే ఆలోచనలు చేయాలని జనసేన వ్యూహకర్తలు భావిస్తున్నారు. అయితే జనసేన పల్లె వైపు పెడుతున్న ఫోకస్ తో ఏ పార్టీకి దెబ్బ అన్న చర్చ సాగుతోంది. వైసీపీ విపక్షంలో ఉంది కాబట్టి ఆ పార్టీ నుంచే వాటా తీసుకుని బలపడాలని జనసేన వంటి పార్టీలు చూడడం సహజం. అదే సమయంలో వైసీపీకి కూడా స్ట్రాంగ్ హోల్డ్ రూరల్ లో ఉంది. ఇప్పటికి పదిహేనేళ్ళుగా అది కొనసాగుతోంది. మరి అటు నుంచి ఇటు మార్పు ఉంటుందా లేక ఏ వైపు నుంచి జనసేన విస్తరణకు అవకాశం ఉంది అన్నదే కీలక చర్చగా ఉంది.