జనసేన వ్యూహం బూమరాంగ్ అవుతోందా ?
జనసేన ఈ ప్రకటన చేయడానికి వెనక ఒక వ్యూహం ఉందని చెబుతారు. వైసీపీని ఒంటరి చేసే వ్యూహం అది.;
రాజకీయం అంటే నిరంతరం సాగే నదీ ప్రవాహం లాంటిది అది ఒక మలుపు దగ్గరో లేక ఒక పిలుపు వద్దనో ఆగేది కాదు. క్షణక్షణం రాజకీయం మారుతుంది. అందువల్ల మారే రాజకీయానికి గ్యారంటీలు ఉండవు. అయితే రాజకీయాల్లో భవిష్యత్తు ఆలోచనలు ఉండడంలో తప్పు అయితే లేదు, జనాలకు భరోసా ఇవ్వడం కూడా తప్పేమీ కాదు. కానీ ప్రతీ సారీ పదే పదే ఇవ్వాల్సిన అవసరం ఉందా అన్నదే చర్చ.
జనసేన అతి ఉత్సాహం :
దేశంలో ఎన్నో పార్టీలు కూటములు కట్టి అధికారంలోకి వచ్చాయి. పొత్తులు పెట్టుకోవడం కూడా కొత్త కాదు. అయితే గెలిచిన పార్టీలు మేము కలిసే ఉంటామని ఒట్టు పెట్టి బొట్టు పెట్టి చెప్పిల దాఖలాలు లేవు. ఎందుకంటే భవిష్యత్తులో ఎలా ఉంటుందో అన్నది ఒక ఎత్తు అయితే ఆ భవిష్యత్తు తమదే కావచ్చు అన్న పెద్ద ఆశ కూడా దాని వెనకాలే ఉంటుంది కాబట్టి. కానీ జనసేన మాత్రం కూటమి పార్టీలు కలిసే ఉంటాయి అని ప్రతీ సారీ చెబుతూనే ఉంటోంది. దాని వల్ల ఏమిటి ప్రయోజనం అన్నది కూడా విశ్లేషించుకోవాల్సి ఉంది.
వైసీపీకి చాన్స్ లేదనే :
జనసేన ఈ ప్రకటన చేయడానికి వెనక ఒక వ్యూహం ఉందని చెబుతారు. వైసీపీని ఒంటరి చేసే వ్యూహం అది. నరేంద్ర మోడీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ వారికి చెందిన మూడు పార్టీలు ఒక్కటిగా ఉంటే ఎప్పటికీ వైసీపీ గెలవలేదు అన్న సందేశం రాజకీయ జీవులతో పాటుగా సగటు జనాలకు కూడా పంపించాలన్నదే ప్లాన్. అంతే కాదు అవతల పక్షం లో ఆశావహులు ఎవరైనా ఉంటే వారి ఆశలను నీరు కార్చి ఈవైపుగా మళ్ళించే వ్యూహం కూడా ఇందులో ఉంది. ఇక తమ కూటమి బలమైనది అని చెప్పుకోవడం ద్వారా ఎప్పటికైనా గెలిచేది నిలిచేది తమ కూటమి అన్నది బాగా ఎస్టాబ్లిష్ చేయడం కూడా ఉంది.
నిట్ట నిలువు విభజన :
అయితే ఈ వ్యూహం ఇలాగే ఫలించాలి అన్నది అయితే రాజకీయ లెక్కలలో ఎక్కడా లేదు. వేరేగానూ కావచ్చు. కూటమి కడితే బలం అన్నది ఎంత నిజమో అంత భ్రమ కూడా ఇందులోనే ఉంది. అప్పటి పరిస్థితులు కూడా కలసి వస్తేనే ఏ కూటమి అయినా నిలిచి గెలుస్తుంది. అంటే అన్ని సార్లూ రెండూ రెండూ కలిస్తే నాలుగు కావు అన్న మాట. పైగా జనసేన పదే పదే ఇస్తున్న ఈ తరహా ప్రకటనల వల్ల ఏపీ రాజకీయంలో ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. అంతే కాదు ఒక కచ్చితమైన విభజన కూడా ఏర్పడుతుంది
యాంటీ ఇంకెంబెన్సీ ఒక్కటిగా :
సాధారణంగా ప్రభుత్వం వర్సెస్ ప్రతిపక్షం అన్నట్లుగానే రాజకీయం ఉంటుంది. జనాలు కూడా అలాగే చూస్తారు. ప్రభుత్వంలో ఎన్ని పార్టీలు ఉన్నాయి. కూటమా అన్న దాని కంటే అందరికీ కలిపి సర్కార్ గానే చూస్తారు. ఇక ప్రభుత్వం వ్యతిరేకత కూడా మరో చోట పోగు అవుతూ ఉంటుంది. పాజిటివిటీ ఉంటే కూటమికి దక్కుతుంది. యాంటీ ఇంకెంబెన్సీ ఉంటే అది కచ్చితంగా వైసీపీ ఖాతాలోకి పోతుంది. ఎందుకు అంటే కూటమి గా పది నుంచి పదిహేనేళ్ళు మేమే ఉంటామని జనసేన అనేక సార్లు చెబుతూ వస్తోంది. దాంతో జనాలు సర్కార్ పనితీరు బాగుంటే కూటమి కట్టారా లేదా అన్నది చూడకుండా ఓటేస్తారు కాదూ అనుకుంటే ఎదుటి విపక్షాన్ని ఎంచుకుంటారు.
ఆల్టర్నేషన్ వైసీపీనే :
కూటమిలో అంతా కలసి ఉన్నా ఒక ఒరలో చాలా కత్తులు ఉన్నాయి. అక్కడ ఊపిరాడని వారు ఉంటారు. అదే విధంగా అవకాశాల కోసం చూసే వారు ఉంటారు. ఒక్క చాన్స్ ఒక్క టెర్మ్ అంటే సర్దుకోవచ్చేమో కానీ అలా కాదు శాశ్వతం ఈ బంధం అనుకుంటే ఎవరి లెక్క వారికి ఉంటుంది. దాంతో అలాంటి వారికి కూడా కోరి తలుపులు తీసి దారులు చూపించినట్లు కూడా అవుతుంది అని అంటున్నారు.
వారిలో నిరాశగా :
కూటమి అనేక ఏళ్ళు అంటే తమ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకునే జనసైనికులకు కూడా ఇది నిరశను కలిగించే విషయం అవుతుంది. అంతే కాదు జనసేనలోకి వచ్చే వారికి తలుపులు మూసేసినట్లు అవుతుంది. అలాగే ఎప్పటికపుడు ఏ ఎన్నికకు ఆ ఎన్నికలో మార్చుకోవాల్సిన ఎత్తులు పొత్తులు వ్యూహాలు కూడా ముందే ఓపెన్ చేసుకుంటే సీట్ల దగ్గర బేరమాడే శక్తి కూడా తగ్గిపోతుంది అని అంటున్నారు. ఏది ఏమైనా కూటమిలో మిగిలిన రెండు పార్టీలూ ఈ విషయంలో ప్రతీ సారీ స్పందించడం లేదు ఒక్క జనసేన మాత్రమే బలంగా చెబుతోంది అన్నది కూడా అది బలమా లేక బలహీనత అన్నది కూడా చర్చకు వస్తుంది అని అంటున్నారు.