జనసేన ఒంటరి పోటీ ఎవరికి లాభం.. ?
దీంతోనే 2024లో పట్టుబట్టి టీడీపీ+ బీజేపీలను ఒకే వేదికపైకి చేర్చి జనసేన పోటీ చేసింది. తద్వారా తాను లబ్ధిపొంది.. ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి వచ్చింది.;
ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారం.. తమిళనాడులో విజయ్‌పార్టీ టీవీకే ఒంటరిగా నిలిచి సత్తా చాటిందని.. ఏపీలో మాత్రం జనసేన ఒంటరిగా పోటీ చేసేందుకు వెనుకంజ వేస్తోందని!. దీనిలో వాస్తవం లేకపోలేదు. 2019 ఎన్నికల్లో జనసేన దాదాపు ఒంటరిగానే బరిలో నిలిచింది. కమ్యూనిస్టులు, బీఎస్పీ వంటి వాటితో పొత్తు పెట్టుకున్నా.. అవి పెద్దగా లెక్కలోకిరాలేదు. ఒకరకంగా జనసేన ఒంటరి పోరాటమే చేసింది. కానీ, ఫలితం దక్కలేదు.
దీంతోనే 2024లో పట్టుబట్టి టీడీపీ+ బీజేపీలను ఒకే వేదికపైకి చేర్చి జనసేన పోటీ చేసింది. తద్వారా తాను లబ్ధిపొంది.. ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి వచ్చింది. ఇదే ఫార్ములాను వచ్చే 15 సంవత్సరాలు కూడా అమలు చేయాలన్నది జనసేన వ్యూహం. కానీ, ప్రత్యర్థులు.. అదేసమయంలో రాజకీయ విశ్లేషకులు మాత్రం జనసేన ఒంటరిగా ఎందుకు పోటీ చేయదంటూ.. మళ్లీ ప్రశ్నిస్తున్నారు. దీనికి విజయ్‌ను ఉదాహరణగా చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన ఒంటరిగా పోటీచేస్తే.. ఎవరికి లాభం.. ఎవరికి నష్టం అనే ప్రశ్నలు తెరమీదికి వస్తున్నాయి.
ఎవరికి లాభం..?
ఈ దఫా జనసేన ఒంటరిగా పోటీచేస్తే.. ఆ పార్టీకి ఖచ్చితమైన లాభం ఉంటుందన్న అంచనాలు వస్తున్నాయి. 2019లో లెక్కవేరు.. ప్రస్తుత లెక్క వేరని పరిశీలకులు చెబుతున్నారు. గత రెండేళ్ల కాలంలో పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా.. ఇతర శాఖ లమంత్రిగా చేస్తున్న పనులు, రాజకీయంగా పార్టీలో కొన్ని ఒడిదుడుకులు వచ్చినా.. ఆయన పాటిస్తున్న సంయమనం వంటివి సాధారణ ప్రజలను కూడా మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ఇక, అభివృద్ధిపరంగా కూడా.. పంచాయతీలను డెవలప్ చేస్తున్నారు.
అంటే.. 2019 ఎన్నికల సమయంలో పవన్‌పై ఉన్న ఇమేజ్‌కు భిన్నంగా ఇప్పుడు పాలన పరంగా ఆయన ఇమేజ్ పెరిగిందన్న వాదన వినిపిస్తోంది. దీనికితోడు.. జనసేనలో క్షేత్రస్థాయి ఎమ్మెల్యే ల పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ.. పార్టీ అధినేతగా పవన్‌కు ఎలాంటి మచ్చలు మరకలు లేవు. పైగా.. గ్రామీణ, గిరిజిన, ఎస్సీ సామాజికవ ర్గాలకు ఆయన మరింత చేరువ అయ్యారు. పట్టణాలు, నగరాల్లోనూ `ఫీల్ గుడ్ లీడర్`గా చూస్తున్నారు. ఈ పరిణామాలతో జనసేన కనుక ఒంటరిగా పోటీ చేసినా.. ఆ పార్టీకి లాభం చేకూరుతుందని మెజారిటీ విశ్లేషకులు చెబుతున్నారు. పైగా వైసీపీకి ఇది భారీ దెబ్బ అని అంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైనా ఉంటే.. అది ఈ దఫా జనసేనకు పడుతుందని కూడా చెబుతున్నారు.