పేరెత్తకుండానే పవన్ మీద అదిరిపోయే పంచులు !

అది ఆయన రాజకీయం అనుకుంటే అసలు పేరే ఎత్తకుండా పవన్ మీద పంచులేయడం జగన్ మార్క్ పాలిటిక్స్.;

Update: 2023-10-09 13:30 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎపుడూ ఎక్కడా కనీసంగా కూడా ప్రస్థావించరు. ఆయనను దత్తపుత్రుడు అని ట్యాగ్ చేసి మాట్లాడుతూంటారు. దాని మీద జనసేన నేతలు కూడా ఫైర్ అవుతూంటారు. జనసేన నాయకుడు నాగబాబు కూడా జగన్ మా నాయకుడి పేరు చెప్పరు కదా మేము కూడా ఆయన పేరు ఎత్తకుండానే విమర్శలు చేస్తామని ఆ మధ్యన అన్నారు.

కానీ పవన్ సభలలో వందల సార్లు జగన్ నామస్మరణమే ఉంటుంది అన్నది అందరికీ తెలిసిందే. ప్రతీ మాటకూ ముందూ వెనక జగన్ అంటూ పవన్ మాట్లాడుతారు. అది ఆయన రాజకీయం అనుకుంటే అసలు పేరే ఎత్తకుండా పవన్ మీద పంచులేయడం జగన్ మార్క్ పాలిటిక్స్. ఆయన విజయవాడలో జరిగిన పార్టీ సభలో మాట్లాడుతూ పదిహేనేళ్ల క్రితం ఒకాయన పార్టీ పెట్టారు. ఈ రోజుకీ ఆయన ఎక్కడ ఉన్నారో రాజకీయంగా ఎలా ఉన్నారో అందరికీ తెలుసు అని చెప్పగానే సభలో నవ్వులు విరిసాయి.

జగన్ చెప్పేది పవన్ గురించే అని అర్ధమయ్యేసరికి వైసీపీలో కొత్త హుషార్ కనిపించింది. ఆయన ఎంతసేపూ తన పార్టీ గురించి తన గురించి అసలు ఏ కోశానా ఆలోచనే చేయడు, చంద్రబాబు పల్లకీ మోయడానికి మాత్రం తయారుగా ఉంటాడని జగన్ సెటైర్లు వేశారు. ప్రతీ గ్రామంలో తన పార్టీ జెండా ఎగరాలని, ప్రతీ నియోజకవర్గంలో తమ పార్టీ మనుషులు ఉండాలని ఆ పెద్ద మనిషీ ఏ రోజునా కోరుకోలేదంటూ చురకలు వేశారు.

చంద్రబాబుతో దోస్తీ కట్టి ఆయన తో ఉంటే చాలు అనుకుంటాడని ఆయన రాజకీయం అంతా ఇదే అని ఎద్దేవా చేశారు. వీరికి అసలు రాజకీయం అంటే ఏంటో తెలుసా అని జగన్ ప్రశ్నించారు. రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడానికి వారు మేలు కోరుకోవడానికి అన్నది తెలియకపోబట్టే వీరంతా ఇలా చేస్తున్నారని జగన్ విమర్శించారు.

చంద్రబాబు పార్టనర్ గా ఉంటే చాలు అదే పాలిటిక్స్ అనుకుంటున్నారని కూడా పవన్ మీద హాట్ కామెంట్స్ చేశారు. ఇదే పెద్ద మనిషి సమర్ధించిన చంద్రబాబు పాలనలో ఏపీకి ప్రజలకు ఏమైనా మేలు జరిగిందా అని ఆయన ప్రశ్నించారు. అలా మంచి చేస్తే పొత్తులు ఎందుకని కూడా జగన్ అన్నారు. అంతా కలసి రావాలని కూడగట్టుకుని వైసీపీ మీద యుద్ధం చేయలని చూస్తున్నారని జగన్ అన్నారు.

అయితే ఈ కురుక్షేత్ర యుద్ధంలో ప్రజల పక్షాన ఉండే వైసీపీదే విజయం అన్నారు. తాము దేవుడిని ప్రజలను తప్ప ఎవరినీ నమ్ముకోమని అన్నారు. వైసీపీ పొత్తులు అన్నీ కూడా ప్రజలతోనే తప్ప ఎవరితోనూ ఉండవని జగన్ తేల్చి చెప్పారు. తాము డేరింగ్ గా ముందుకు అడుగులు వేస్తున్నామని విపక్షాలు మాత్రం అంతా కలసిపోయాయని జగన్ ఎద్దేవా చేశారు. మొత్తానికి చూస్తే పదిహేనేళ్ళ రాజకీయ జీవితంలో పవన్ సాధించింది శూన్యమని బాబు పల్లకీ మోత తప్ప మరేదీ చేయలేకపోయారని ఘాటుగానే జగన్ విమర్సించారు.

Tags:    

Similar News